Chikkilu
Chikkilu : ప్రతిరోజు ఏదో సమయంలో ఆహారంతోపాటుగా చిరుతిండి తినటం చాలా మందికి అలవాటు. చిరుతిండి కోసం వివిధ రకాల ఆహారాలను ఎంచుకుంటుంటారు. అయితే తీసుకునే చిరుతిండిలో కొన్ని ఆరోగ్యానికి మేలు చేస్తే మరికొన్ని అనారోగ్యాన్ని కలిగిస్తాయి. అయితే వివిధ రకాల పంట ఉత్పత్తులతో తయారు చేసే చిక్కీలను చాలా మంది చిరుతిండిగా తీసుకుంటుంటారు. పల్లీలు, నువ్వులు, పుట్నాలు, డ్రై ఫ్రూట్స్ వంటి వాటిని బెల్లం పాకంతో జోడించి ఈ చిక్కీలను తయారు చేస్తారు. ఈ చిక్కీలలో అనేక పోషకాలు ఉంటాయి. వీటిని చిరుతిండిగా తీసుకోవటం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి.
చాలా మంది పండుగల సమయంలో ప్రత్యేకంగా ఈ చిక్కీలను తయారు చేసుకుంటారు. వీటిని కొన్ని ప్రాంతాల్లో పట్టీలని కూడా పిలుస్తారు. చిక్కీలకు సంబంధించి వేరుశనగతో తయారు చేసే వాటిని అంతా ఇష్టంగా తింటుంటారు. నువ్వులతో తయారు చేసుకునే చిక్కీలు మంచి రుచిని ఇస్తాయి. అయితే వీటిని తినటం వల్ల శరీరంలో వేడి ఉత్పత్తి అవుతుంది. చలి ప్రాంతాల్లో ఉండేవారు వీటిని తీసుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. చిక్కీలలో బెల్లం వాడటం వల్ల షుగర్ వ్యాధితో బాధపడుతున్నవారు సైతం వీటిని తీసుకోవచ్చు.
ఆస్తమా వంటి శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారు బెల్లం, నువ్వులు చిక్కీలు తినటం వల్ల ఉపశమనం లభిస్తుంది. బెల్లంలో పోషకాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కేలరీలు తక్కువగా ఉండటంతోపాటు బెల్లం ఔషదంగా కూడా ఉపకరిస్తుంది. పల్లీలు, నువ్వులు, డ్రై ఫ్రూట్స్‌లో ప్రొటీన్లతోపాటు కొవ్వుశాతం ఎక్కువ. వీటిని బెల్లంతో కలిపి తీసుకుంటే పోషకాలు రెట్టింపు అవుతాయి. బాదం, జీడిపప్పు, పిస్తా వంటి డ్రై ఫ్రూట్స్‌తో సైతం చిక్కీలు తయారు చేసుకోవచ్చు.
రోజువారి వ్యాయామాలు చేసే వారు, కండరాల దృఢత్వం కోసం చిక్కీలను తీసుకుంటుంటారు. ప్రస్తుతం దుకాణాలలో ఈ చిక్కీలను ప్రత్యేకంగా తయారు చేసి విక్రయిస్తున్నారు. ఇంట్లో తయారు చేసుకోవటం రాని వారికి వాటిని కొనుగోలు చేసి చిరుతిండిగా తీసుకోవటం ఈజీగా ఉంటుంది.