కరోనా వైరస్ నియంత్రించేందుకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. లాక్ డౌన్ కారణంగా రోజువారీ కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెక్కడాతేగానీ డొక్క ఆడని పరిస్థితి. చేతినిండా పని దొరికితేనే ఆ రోజు కుటుంబ సభ్యులకు పట్టెడన్నం పెట్టేది.. లేదంటే పస్తులే.. ఇలాంటి ధీనస్థితిని అనుభవించేవారు ఎందరో ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఓ 16 ఏళ్ల బాలుడు తల్లి, తమ్ముడు ఆకలి తీర్చేందుకు దొంగగా మారాడు. ప్రతిరోజు పనికి వెళ్లి వచ్చిన డబ్బులతో పొట్ట నింపుకునేవారు. కానీ, లాక్ డౌన్ కారణంగా పని దొరికే పరిస్థితి లేదు. తప్పని పరిస్థితుల్లో కుటుంబ సభ్యుల ఆకలి తీర్చడం కోసం ఈ కుర్రాడు ఓ మహిళ పర్సు దొంగిలించాడు. అతన్ని పట్టుకున్న పోలీసులు కోర్టులో హాజరుపరిచారు.
కోర్టులో జడ్జి అడిగిన ప్రశ్నకు కుర్రాడు చెప్పిన సమాధానం విని ఆయన మనస్సు కరిగిపోయింది. తాను పర్సు ఎందుకు దొంగలించాల్సి వచ్చిందో అసలు కారణం చెప్పేసరికి జడ్జి కరిగిపోయారు. తన తల్లి, తమ్ముడు ఇంట్లో ఆకలితో ఉన్నారని, వారి ఆకలి తీర్చేందుకు ఇలా పర్సు దొంగతనం చేయాల్సి వచ్చిందని చెప్పాడు. అతడు చెప్పిన మాటలు విన్న జడ్జి చలించిపోయారు.
కుర్రాడిని క్షమించి వదిలేసిన జడ్జి :
లాక్ డౌన్ సమయంలో పని దొరకలేదని, చేతులో డబ్బులు లేవని, ఆకలి ఎలా తీర్చుకోవాలో తెలియలేదని, తన కుటుంబ సభ్యులు ఆకలితో అలమటించడం చూడలేక దొంగతనం చేయాల్సి వచ్చిందని కుర్రాడు వాపోయాడు. కుర్రాడి పరిస్థితిని అర్థం చేసుకున్న బీహార్‌లోని నలందాలోని న్యాయస్థానంలో మేజిస్ట్రేట్ మన్వేంద్ర మిశ్రా తీర్పును వెలువరించారు.. కుర్రాడిని క్షమించి వదిలిపెట్టారు.
అంతేకాదు.. చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ మిశ్రా కుర్రాడికి ఆహార ధాన్యాలు, కూరగాయలు, బట్టలు కొనాలని ఆదేశించారు. తన సొంత డబ్బుతో వస్తువులను కొనాలని న్యాయమూర్తి కోర్టు సిబ్బందిని అభ్యర్థించారు. మరుసటి రోజు బాలుడిని పోలీసులు అతడి ఇంటి వద్ద వదిలిపెట్టారు. బాలుడి ఇల్లు కూలిపోయి ఉంది. కూలిన గోడలు తప్ప సరైన వసతి లేదు. మంచం లేదు, పాత్రలు లేవు, పొయ్యి లేదు, గృహోపకరణాలు లేవు. వారు ఎలా జీవిస్తున్నారో చూసి చలించిపోయమామని ఇస్లాంపూర్ సర్కిల్ ఆఫీసర్ నలిన్ వినోద్ పుష్ప్రజ్, స్థానిక అధికారులు చెప్పారు.
తల్లి, తమ్ముడి ఆకలి తీర్చాలని దొంగతనం :
గత నెలలో బాలుడు స్థానిక మార్కెట్‌కు వెళ్లి ఓ మహిళ పర్స్ దొంగిలించాడు. తన ఏకైక ఉద్దేశ్యం.. ఒకటే.. తన తల్లి, సోదరుడి కోసం ఆహారం కొనడమే. అదే విషయాన్ని న్యాయమూర్తి ఎదుట కుర్రాడు చెప్పాడు. సీసీ కెమెరాల నుండి వచ్చిన ఫుటేజ్ బాలుడిని గుర్తించి పట్టుకోవటానికి పోలీసులకు సాయపడింది. అతని తండ్రి కొన్నేళ్ల క్రితం చనిపోయాడని బాలుడు చెప్పాడు. అతని తల్లి మానసికంగా కృంగిపోయింది. కుర్రాడి ఒక కాలు విరిగింది. వైద్య సదుపాయం లేక సరిగా నయం కాలేదు. కర్రల సాయంతోనే నడుస్తున్నాడు. గులకరాళ్ళు తగిలి అతను కుడి కన్ను దృష్టిని కోల్పోయాడు. ఇప్పుడు 12 ఏళ్ళ తమ్ముడు, తన తల్లి బాధ్యత తనపై పడింది.
కరోనా భయంతో పని ఇచ్చేవారు లేక :
ఇస్లాంపూర్ మార్కెట్లో పనిచేసేవాడు. లాక్ డౌన్ విధించడంతో వచ్చే కూలీ కూడా పోయింది. పనిలేక తిండి లేక తీవ్ర ఇబ్బందులు పడింది కుర్రాడి కుటుంబం. మార్కెట్లో పనికి వెళ్దామని ప్రయత్నిస్తే.. కరోనా భయంతో అక్కడి వారు ఎవరూ తనను పనుల్లోకి రానివ్వలేదు. తనను దూరం పెట్టినట్టు వాపోయాడు.
తన తల్లి, తమ్ముడు ఆహారం కోసం ఎదురుచూసేవారు. ఇప్పుడు అందరూ వారిని కూడా దూరం చేస్తున్నారు. మేము ఆకలితో ఉన్నాము. నాకు మరో దారి కనిపించలేదని బాలుడు జడ్జీ ఎదుట వాపోయాడు. కుర్రాడి చెప్పింది విన్నాక చలించిపోయిన జడ్జి వెంటనే అతడికి అవసరమైన అందించాల్సిందిగా కోర్టు సిబ్బందిని అభ్యర్థించారు.
భవిష్యత్తులో ఈ కుర్రాడి కుటుంబం ఆకలితో ఉండకూడదని, అర్హత ఉన్న అన్ని సంక్షేమ పథకాల ప్రయోజనాలను కూడా పొందేలా చర్యలు తీసుకోవాలని న్యాయమూర్తి మిశ్రా స్థానిక అధికారులను ఆదేశించారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు స్థానిక అధికారులు బాలుడి ఇంటికి వెళ్లారు.
గోడలు కూలిపోయిన ఇల్లు, బాలుడి తల్లి ఇతర గృహాల పొయ్యిలపై ఆహారాన్ని వండుతుందని సర్కిల్ అధికారి పుష్పరాజ్ చెప్పారు. కుటుంబానికి రేషన్ కార్డు, ఆధార్ కార్డు లేదు. బాలుడి కుటుంబానికి ఆహార ధాన్యాలు, ఇతర తినదగిన వస్తువులను అందించాము. వారికి త్వరలో రేషన్ కార్డు, ఇతర సౌకర్యాలను అందిస్తామని అధికారి తెలిపారు.