Bananas Black Spots
Bananas : అరటి పండు అంటే అంతా ఇష్టంగా తింటారు. జీర్ణక్రియ సక్రమంగా జరిగేందుకు అరటి పండు తోడ్పడుతుంది. మార్కెట్లో అందరికి అందుబాటు ధరలో లభించే చౌకైన పండ్లలో అరటి పండుకూడా ఒకటి. తక్షణ శక్తిని అందించటంలో అరటిపండును మించింది లేదని చెప్పవచ్చు. ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచుతాయి. శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు, విటమిన్లు మరియు ఖనిజాలు మరియు సహజ చక్కెరను అందిస్తాయి. అందుకే దీనిని సూపర్ ఫుడ్ గా చెప్తారు. విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియంతో కూడిన అరటిపండు అల్పాహారంగా తీసుకోవచ్చు.
అధ్యయనాల ప్రకారం, అరటిపండులో ఫైబర్‌తో కలిపి సుక్రోజ్, ఫ్రక్టోజ్ మరియు గ్లూకోజ్ అనే మూడు సహజ చక్కెరలు ఉంటాయి. అరటి పండులో ఉన్న పొటాషియం గుండెపై ఒత్తిడి తగ్గించడానికి సహాయపడుతుంది. అరటిలో ఫైబర్, పొటాషియం, ఫోలేట్ మరియు విటమిన్ సి వంటి యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవన్నీ గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయి. అరటిపండ్లలో ఉన్న లెక్టిన్ అనే ప్రోటీన్ లుకేమియా కణాలు పెరగకుండా నిరోధిస్తాయని పరిశోధనలు సూచిస్తున్నాయి. లుకేమియా కణాలు క్యాన్సర్ కారకాలు. లెక్టిన్ యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది.
నల్ల మచ్చలు ఉన్న అరటిపండ్లను ఎందుకు తినాలి?
అరటిపండు చర్మంపై నల్లటి మచ్చలు ఉంటే చాలా మంది అవి కుళ్ళినట్లుగా భావిస్తారు. అయితే అలా భావించటం సరైంది కాదు. అరటి పండుపై నల్లటి మచ్చలు ఏర్పడుతుంటే ఆ అరటి పండు పక్వానికి వస్తుందన్న సంకేతంగా గుర్తించాలి. అరటిపండ్లపై నలుపు, గోధుమ రంగు మచ్చలు ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిది. అరటిపండుపై ఉన్న నల్ల మచ్చలు ట్యూమర్ నెక్రోసిస్ ఫ్యాక్టర్ని సూచిస్తాయి, ట్యూమర్ నెక్రోసిస్ ఫ్యాక్టర్ అనేది క్యాన్సర్ తో పోరాడే ఒక పదార్థం, ఇది శరీరంలోని అసాధారణ కణాలకు వ్యతిరేకంగా పోరాడడంలో సహాయపడుతుంది.
అరటిపండ్లు పూర్తిగా పండినప్పుడు అధిక యాంటీ ఆక్సిడెంట్ గా ఉంటుంది. ఇది వైరస్లు మరియు క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా రోగనిరోధక శక్తిని పెంచడానికి కూడా సహాయపడుతుంది. అరటి తొక్కపై నల్ల మచ్చలు ఎంత ఎక్కువగా ఉంటే దానిని తినేందుకు అసహ్యించుకోవటం మనం సహాజంగా గమనించవచ్చు. అయితే ఇది ఖచ్చితంగా శరీరానికి పోషకమైనది. పండిన అరటిపండులో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు పెరిగేకొద్దీ, రోగనిరోధక శక్తిని పెంచే దాని సామర్థ్యం కూడా పెరుగుతుంది.
అరటిపండ్లు పక్వానికి వచ్చే కొద్దీ మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. అధిక మెగ్నీషియం రక్తపోటుతో బాధపడుతున్న వ్యక్తులకు అద్భుతమైనది. ఇది తక్షణమే అధిక రక్తపోటును తగ్గిస్తుంది. ఇంకా, పండిన అరటిపండ్లు గుండెకు, జీర్ణక్రియకు,ఆరోగ్యకరమైన ప్రేగు కదలికకు మంచివి. అరటిపండ్లు సహజ యాంటీ యాసిడ్‌లు. గుండెల్లో మంటను తక్షణమే తగ్గించడంలో సహాయపడతాయి. మీకు కొద్దిగా గుండెల్లో మంటగా అనిపిస్తే, ఒక అరటిపండు తినండి, అది కొన్ని నిమిషాల్లో మీకు ఉపశమనాన్ని ఇస్తుంది.
పండిన అరటిపండ్లను తినడం వల్ల మలబద్దకం లక్షణాలు తగ్గుతాయి. వివిధ కారణాల వల్ల వచ్చే విరేచనాల నుండి త్వరగా కోలుకునేందుకు అవకాశం ఉంటుంది. అరటిపండులో పీచుపదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి మలబద్ధకం నుండి కూడా ఉపశమనం కలిగిస్తాయి. ప్రేగు కదలికను ప్రేరేపించటం ద్వారా మలబద్దకాన్ని నివారిస్తాయి.