Abdominal Pain2
Overeating : చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో కడుపుబ్బరం సమస్య ఒకటి. దీనికి ప్రధాన కారణం అతిగా తినటం. దీంతోపాటు అనారోగ్యకర ఆహారం, వేగంగా తినటం, వంటివి ఇతర కారణాలుగా చెప్పవచ్చు. పడని పదార్థాలు తిన్నా, ఆహారం ఎక్కువ మొత్తంలో లాగించినా, నీళ్లు ఎక్కువగా తాగినా పొట్ట ఉబ్బిపోతుంది. ఇలాంటి పరిస్థితి చూడ్డానికే కాదు.. ఆరోగ్యానికీ మంచిది కాదు. దీనివల్ల అజీర్తి, గ్యాస్ట్రిక్.. వంటి సమస్యలూ తలెత్తచ్చు. అందుకే ఈ సమస్యను త్వరగా అదుపులోకి తెచ్చుకోవడం మంచిదంటున్నారు నిపుణులు.
ఇందుకోసం మన జీర్ణవ్యవస్థకు సరిపడే ఆహార పదార్థాల్నే తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా పీచు అధికంగా ఉండే పదార్థాలు సులభంగా జీర్ణమవుతాయి. అలాగే ఒకేసారి ఎక్కువ మొత్తంలో కాకుండా.. తక్కువ ఆహారం ఎక్కువసార్లు తీసుకునేలా ప్లాన్ చేసుకోవాలి. శీతల పానీయాలకు దూరంగా ఉండాలి. నీళ్లు ఎక్కువగా తాగాలి. ఫలితంగా పొట్టలోని విషతుల్యాలు బయటికి వెళ్లిపోయి ఆరోగ్యంగా ఉండచ్చు.
ఒకేసారి ఎక్కువ మొత్తంలో ఆహారం తీసుకుంటే కడుపు ఉబ్బి ఇబ్బందులు ఎదురవుతాయి. తక్కువ మొత్తంలో ఆహారాన్ని ఎక్కువసార్లుగా తీసుకుంటే కడుపు తేలికగా ఉంటుంది. కందిపప్పు, మినపప్పు, బియ్యం ఇతర ధాన్యాలను వండటానికి గంట ముందుగానే నీటిలో నానబెట్టటం ఉత్తమం. దీని వల్ల పప్పులు త్వరగా ఉడికి తేలికగా జీర్ణమై పోతాయి.
పెరుగు,మజ్జిగ వంటి వాటిని తీసుకోవటం వల్ల ఇవి పేగుల్లో మంచి బ్యాక్టీరియా వృద్ధికి దోహదం చేస్తాయి. తద్వారా జీర్ణక్రియలు వేగవంతం కావటానికి దోహదపడతాయి. పీచు పదార్ధం ఎక్కవగా ఉండే ఆహారాలను తీసుకోవటం వల్ల త్వరగా అరుగిపోయి మలబద్దకం పోతుంది. ఆహారాన్ని బాగా నమిలి తినటం అలవాటు చేసుకోవాలి.
అలాగే అనారోగ్యకరమైన కొవ్వులు నిండి ఉండే జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, నూనె సంబంధిత పదార్థాలను దూరం పెట్టి.. ఆరోగ్యకరమైన కొవ్వులు నిండి ఉన్న చేపలు, నట్స్, డ్రైఫ్రూట్స్.. వంటివి తీసుకోవాలి. నిపుణుల సలహా మేరకు కొన్ని రకాల వ్యాయామాలు కూడా సాధన చేయచ్చు. ఇవన్నీ చేసినా ఫలితం లేదంటే మాత్రం నిపుణుల పర్యవేక్షణలో చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది.