Long Covid Symptoms : దీర్ఘకాలిక కొవిడ్‌లో 200కుపైగా లక్షణాలు గుర్తింపు!

దీర్ఘకాలిక కొవిడ్‌ బారిన పడ్డవారిలో దాదాపు 200పైగా లక్షణాలు ఉంటాయని ఓ అధ్యయనంలో తేలింది. వారిలో బ్రెయిన్‌ ఫాగ్‌ నుంచి మొదలుకుని టిన్నిటస్‌ వరకు అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తాయనీ, కొందరిలో భ్రమలు, వణుకు కూడా కనిపించాయని కనుగొన్నారు సైంటిస్టులు.

Long Covid Symptoms : దీర్ఘకాలిక కొవిడ్‌ బారిన పడ్డవారిలో దాదాపు 200 లక్షణాలు ఉంటాయని అంతర్జాతీయ స్థాయిలో జరిగిన ఓఅధ్యయనంలో తేలింది. వారిలో బ్రెయిన్‌ ఫాగ్‌ నుంచి మొదలుకుని టిన్నిటస్‌ వరకు అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తాయనీ, కొందరిలో భ్రమలు, వణుకు కూడా కనిపించాయని కనుగొన్నారు సైంటిస్టులు. అంతేకాదు, దీనివల్ల శరీరంలోని పది ముఖ్య వ్యవస్థలు ప్రభావితమయ్యాయి. కనీసం ఆరు నెలల వరకు తీవ్రమైన ఇబ్బందులు రోగులను వెంటాడాయి. జ్ఞాపక శక్తి సమస్యలు, మానసిక అశాంతి, నీరసం, దురద, నెలసరిలో హెచ్చుతగ్గులు, లైంగిక బలహీనత, గుండెదడ, ఆయాసం తదితర సమస్యలు వేధించాయి. ప్రముఖ మెడికల్ జర్నల్‌ లాన్సెట్‌లో తాజా అధ్యయనం ప్రచురితమైంది. ఇందులో 56 దేశాల నుంచి లాంగ్‌ కొవిడ్‌తో బాధపడుతున్న 3 వేల 672 మందిని పరిశీలించారు. ఆ తర్వాత 203 రోగ లక్షణాలను గుర్తించారు.

అందులో 66 లక్షణాలు ఏడు నెలల వరకూ కొనసాగాయని తేలింది. అటు కరోనా బారిన పడి 16 నెలలైనా కూడా వైరస్‌ లక్షణాలతో బాధపడుతున్నవారు కూడా ఉన్నారని శాస్త్రవేత్తలు తెలిపారు. వారికి గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీ, థైరాయిడ్‌ పరీక్షలు చేయించాల్సి ఉంటుందని చెప్పారు. కరోనా పాజిటివ్ లేనివారితో సహా, కోవిడ్-19 లక్షణాలు కలిగిన 18 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారిపై ఈ సర్వే నిర్వహించారు. ఇందులో 257 ప్రశ్నలను అడిగి తెలుసుకున్నారు. దీర్ఘ కాల వ్యవధిలో దీర్ఘ కోవిడ్ లక్షణాలను అంచనా వేసేందుకు సర్వే డేటాను విశ్లేషించారు. 28 రోజుల కన్నా ఎక్కువ రోజులు లక్షణాలు ఉన్నవారి డేటా మాత్రమే పరిశీలించారు.

గత అధ్యయనాల్లో ఏడుగురిలో ఒకరికి పాజిటివ్ అనంతరం 12 వారాల తర్వాత దాదాపు 30 శాతంలో కొన్ని లక్షణాలు మాత్రమే ఉన్నాయని అంచనా వేశారు. 35 వారాలకు మించి లక్షణాలు ఉన్నవారు 91.8 శాతంగా ఉండగా.. 3,608 (96 శాతం) మంది 90 రోజులకు మించి కరోనా లక్షణాలు ఉన్నాయి. 2,454 (65 శాతం) మందిలో కనీసం 180 రోజులు లక్షణాలు ఉన్నాయని గుర్తించారు.

కోవిడ్ నుంచి 233 మంది మాత్రమే పూర్తిగా కోలుకున్నారు. 90 రోజులలోపు కోలుకున్న వారిలో సగటు లక్షణాల సంఖ్య రెండు వారాలలో గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. 90 రోజుల్లో కోలుకోనివారిలో సగటున రెండు నెలలలో లక్షణాల సంఖ్య పెరిగింది. ఆరునెలలకు పైగా లక్షణాలతో ఏడు నెలలలో సగటున 13.8 లక్షణాలు కలిగి ఉన్నారు.

ట్రెండింగ్ వార్తలు