Year End Roundup 2023: భారతీయులు అత్యధికంగా గూగుల్ చేసిన పర్యాటక ప్రాంతాలు ఇవే

హాలీడే దొరికితే చాలామంది టూర్ ప్లాన్ చేసుకుంటారు. అయితే వాటి గురించి వివరాల కోసం ఖచ్చితంగా గూగుల్ సెర్చ్ అయితే చేస్తారు. 2023 లో భారతీయులు గూగుల్ సెర్చ్ చేసిన పర్యాటక ప్రాంతాల జాబితాను గూగుల్ రిలీజ్ చేసింది. అవేంటో చదవండి.

Google Search

Year End Roundup 2023: 2023 సంవత్సరం పూర్తి కావడానికి ఇంక కొన్ని రోజులే ఉంది. ఈ సంవత్సరంలో జరిగిన ప్రతీది ఒకసారి రివైండ్ చేసుకుంటాం. అలాగే గూగుల్ ఈ ఏడాది భారతీయులు ఎక్కువగా సెర్చ్ చేసిన టూరిస్ట్ ప్లేసెస్‌కి సంబంధించి జాబితా విడుదల చేసింది. మరి టాప్ టెన్‌లో ఉన్న ఆ ప్రాంతాలు ఏంటో చదవండి.

Vietnam

వియత్నాం : ఈ ఏడాది గూగుల్ సెర్చ్‌లో ఎక్కువమంది వెతికిన పర్యాటన ప్రాంతాల జాబితాలో వియత్నాం టాప్ ప్లేస్‌లో నిలిచింది. బీచ్‌లు, గుహలు, ప్రకృతి అందాలు, చారిత్రక అంశాలతో మనసు దోచే ఈ ప్రాంతం టూరిస్టులను ఎంతగానో ఆకర్షిస్తోంది. వేసవికాలంలో ఇక్కడికి వెళ్లడానికి అనువైన సీజన్. హాలాంగ్ బే, న్హా ట్రాంగ్, కాన్ దావో, ఫు క్వాక్, హోయ్ యాన్, ఫోంగ్ న్హా కే బ్యాంగ్ నేషనల్ పార్క్, స ప, మై చౌ, డా లాట్, నిన్ బిన్ ఇక్కడ తప్పనిసరిగా చూడాల్సిన ప్రదేశాలు.

గోవా :  చాలామంది బీచ్‌లు ఉన్న ప్రదేశాలకు వెళ్లడానికి ఇష్టపడతారు. బీచ్‌లకు నెలవైన గోవా ట్రిప్‌కి చాలామంది ముఖ్యంగా యూత్ ప్లాన్ చేస్తుంటారు. ఇక్కడి బీచ్‌లు, కట్టడాలు, పచ్చదనం, అందమైన సూర్యోదయ, సూర్యాస్తమయాలు చూడటానికి ఎంతోమంది ప్రకృతి ప్రేమికులు ఇష్టపడతారు. అలాగే ఇక్కడ అగ్వాడ కోట సందర్శించాల్సిన ప్రాంతం. ఈ కోట 1612 లో డచ్ వాళ్ళ నుండి రక్షణ కోసం నిర్మించారు.

బాలి : బాలి ఇండోనేషియాలోని అందమైన ద్వీపం. ఆలయాలకు ప్రసిద్ధి చెందిన ఈ దీవిని చూడటానికి ప్రపంచ వ్యాప్తంగా కూడా అనేకమంది పర్యాటకులు వస్తుంటారు. ఇండోనేషియాలోని జావా, లాంబాక్ దీవుల మధ్య ఉంది బాలి దీవి.  17 వేల దీవులు ఉన్న ఇండోనేషియాలో బాలి అందం ప్రత్యేకం అంటారు. ఎక్కువగా హిందువులు నివాసం ఉండే ఈ ప్రాంతాన్ని దేవతల నివాసంగా కూడా పిలుస్తారు. బాలిలో దిన్ పాసార్, సింగరాజా సిటీలు టూరిస్టులను ఆకట్టుకుంటాయి. సూర్యోదయ, సూర్యాస్తమయాలు బీచ్‌లు, ప్రకృతి అందాలు టూరిస్టుల మనసు దోచుకుంటాయి.

శ్రీలంక : 1972 కు ముందు సిలోన్‌గా పిలవబడిన శ్రీలంక ప్రపంచంలోని అందమైన ద్వీపాల్లో ఒకటి. ఇక్కడ అందమైన బీచ్‌లు, జలపాతాలు, అడవులు ఉన్నాయి. రామాయణంతో ఈ ప్రదేశానికి ముడిపడి ఉంది. ఇది భారత్‌కు పొరుగుదేశం కూడా కావడంతో చాలామంది ప్రయాణికులు చూడటానికి వెళ్తుంటారు. ఇక్కడ సిగిరియా రాతి కోట, మిరిస్సా బీచ్, ఎల్లా హిల్ స్టేషన్, బౌద్ధ దేవాలయం, కొలంబో, అభయారణ్యం చెప్పడం కాదు చూసి తీరాల్సిన ప్రాంతాలు.

Thailand

థాయ్‌లాండ్ : థాయ్‌లాండ్ ప్రపంచంలో 51వ అతి పెద్ద దేశం. దీని రాజధాని బాంకాక్. పట్టాయాలో బీచ్ రిసార్టులు, హోటళ్లు..కౌయాయ్ లో రిసార్టులు, పచ్చని చెట్లు పర్వత శ్రేణులు ఉంటాయి. అమ్యూజ్‌మెంట్ పార్కులు, అడ్వెంచర్ స్పోర్ట్స్, స్విమ్మింగ్ పూల్స్, కౌబాయ్ షోలు సాగుతూ ఉంటాయి. థాయ్ టూర్‌లో ప్రత్యేకత బ్యాంకాక్‌లో ఉన్న ఎమరాల్డ్ బౌద్ధ ఆలయం ఇక్కడ తప్పకుండా చూడాలి. ఇక్కడ షాపింగ్ సెంటర్లు కూడా ఎక్కువే. కౌయాయ్ నేషనల్ పార్కులో పర్వతాలు, దట్టమైన అడవులు, జలపాతాలు, అరుదైన పక్షులు, ఆది మానవుల అవశేషాలు చూడాల్సిందే.

కాశ్మీర్ : కాశ్మీర్‌ను భూమి మీద స్వర్గం అంటారు. ఇక్కడి ఉద్యానవనాలు అందరినీ ఆకర్షిస్తాయి. శ్రీనగర్, గుల్ మార్గ్, పహల్‌గావ్ కాశ్మీర్‌లో ముఖ్యమైన పర్యాటక ప్రాంతాలు. శ్రీనగర్ నుండి పహల్ గావ్ 110 కిలోమీటర్లు ఉంటుంది. సాఫ్రాన్ టౌన్ పాపోర్, మార్ట్ లాండ్ టెంపుల్, సన్ టెంపుల్ ఇక్కడ సందర్శనీయ స్థలాలు. ప్రేమికులను ఈ ప్రాంతం ఎంతగానో ఆకట్టుకుంటుంది. చాలా సినిమాల్లో కాశ్మీర్ అందాన్ని వర్ణిస్తూ పాటలు కూడా వచ్చాయి. శ్రీనగర్, దాల్ సరస్సు అందాలను తప్పక చూడాల్సిందే.

కూర్గ్ : కొత్తగా పెళ్లైన జంటలు ఎక్కువగా ఇష్టపడే ప్రాంతం కూర్గ్. విశాలమైన కాఫీ తోటలు, పచ్చని అరణ్యాలు, పొగమంచుతో నిండిన కొండలు, లోయలు ఇక్కడ కనిపిస్తాయి. కొడగు అని కూడా పిలిచే ఈ ప్రాంతం కర్నాటక రాష్ట్రంలో అతి చిన్న ప్రాంతం అయినప్పటికీ ఎంతో సుందరమైన ప్రదేశం. మడకేరి సోమవారపేటలోని పుష్పగిరి కొండ శ్రేణి, విరాజ్ పేటలోని అతి పెద్ద తేనె ఉత్పత్తి కేంద్రం ప్రసిద్ధి చెందినవి. జలపాతాలకు నిలయమైన ఈ ప్రాంతంలో అబ్బే జలపాతం, ఇరుప్పు జలపాతం, బ్రహ్మగిరి కొండలు, నాగర్ హోల్ నేషనల్ పార్క్, ఓంకారేశ్వర దేవాలయం ఇంకా అనేకం ఇక్కడ టూరిస్టు స్పాట్స్ ఉన్నాయి.

Andaman and Nicobar Islands

అండమాన్ అండ్ నికోబార్ : కేంద్ర పాలిత ప్రాంతమైన ఈ దీవులు చూడటానికి ఎక్కువగా కొత్తగా పెళ్లైన జంటలు ప్లాన్ చేస్తుంటాయి. పోర్ట్ బ్లెయిర్‌లో సెల్యులార్ జైలు, మహాత్మాగాంధీ మెనైన్ నేషనల్ పార్క్, అండమాన్ వాటర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, వండూర్ బీచ్, ఫారెస్ట్ మ్యూజియం వంటివి ఇక్కడ తప్పకుండా చూడాల్సిన ప్రాంతాలు. అండమాన్ దీవులను చూడాలంటే టూరిస్టులకు అనుమతి అవసరం లేదు. కానీ అక్కడి గిరిజన ప్రాంతాలను చూడాలంటే మాత్రం ఖచ్చితంగా పోర్ట్ బ్లెయిర్‌లోని డిప్యూటీ కమిషనర్ నుండి తప్పక అనుమతి తీసుకోవాలి.

ఇటలీ : ప్రపంచంలో అత్యధికంగా పర్యాటకులు సందర్శించే ప్రాంతాల్లో ఇటలీ 5 వ స్ధానంలో ఉంది. ఇటలీలో అందమైన లొకేషన్లు ముఖ్యంగా బీచ్‌లు , అందమైన కట్టడాలు వావ్ అనిపిస్తాయి. వాస్తు శిల్ప కళా నైపుణ్యం చూడాలంటే రోమ్ నగరం చూడాల్సిందే. ఇక ఫ్యాషన్‌కి పెట్టింది పేరైన మిలాన్ నగరంలో షాపింగ్ చేయాలనుకునే వారికి అనువైన ప్రాంతం. ప్రపంచంలోని వింతల్లో ఒకటైన లీనింగ్ టవర్ ఆఫ్ పీపా ఇక్కడే ఉంది. ఇటలీ వెళ్తే ఖచ్చితంగా ఈ వింతను చూసి రావాల్సిందే.

స్విట్జర్లాండ్ : స్విట్జర్లాండ్‌లో ఎటు చూసిన ఎత్తైన పర్వతాలు, లోయలు మనసుని కట్టిపడేస్తాయి. ఇక్కడ లౌసాన్‌కి వెళ్తే జెనీవా సరస్సులతో పాటు ఆల్ఫ్స్ చెట్లు, జురా పర్వతాలు కనువిందు చేస్తాయి. స్విట్టర్లాండ్ ట్రిప్‌లో మిస్ కాకూడదని ప్రాంతాలు ఇవి. ఒలింపిక్స్ మ్యూజియం, కేథడ్రల్ చర్చి, లౌసాన్ టవర్, ఊచి వాటర్ ఫ్రంట్, ఆర్ట్స్ మ్యూజియ్‌లు, కూడా తప్పక చూడాలి. సహజ సిద్ధమైన ప్రకృతి అందాలు టూరిస్టులను ఆకట్టుకుంటాయి.