Onion Cultivation :
Onion Cultivation : సుగంధ ద్రవ్యపంటల్లో ఉల్లి కూడా ఒకటి. మనదేశంలో మహరాష్ట్రతోపాటు, తెలుగు రాష్ట్రాల్లో ఉల్లిని రైతులు సాగు చేస్తున్నారు. నీరు నిలబడని అన్ని రకాల సారవంతమైన నేలలు, అనుకూలంగా ఉంటాయి. ఇసుకతో కూడిన ఒండ్రు నేలలు ఎర్రదుబ్బు నేలలు అనుకూలం. ఎరుపు, తెలుపు, పసుపు పచ్చ ఉల్లి రకాలను సాగు చేస్తున్నారు.
ఉల్లిపంట 15 రోజుల వయసులో ఉన్న సమయంలో మొక్కల ఆకులతో తయారు చేసిన పురుగు వికర్షిణి ద్రావణాన్ని పిచికారి చేయాలి. పంట చుట్టూ రక్షణ పంటగా జొన్న, మొక్కజొన్న , సజ్జ పంట వేసుకోవాలి. వేపగింజల కషాయం, కానుగ గింజల కషాయం , ఉమ్మెత్త ఆకుల కషాయం పిచికారి చేయాలి.
తామర పురుగు నివారణకు వారం రోజుల వ్యవధిలో రెండు సార్లు వావిలాకు కషాయం పిచికారి చేయాలి. ఎకరాకు జిగురు పూసిన పసుపు, తెలుపు పళ్లాలను 20 వరకు అమర్చాలి. పేను బంక నివారణకు 5శాతం వేప గింజల కషాయం నామాస్త్రం పిచికారి చేయాలి.
శనగపచ్చ పురుగు నివారణకు ఎకరాకు 20 వరకు పక్షిస్ధావరాలను ఏర్పాటు చేయాలి. ఎర పంటలుగా బంతి, ఆవాల మొక్కలను అక్కడక్కడా పొలంలో వేయాలి. పచ్చ పురుగు నివారణకు దశపత్ర కషాయం సమర్ధవంతంగా పనిచేస్తుంది.
నులి పురుగుల నివారణకు ఎకరాకు 80 కిలోల వేపపిండి వేయటం వల్ల నేలలో ఉన్న నులి పురుగులు శిలీంద్రాలు నాశనం అవుతాయి. ఉల్లిపంట వేయటానికి ముందుగా వేసే పచ్చిరొట్టె ఎరువుల పంటల్లో నువ్వు కలిపి సాగు చేసి దుక్కిలో కలియదున్నాలి. ఉల్లి సాగు చేసే క్రమంలో నువ్వు, బంతి మొక్కలు పెంచుకోవాలి.