Vitamin D (1)
High Vitamin D : మన శరీరానికి కావల్సిన ముఖ్యమైన పోషకాల్లో విటమిన్ డి కూడా ఒకటి. ఎండలో గడపడం ద్వారా మనకు విటమిన్ డి లభిస్తుంది. అలాగే పలు ఆహారాల ద్వారా కూడా మనకు ఈ విటమిన్ శరీరానికి లభిస్తుంది. విటమిన్ డి వల్ల రోగనిరోధక శక్తి పెంపొందుతుంది. అంతే కాకుండా ఎముకల ధృడత్వానికి దోహదపడుతుంది. ఇటీవలి కాలంలో చాలా మంది ఆహారపు అలవాట్లలో మార్పులు, నీటపటున ఉండటం వల్ల డి విటమిన్ లోపంతో వ్యాధుల బారిన పడుతున్నారు.
చేపలు, రొయ్యలు, పుట్టగొడుగులు, పాలు, చీజ్ పప్పుదినుసులు, కూరగాయలు వంటి సమతుల ఆహారం ద్వారా మన శరీరానికి కావాల్సిన విటమిన్ డి పొందవచ్చు. విటమిన్ డి లోపం ఏర్పడిన సందర్భంలో చాలా మంది వైద్యుల సూచన మేరకు సప్లిమెంట్ రూపంలో తీసుకుంటుంటారు. అయితే ఇది నిర్ణీత మోతాడులో మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది.
ఇటీవలి కాలంలో కరోన ప్రారంభమయ్యాక చాలా మంది అవసరం ఉన్న లేకపోయినా రోగనిరోధక శక్తి కోసం విటమిన్ డి ని ఇబ్బడి ముబ్బడిగా వాడేస్తున్నారు. సరైన అవగాహన లేకపోవటం వల్ల విటమిన్ డి సప్లిమెంట్లను ఎలాంటి వైద్యుల సూచనలు లేకుండానే తీసుకోవటం వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో విటమిన్ డి మోతాదుకు మించితే కొన్ని అనర్ధాలు తప్పవని సూచిస్తున్నారు.
విటమిన్ డి ఎక్కువైతే తీవ్రమైన అలసటగా అనిపిస్తుంది. ఒళ్లు నొప్పులు ఉంటాయి. కండరాలు బలహీనంగా మారటం, ఎముకల్లో నొప్పి, పెళుసుతనం వంటి రుగ్మతలను చవిచూడాల్సి వస్తుంది. వికారం, వాంతులు చేసుకోవటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇదంతా శరీరంలో విటమిన్ డి మోతాదుకు మించటం వల్లే జరుగుతుంది.
డి-విటమిన్ తీసుకుంటే కిడ్నీలు చెడిపోతాయని, అధిక రక్తపోటుకు గురికావటంతోపాటు, మూత్ర విసర్జన వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. రక్తంలో క్రియాటినిన్ లెవల్స్ పెరిగి కొన్ని సందర్భాల్లో మూత్రపిండాలు దెబ్బతింటాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి విటమిన్ డి విషయంలో జాగ్రత్తగా వ్యవహరించటం మంచిది. వైద్యులు సూచించిన విధంగా మన శరీరానికి కావాల్సిన మోతాదులో మాత్రమే విటమిన్ డిని అందించటం వల్ల ప్రయోజనం కలుగుతుందని గ్రహించాలి.