ధారవి సమస్యల సుడిగుండం.. రోజంతా నాలుగైదు బిందెల నీళ్లతోనే బతకాలి!

  • Publish Date - April 4, 2020 / 12:04 PM IST

ధారవిలో మంచినీటి సౌకర్యం లేదు. ఉదయం నుంచి సాయంత్రం దాకా పబ్లిక్ నల్లా దగ్గర ఓపిగ్గా కూర్చుంటే కానీ ఓ కుటుంబానికి నాలుగైదు బిందెల నీళ్లు దొరకని పరిస్థితి.
ఈ నీటితోనే రోజంతా ఇంటి అవసరాలు తీర్చుకోవాలి. పరిశ్రమలు ఒక వైపు ఉంటే, కార్మికుల నివాస ప్రాంతాలు మరోవైపు ఉంటాయి. ఈ నివాస ప్రాంతాలకు దగ్గరలో మహీం
నది పారుతూ ఉంటుంది. అది నదిలా ఉండదు. కార్ఖానాల్లోని  ప్రమాదకర రసాయన వ్యర్థాలు ఈ నదిలోకి వదులుతారు. పనికి రాని చెత్తను కూడా నదిలో విసిరేస్తారు. నది
పక్క నుంచి వెళుతుంటే భరించలేని దుర్వాసన. అపరిశుభ్రతను నిలయమైన ధారవిలో ఏదైనా అంటువ్యాధి ప్రబలిందంటే.. వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయే
పరిస్థితులున్నాయి. 

ధారవిలో ఎటు చూసినా సమస్యలే. అయినా వాటి గురించి ఎవరూ పట్టించుకోరు. చాలా ఏళ్ల పాటు ధారవి ప్రజలను ఓటు బ్యాంకుగానే రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి.
ఎన్నికల వేళ స్థానిక గూండాల సాయంతో ఓట్లు వేయించుకోవడానికే పరిమితమయ్యాయి. ధారవి ప్రాంత సమస్యలు పరిష్కరించాలన్న డిమాండ్ గట్టిగా వినిపించడంతో
2004 లో అప్పటి మహారాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ధారవి రీడెవలప్ మెంట్ ప్రాజెక్ట్ అథారిటీ పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేసింది. ఈ ప్రాజెక్ట్ కింద ధారవి ప్రాంతం నుంచి
కొన్ని వందల కుటుంబాలను పునరావాసం కింద వేరే ప్రాంతానికి పంపడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. అయితే, దీనికి అక్కడి వాళ్లు ఒప్పుకోకపోవడంతో ఈ ప్రాజెక్ట్‌ను
ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోలేదు. 

ఎన్నికలు రాగానే రాజకీయ పార్టీలన్నీ ధారవి ప్రాంతానికి క్యూ కడుతుంటాయి. ఓట్ల కోసం కనీస వసతులు కల్పిస్తామంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పి కాలం గడిపేస్తుంటాయి. ఈ
ప్రాంత అభివృద్ధికి 26,000 కోట్ల రూపాయలతో ఓ మెగా ప్రాజెక్ట్‌ను ప్రభుత్వం చేపట్టింది. దుబాయ్‌కు చెందిన సెక్ లింక్ అనే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ఆధ్వర్యంలో ఇక్కడ
అభివృద్ధి పనులు చేపట్టాలని నిర్ణయించారు. ఈ మెగా ప్రాజెక్ట్‌లో మహారాష్ట్ర ప్రభుత్వం, ధారావీ రీడెవలప్ మెంట్  ప్రాజెక్ట్ అథారిటీ, సెక్‌లింక్ కంపెనీ భాగస్వామ్య పక్షాలు.
అయితే ప్రభుత్వం తూతూ మంత్రంగా కొన్ని పనులు చేపట్టిందే కానీ పక్కాగా ఎలాంటి ప్రాజెక్ట్‌ను చేపట్టలేదు. దశల వారీగా ఇక్కడ అభివృద్ధి పనులు చేపడతారు. 

ఉచితంగా సింగిల్ బెడ్ రూం ప్లాట్లు ఇస్తామన్నారు :
అభివృద్ధి పనుల్లో భాగంగా 57 వేల కుటుంబాలకు ఉచితంగా సింగిల్ బెడ్ రూం అపార్ట్‌మెంట్లు కట్టించి ఇవ్వాలన్నది ప్లాన్. అలాగే చిన్నారుల కోసం కొత్తగా స్కూళ్లు, పార్క్‌లు
ఏర్పాటు చేయాలని కూడా గత ప్రభుత్వం భావించింది. కానీ, అవేవీ కార్యరూపం దాల్చలేదు. వలసలు జోరందుకోవడంతో ప్రజల అవసరాలు కూడా పెరిగాయి. వీళ్ల
అవసరాలకు తగ్గట్టు ధారవికి అనేక చిన్న తరహా పరిశ్రమలు వచ్చాయి. 1887లో తొలిసారిగా లెటర్ ఇండస్ట్రీ ఇక్కడకు వచ్చింది. ఆ తర్వాత ఒక దాని తర్వాత మరో పరిశ్రమ
ఇక్కడకు రావడం మొదలైంది. వీటిలో గార్మెంట్స్, రీ సైక్లింగ్, బటన్స్ మాన్యుఫాక్చరింగ్, డైయింగ్, హ్యాండ్ ఎంబ్రాయిడరీ, ప్యాకేజింగ్, పోటరీ, లెదర్ ఇండస్ట్రీ ముఖ్యమైనవి.
ఇక్కడి పరిశ్రమల్లో పని చేయడానికి కార్మికులు తరలివచ్చారు. దీంతో ధారవిలో బిజినెస్ ఊపందుకుంది. ఇక్కడ ఏడాదికి వంద కోట్ల డాలర్ల బిజినెస్ టర్నో వర్ జరుగుతోంది.
 
రూ.80 పెట్టుబడితో లిజ్జత్ సంస్థ ప్రారంభం :
1959లో ధారవిలోని ఓ పాత ఇంట్లో ఏడుగురు ఆడవారు కలుసుకున్నారు. వారిలో ఒకరు పిండి తెచ్చారు. సాయంత్రానికి నాలుగు ప్యాకెట్ల అప్పడాలు తయారు చేసి
వాటిపై వచ్చిన రాబడితోనే బతకడం మొదలెట్టారు. అప్పడాలు తయారు చేయడానికి వారు పెట్టిన మొదటి పెట్టుబడి కేవలం 80 రూపాయలు. అది కూడా ఎవరో పెద్దాయన
దగ్గర అప్పుగా తీసుకున్నారు. అలా మొదలైన వ్యాపారమే ఇప్పుడు లిజ్జత్ పాపడ్. ఏడుగురితో  మొదలైన లిజ్జత్ సంస్థలో ఇప్పుడు 45 వేల మంది పని చేస్తున్నారు.
ఏడాదికి 12 వందల కోట్ల టర్నోవర్ సాధించింది. ఆడవారి ఎంపవర్‌మెంట్‌కు ఓ ఉదాహరణగా నిలిచింది లిజ్జత్ పాపడ్. ఇలా ఎన్నో ప్రత్యేకతలున్న ధారవి ప్రాంతం ఇప్పుడు
స్థానికులకే కాదు… యావత్‌ ముంబై నగరాన్ని వణికిస్తోంది. అక్కడ ఒకసారి కరోనా జడలు విప్పడం మొదలుపెడితే అదుపు చేయడం కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.