కొత్త మోటార్ వాహనాల (సవరణ) చట్టం 2019 ప్రకారం కొత్త డ్రైవింగ్ లైసెన్స్ పొందడం లేదా పునరుద్ధరించడం వంటి రూల్స్ మారిపోయాయి. దీంతో పాటు ట్రాఫిక్ ఉల్లంఘనలకు జరిమానాలు కూడా భారీగా పెరిగిపోయాయి. కొత్త వాహన చట్టం ప్రకారం.. ఒక వ్యక్తి డ్రైవింగ్ లైసెన్స్ గడువు ముగియడానికి ఒక ఏడాది మధ్యకాలంలో లేదా గడువు ముగిసిన తర్వాత పునరుద్ధరణ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అంటే.. డ్రైవింగ్ లైసెన్స్ గడువు ముగిసిన ఒక ఏడాది తరువాత రెన్యువల్ కోసం దరఖాస్తు చేస్తే మాత్రం.. డ్రైవింగ్ లైసెన్స్ లెర్నింగ్ టెస్టును మరోసారి పూర్తి చేయాల్సి ఉంటుంది. లైసెన్స్ గడువు ముగిసిన తర్వాత ఒక నెల గ్రేస్ పీరియడ్ నిబంధన రద్దు చేయడం జరిగింది.
లైసెన్స్ గడువు ముగిసి ఒక ఏడాది గడిచినట్లయితే, సదరు వ్యక్తి మళ్ళీ లెర్నర్స్ డ్రైవింగ్ పరీక్ష తీసుకోవాల్సిన అవసరం ఉంది. తద్వారా డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తు చేసిన వారిని కొత్త వ్యక్తిగా అధికారులు పరిగణిస్తారు. పర్మినెంట్ డ్రైవింగ్ లైసెన్స్ టెస్టు కోసం ఎదురుచూసే సమయం ఎలాంటి మార్పు లేదు. లైసెన్స్ దరఖాస్తుదారులు తమ గుర్తింపు, నివాస పత్రాలను అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.
అంతేకాదు.. కొత్త లెర్నర్ దరఖాస్తుదారుల మాదిరిగానే బయోమెట్రిక్స్ తీసుకోవాల్సి ఉంటుంది. మరోవైపు రవాణా రహిత వాహనాదారులకు జారీ చేసే లైసెన్స్ చెల్లుబాటు వారి వయస్సుపై ఆధారపడి ఉంటుంది. రవాణా వాహనాలను నడపడానికి లైసెన్స్ చెల్లుబాటు 5 సంవత్సరాలు, ప్రమాదకరమైన వాహనానికి 3 సంవత్సరాలు వరకు ఉంటుంది. లైసెన్స్ గడువు ముగియడానికి ఏడాదికి ముందుగానే పునరుద్ధరించుకోనే అవకాశం ఉంది. రవాణా వాహనాన్ని నడపడానికి కనీస విద్యా అర్హత కూడా రద్దు చేశారు.
ఇదిలా ఉండగా, మోటారు వాహనాల విభాగం లైసెన్స్ పునరుద్ధరణ ప్రక్రియను ఆన్‌లైన్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. కొత్త చట్టం ప్రకారం.. సెప్టెంబర్ 1 నుంచి, డ్రైవింగ్ లైసెన్స్ కోసం నివాస చిరునామా లేదా వ్యాపార స్థలంలో మార్పును ఆన్‌లైన్‌లో పూర్తి చేసుకోవచ్చు. గడువు ముగిసిన లైసెన్స్‌తో డ్రైవింగ్ చేసినందుకు లేదా లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేసినందుకు విధించే జరిమానా అంతకుముందు రూ .500 జరిమానా ఉండగా రూ .5 వేలకు పెరిగింది.