Sleepwalking
Sleep Walking : కొందరిలో నిద్రలోనే నడిచే అలవాటు చాలా మందిలో ఉంటుంది. దీనినే వైద్య పరిబాషలో స్లీప్ వాకింగ్ , సోమ్నాంబులిజం అని అంటారు. స్లీప్ వాకింగ్ అనేది సాధారణంగా చిన్నపిల్లల్లో కనిపిస్తుంది. పెద్ద వాళ్ళల్లో ఇది అరుదుగానే కనిపిస్తుందని చెప్పవచ్చు. నిద్రలో నడుస్తున్నప్పుడు కళ్లు తెరచుకొని ఉండి, అంతగా స్పష్టంగా లేని దృశ్యం వాళ్లకు కనపడుతూ ఉంటుంది. ఇది తీవ్రమైన సమస్యలకు దారితీయకపోయినా అంతర్లీనంగా ఉన్న అనారోగ్య సమస్యను సూచిస్తుంది. స్లీప్ వాకింగ్ సాధారణంగా రాత్రి సమయంలో నిద్రలోకి జారుకున్న తరువాత రెండు గంటలలోపు జరుగుతుంది. అయితే మెల్కువ వచ్చిన తరువాత తాను నిద్రలో నడిచానన్న విషయం అతని ఏమాత్రం గుర్తుండదు. కొంత మంది పిల్లల్లో రోజువారిగా ఇలా జరుగుతుండగా మరికొందరిలో మాత్రం అప్పుడప్పుడు ఇలా చోటు చేసుకుంటుంది. పగటి పూట నిద్ర సమయంలో స్లీప్ వాకింగ్ కనిపించదు.
స్లీప్ వాకింగ్ కారణాలు:
అనేక అంశాలు పిల్లలు,పెద్దలలో స్లీప్ వాకింగ్ కు కారణాలుగా చెప్పవచ్చు. రాత్రి సమయంలో ఎక్కువ సేపు మేల్కోవటం, తగినంత నిద్ర లేకపోవడం, మానసిక ఒత్తిడి ,జ్వరం, చలి , ప్రయాణం కారణంగా నిద్రలేమి వంటి ఇతర పరిస్థితుల వల్ల నిద్రకు భంగం కలుగుతుంది. నిద్రకు , నాడీ వ్యవస్ధకు ఇబ్బంది కలిగించే కొన్ని రకాల మందుల ప్రభావం వల్ల కూడా ఇలా సంభవించే అవకాశాలు ఉంటాయి.
వంశపారంపర్య కారకాలు, అధిక అలసట, శరీర బలహీనత, నిరంతర తలనొప్పితో మైగ్రేన్ , తలకు బలమైన గాయం వంటి సందర్భాల్లో స్లీప్ వాకింగ్ సమస్య ఎదుర్కోవాల్సి వస్తుంది. దీనికి వైద్యపరంగా నిర్దిష్టమైన చికిత్స అంటూ ఏదీ లేదు. అయితే హిప్నాసిస్ వంటి ప్రక్రియలతో దీనికి చికిత్స చేయవచ్చు.