Asleep
Afternoon Sleep : మనిషి జీవనప్రయాణంలో నిద్ర అనేది ఒక బాగం. ఆరోగ్యంగా, ప్రశాంతంగా జీవించాలంటే తగినంత నిద్ర అవసరం. ప్రస్తుత ఉరుకుల పరుగుల యాంత్రీకరణ జీవన విధానంలో నిద్రకు తగినంత సమయం కేటాయించక చాలా మంది అనారోగ్యాలను కొని తెచ్చుకుంటున్నారు. ప్రతి మనిషికి తగినంత నిద్ర అవసరం ఎంతైనా ఉంది. ఆరు గంటలకన్నా తక్కవగా నిద్రపోవటం ఆరోగ్యానికి ఏమంత మంచిది కాదు.. అలాగని 10 గంటలకన్నా మించి ఎక్కవ సమయం నిద్రించటం వల్ల అనర్ధాలు తప్పవంటున్నారు నిపుణులు.
ఇక అసలు విషయానికి వస్తే చాలా మంది రాత్రిళ్ళు నిద్ర పట్టక ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి వారు పగటి పూట నిద్ర పోతుంటారు. మరికొందరు రాత్రి పూట నిద్ర పోవటంతోపాటు, పగలు మధ్యాహ్న సమయాల్లో భోజనం తరువాత నిద్రకు ఉపక్రమిస్తారు. ఎక్కవగా అలసిపోయిన సందర్భాల్లో మధ్యాహ్న సమయాల్లో నిద్రవస్తుంది. పగటి నిద్ర ఆరోగ్యానికి ఏమంత శ్రేయస్కరం కాదని నిపుణులు అంటున్నారు. దీర్ఘకాలం పగటి నిద్ర కొనసాగితే ఆరోగ్యసమస్యలు చుట్టుముట్టే అవకాశం లేకపోలేదని స్పష్టం చేస్తున్నారు.
మధ్యాహ్నం సమయాల్లో నిద్రపోయే అలవాటు ఉన్నవారిలో అధిక బరువు పెరగటంతోపాటు, గుండె జబ్బులు, షుగర్ వంటి వ్యాధుల బారిన పడే అవకాశాలు మెండుగా ఉంటాయి. తద్వారా అర్ధాయుష్కులుగా మారుతారు. రాత్రి సరిగ్గా నిద్రపోని వారు మధ్యాహ్నం సమయాల్లో నిద్రిస్తుంటారు. రాత్రిపూట నిద్రపట్టలేదని మధ్యాహ్నం పూట నిద్రించటం వల్ల ఏమాత్రం ప్రయోజనం ఉండదు. రాత్రి నిద్రకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూసుకోవటం మంచిది.
ఒకవేళ మధ్యాహ్నం నిద్ర పోవాల్సి వస్తే 20 నుండి 30 నిమిషాలు మాత్రమే నిద్రించటం మంచిది. అంతా అనుకునే విధంగా ఒక్క కునుకు మాత్రమే తీయటం వల్ల కొన్ని ఆరోగ్యకరమైన ప్రయోజనాలు చేకూరే అవకాశాలు లేకపోలేదు. అలాగని మధ్యాహ్నం పడుకుని అదే పనిగా గంటల తరబడి నిద్రించటం వల్ల కోరి సమస్యలను కొని తెచ్చుకోవాల్సి వస్తుంది.
మధ్యాహ్నం సమయంలో అధికంగా నిద్రపోయే వారిలో ఆరోగ్యంపరమైన ఇబ్బందులు దీర్ఘకాలంలో ఎక్కువగా కనిపిస్తాయి. కొరియా, జపాన్ వంటి దేశాల్లో ఉద్యోగులు మధ్యాహ్నం సమయంలో అరగంటపాటు కునుకు తీస్తారట. ఇలా చేయటం వల్ల ప్రయోజనాలు కలుగుతాయని వారు భావిస్తారు. 30 నిమిషాలకు మించకుండా ఒక్క కునుకు తీయ్యటం వల్ల మెదడు చురుకుగా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.