Mexico Covid 3rd Wave : మెక్సికోలో కొవిడ్ మూడో దశ మొదలైంది.. యువతలోనే 29శాతం అధికం!

మెక్సికోలో కరోనా మూడో దశ మొదలైంది.. గతవారంతో పోలిస్తే.. ఈ వారం 29శాతం అధికంగా కేసులు నమోదయ్యాయి. యువతలోనే పెద్ద సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయని ఆరోగ్య శాఖ చెబుతోంది.

Mexico Enters 3rd Wave Of Coronavirus, Infections Up 29 Percent

Mexico Covid 3rd Wave : మెక్సికోలో కరోనా మూడో దశ మొదలైంది.. గతవారంతో పోలిస్తే.. ఈ వారం 29శాతం అధికంగా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు ఆ దేశ ఆరోగ్యశాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ మూడో దశ కరోనా కేసులు అనారోగ్య సమస్యలు కలిగిన వారికంటే.. యువతలోనే పెద్ద సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయని ఆరోగ్య శాఖ చెబుతోంది. గత ఏడాది సెప్టెంబర్ లో రెండో దశ ప్రారంభంతో పోలిస్తే.. మూడో దశ కేసులు చాలా అధికమని ఆందోళన వ్యక్తం చేస్తోంది.

జనవరిలో భారీగా పెరిగిన కేసులు. జూన్ వరకు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. కానీ, మెక్సికోలో కరోనా మూడో దశ ఆగస్టులో గరిష్ఠస్థాయిని తాకుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కొవిడ్ మూడో దశపై ఆ దేశ అధ్యక్షుడు ఆండ్రెస్ మానుయేల్ లోపెజ్ (Andrés Manuel López Obrador) స్పందించారు. థర్డ్ వేవ్ ప్రభావం యువకులపైనే అధికంగా ఉంటుందని పరిశోధకులు హెచ్చరించినట్టు ఆయన వెల్లడించారు. కానీ, మరణాల శాతం తక్కువగానే ఉంటుందని పేర్కొన్నారు.

వారిలో రోగనిరోధకశక్తి అధికంగా ఉండటం వల్ల మరణాల శాతం తక్కువగా ఉందని తెలిపారు. దేశంలో ప్రస్తుతం 22శాతం మాత్రమే ఆస్పత్రుల్లో బెడ్స్ ఉన్నాయి. రెండో వేవ్ సమయంలో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లోని ఆస్పత్రి బెడ్స్ అన్ని నిండిపోయాయి. గత ఏడాది డిసెంబర్ నుంచి టీకాలు వేయడంతో వృద్ధుల్లో వైరస్ తీవ్రత తగ్గినట్టు అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకూ పెద్దవారిలో 39శాతం మందికి కనీసం ఒక టీకా మోతాదు అందినట్టు తెలిపారు.

డెల్టా వేరియంట్ కారణంగా ఈ కేసులు పెరగడం లేదని అధికారులు చెబుతున్నారు. మెక్సికోలో ఇప్పటివరకు దాదాపు 235 వేల మంది కరోనాతో మరణించినట్టు టెస్టుల ద్వారా ధృవీకరించారు. ఎందుకంటే దేశంలో టెస్టింగ్ ప్రక్రియ చాలా తక్కువగా ఉంది. ప్రభుత్వ అధికారిక గణాంకాల ప్రకారం.. దేశంలో 25,58,369 మంది కరోనా బారిన పడితే.. 2,34,193 మంది మరణించారు. వాస్తవంగా అయితే కరోనా మరణాల సంఖ్య 3లక్షల 60వేల పైనే ఉంటాయని నివేదికలు చెబుతున్నాయి.