రామ విగ్రహాన్ని మరెక్కడైనా నిర్మించండి.. మా భూములెందుకు?

  • Publish Date - February 22, 2020 / 07:28 PM IST

అయోధ్యలోని రామజన్మభూమి ప్రాంతానికి 6 కిలోమీటర్ల దూరంలో రామ విగ్రహం, మ్యూజియం నిర్మాణ ప్రణాళిక కోసం 86 హెక్టార్ల స్థలం కావాలంటూ అయోధ్య జిల్లా యంత్రాంగం నెలక్రితమే ఒక బహిరంగ ప్రకటన జారీ చేసింది. ఈ ప్రకటన జారీతో ఆయా ప్రాంతాల్లోని భూముల యజమానులు తమ పొలాలు, ఇళ్ల స్థలాలను కోల్పోవాల్సిన పరిస్థితి ఎదురైంది.

నోటీసు విడుదలైన నెల తర్వాత అక్కడి గ్రామస్థులు తమ భూములు, ఇళ్ల స్థలాలను ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు. భూములు లాక్కుంటే తామెట్టా బతకాలని ప్రశ్నిస్తున్నారు. తమ నివాసాలను కూల్చేసి దేవుడి విగ్రహాం,మ్యూజియం నిర్మించడాన్ని గ్రామస్థులంతా వ్యతిరేకిస్తున్నారు. ఎన్నో యేళ్లుగా తమ జీవనాధారమైన భూములను తామెందుకు వదులుకోవాలంటూ సూటిగా అధికారులను ప్రశ్నిస్తున్నారు.

ప్రపంచంలోనే అతిపెద్దదైన 251 మీటర్ల ఎత్తున్న విగ్రహాన్ని నిర్మించేందుకు యూపీ ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. లక్నో-గోరఖ్ పూర్ జాతీయ రహదారి కలిసే ప్రాంతంలో రామ విగ్రహాంతో పాటు అక్కడే డిజిటల్ మ్యూజియం కూడా నిర్మించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ నిర్మాణాల ద్వారా అక్కడ నివసించే 125 కుటుంబాలపై తీవ్ర ప్రభావం పడుతుందని అధికారులు చెబుతున్నారు. అందులో గుడెసలు కాకుండా 66 వరకు పక్కా ఇళ్లు కూల్చివేసినట్టు అధికారులు వెల్లడించారు.

మజా బర్హతా గ్రామసభకు చెందిన స్థానికులకు చెందిన 300 వరకు కుటుంబాలు అక్కడ నివాసముంటుండగా వాటిలో వందలాది పక్కా ఇళ్లు ఉన్నాయి. యాదవ్ ఆధిపత్య గ్రామసభలో 86 హెక్టార్లు స్థలం, 259 మంది భూస్వాములను గత జనవరి 25న జిల్లా అధికారిక యంత్రాంగం విడుదల చేసిన నోటీసులో పేర్కొంది. ఈ నోటీసులో ఏమైనా అభ్యంతరాలు నమోదు చేయాలంటే అందుకు 15 రోజులు సమయం ఇచ్చింది. ఇప్పటివరకూ తమకు దాదాపు 200 ఫిర్యాదులు అందాయని, వాటిని పరిష్కరించే ప్రక్రియ ప్రారంభమైనట్లు అధికారులు వెల్లడించారు.

విగ్రహం, మ్యూజియం కోసం స్వాధీనం చేసుకున్న భూమిలో సుమారు 40 శాతం ప్రాచూర్యం పొందని మహర్షి రామాయణ విద్యాపీఠ్ ట్రస్ట్‌కు చెందినదిగా అధికారులు గుర్తించారు. ఢిల్లీలోని ప్రధాన కార్యాలయం 27 దేశాలలో శాఖలు ఉన్నాయి. దానిని స్వాధీనం చేసుకోవడానికి అధికారులకు అనుమతి ఉంది. మిగిలిన భూమిలో రైతుల యాజమాన్యంలోని చిన్న ప్లాట్లు ఉన్నాయి. వీరికి పరిహారంతో పాటు ప్రత్యామ్నాయ ప్లాట్లు వాగ్దానం చేయగా, స్థానికులు, వీరిలో కొందరు 100 ఏళ్లకు పైగా ఈ ప్రాంతంలో నివసిస్తున్నారు. వీరంతా విగ్రహాన్ని మరెక్కడా ఎందుకు నిర్మించలేమని సూటిగా జిల్లా యంత్రాంగాన్ని ప్రశ్నిస్తున్నారు.

ఆ 86 హెక్టార్లలో నివసిస్తున్న ఏకైక ముస్లిం కుటుంబానికి అధిపతి మహ్మద్ హషీమ్ (37) ఒకరు ఉన్నారు. అతని పేరు పబ్లిక్ నోటీసులో ఉన్న భూస్వాముల జాబితాలో లేదు. దాంతో ఆయన ఎలా, ఎక్కడ ఫిర్యాదు చేయాలో తనకు తెలియక ఆందోళన చెందుతున్నారు. తాము ఎనిమిది మంది సభ్యులమని, ఇక్కడ 100 సంవత్సరాలకు పైగా నివసిస్తున్నామని, ఇది మా నాల్గవ తరమంటూ హషీమ్ చెప్పుకొచ్చారు. సుమారు 10 సంవత్సరాల క్రితం మాత్రమే తాము ఒక పక్కా ఇల్లు నిర్మించుకున్నామని చెప్పారు.

ఉన్నట్టుండి స్థలాన్ని ఇచ్చేయమంటే ఆ బాధ ఎలా ఉంటుందో ఎవరైనా ఊహించగలరా? అంటూ హషీమ్ భార్య షరీఫున్ నిషా ఆవేదన వ్యక్తం చేశారు. రామ విగ్రహానికి అక్కడ ఎవరూ వ్యతిరేకం కానప్పటికీ.. ఒకరి ఇంటిని కూల్చివేసిన ఆ స్థలంలో ఒక మతం ఆలయాన్ని నిర్మించడానికి అనుమతి ఉండొచ్చు.. కానీ, ఇలా నిర్మించిన విగ్రహం ముందు తామెలా ప్రార్థన చేస్తామని అక్కడి గ్రామస్థులు వాపోతున్నారు.