There Is A Lot Of News On Social Media About Corona
Corona Virus : కరోనాపై సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు !! కరోనా వైరస్ వ్యాప్తి, నిర్ధారణ, నివారణ వంటి వాటిపై ఎన్నో ప్రచారాలు !! వీటిలో చాలా వాటిపై ఇప్పటికే జనాల్లో అపోహలు తొలిగిపోయాయి. అయినా ఇంకొన్ని వార్తలపై సందేహాలు అలాగే ఉన్నాయి. అలా ప్రచారమవుతున్న వార్తల్లో ఒకటి .. పది సెకన్ల పాటు శ్వాసను బిగబట్టడం ద్వారా కరోనావైరస్ సోకిందో లేదో తెలుసుకోవచ్చంట. మరి ఆ వార్త ఎంత వరకు నిజమో ఒకసారి చూద్దాం..
అబద్ధం..
కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాప్తిచెందుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో సోషల్ మీడియాలో ఒక మెసేజ్ విపరీతంగా వైరల్ అవుతున్నది. శ్వాస తీసుకోకుండా పది సెకన్లు ఉండగలిగితే మీకు కరోనా లేనట్లే అన్నది ఆ మెసేజ్ సారాంశం. ఇందులో ఏ మాత్రం నిజం లేదు. దీనిని ఎవరూ ధ్రువీకరించలేదని పీఐబీ ప్యాక్ట్ చెక్‌లో తేలింది.
నిజం..
శ్వాస పీల్చుకోకుండా పది సెకన్లు లేదా అంతకంటే ఎక్కువ సమయం బిగబట్టి ఉన్నంత మాత్రాన మనలో కరోనా వైరస్ లేనట్లేనని చెప్పలేం. ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని నమ్మకుండా లక్షణాలు ఉన్నవారు ఆర్టీపీసీఆర్ లేదా ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్ష చేయించుకోవాలి. కరోనాను ధ్రువీకరించడానికి డబ్ల్యూహెచ్‌వో, భారత ప్రభుత్వం ఈ టెస్టులను మాత్రమే ప్రామాణికంగా తీసుకుంటున్నాయి.