Pfizer Donate Covid Drugs: భారత్‌కు ఫైజర్‌ ఆపన్నహస్తం.. విరాళంగా 510 కోట్ల విలువైన కరోనా మందులు

కరోనా విలయతాండవానికి అల్లాడిపోతోన్న ఇండియాను ఆదుకునేందుకు అమెరికా ఫార్మా దిగ్గజం ఫైజర్‌ ముందుకొచ్చింది. దాదాపు 510 కోట్ల రూపాయల విలువైన మందులను భారత్‌కు విరాళంగా ప్రకటించింది.

Pfizer Donate Covid Drugs

Pfizer Donate Covid Drugs : కరోనా విలయతాండవానికి అల్లాడిపోతోన్న ఇండియాను ఆదుకునేందుకు అమెరికా ఫార్మా దిగ్గజం ఫైజర్‌ ముందుకొచ్చింది. దాదాపు 510 కోట్ల రూపాయల విలువైన మందులను భారత్‌కు విరాళంగా ప్రకటించింది. కరోనా చికిత్సకు అవసరమైన మందులను ఫైజర్‌ భారత్‌కు ఉచితంగా పంపనుంది. ఇండియాలో కరోనా పరిస్థితులపై ఫైజర్‌ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ క్లిష్టమైన సమయంలో ఇండియాకు అండగా ఉంటామని వెల్లడించింది. కరోనా కష్ట కాలంలో భారత్‌ను ఆదుకునేందుకు అంతర్జాతీయ సమాజం ముందుకొచ్చిన సమయంలో ఫైజర్‌ సాయం చేయడం భారత్‌కు కాస్త ఊరటనివ్వనుంది.

కరోనాకు వ్యతిరేకంగా భారత చేసే పోరాటంలో భాగస్వామిగా ఉండటానికి తాము కట్టుబడి ఉన్నట్లు తెలిపింది ఫైజర్‌. కంపెనీ ఎప్పుడూ కూడా విపత్కర కాలంలో సహాయక
చర్యలు చేయడానికి వెనకాడదని వెల్లడించింది. రవాణా చేసే మందులను త్వరలోనే భారత్‌కు పంపుతామని తెలిపింది. మరోవైపు.. భారత్‌లో తమ కంపెనీ వ్యాక్సిన్ల అనుమతి
కోసం కేంద్రంతో చర్చిస్తున్నట్లు ఫైజర్‌ తెలిపింది.

ఎలాంటి లాభాపేక్ష లేకుండానే టీకాను భారత ప్రభుత్వానికి అందించేందుకు సిద్ధంగా ఉన్నామని గత నెలలోనే ప్రకటించింది ఫైజర్‌. ఈ విషయంపై భారత ప్రభుత్వంతో చాలా
సార్లు సంప్రదింపులు కూడా జరిపింది. అటు కరోనా వ్యాక్సిన్‌ పంపిణీలో భాగంగా ఇతర దేశాలు అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ను అనుమతిస్తామని ఇదివరకే వెల్లడించింది కేంద్ర
ప్రభుత్వం. అయితే, తాము సరఫరా చేయబోయే టీకాను ప్రభుత్వ మార్గాల ద్వారానే పంపిణీ చేస్తామని స్పష్టం చేసింది ఫైజర్‌.