Heart : గుండె బలహీనంగా ఉందని తెలిపే సంకేతాలివే…

60 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వారు, అధిక బరువు లేదా షుగర్, హై బిపి, ఎక్కువ కొవ్వుతో బాధపడుతుంటే గుండె ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండటం మంచిది.

Asian Woman Holding A Red Heart In Her Hands.

Heart : శరీరానికి రక్తాన్ని పంపిణీ చేసే ముఖ్యమైన అవయవం గుండె. ప్రత్యేకమైన కండరాలు గుండెలో నిరంతరం పనిచేస్తుంటాయి. గుండె అనేది ఛాతిలో ఎడమవైపున ఉంటుంది. గుండె ఆరోగ్యంగా ఉందా లేదా అనే విషయాన్ని మనం ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. గుండెకు సంబంధించి ఏదైనా సమస్య కలిగినప్పుడు గుర్తించటం చాలా మందికి తెలియదు. గుండె జబ్బులకు సంబంధించిన సంకేతాలు అంత సులభంగా బయటపడవు. హార్ట్ ఎటాక్ వచ్చినా.. హార్ట్ సంబంధించిన ఏదైనా పెయిన్ వచ్చిన సందర్భంలోనే సమస్య గురించి తెలుసుకోగలరు. గుండె సమస్యలకు సంబంధించిన లక్షణాలు గుర్తించటం అంత సులభం కూడా కాదు.

అయితే పెన్ స్టేట్ హెర్షీ హార్ట్ మరియు వాస్కులర్ ఇన్ స్టిట్యూట్ లోని కార్డియాక్ కాథెటరైజేషన్ లాబొరేటరీ డైరెక్టర్ చార్లెస్ ఛాంబర్స్ గుండె పనితీరులో వచ్చే మార్పులను, కలిగే లక్షణాలను గురించి తెలియజేశారు. ముఖ్యంగా 60 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వారు, అధిక బరువు లేదా షుగర్, హై బిపి, ఎక్కువ కొవ్వుతో బాధపడుతుంటే గుండె ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండటం మంచిది. అప్పుడప్పుడు చెకప్ చేసుకుంటూ ఉండాలని సూచించారు. గుండె బలహీనంగా ఉన్న సమయంలో కనిపించే కొన్ని లక్షణాల గురించి తెలుసుకుందాం..

గురక ; నిద్ర పోతున్నప్పుడు గురక పెట్టడం సహజంగా మనం చాలా మందిలో చూస్తుంటాం. అసాధారణంగా పెద్దగా గురక పెట్టడం, ఊపిరి ఆడటంలో సమస్యలు , ఊపిరి సరిగా ఆడకపోవడం అనేది స్లీప్ అప్నియాకు సంకేతం. ఇలా జరిగితే గుండెపై అదనపు ఒత్తిడి పడుతుంది. వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

చెమటలు ; చాలా మందిలో ఎలాంటి ఉక్కపోత లేకపోయినప్పటికీ..శరీరం నుండి చెమట బయటకు వస్తుంది. కొంత మందిలో ఏసి వంటి చల్లని వాతావరణంలోనూ ఎలాంటి కారణం లేకుండా చెమటలు పడుతుంటాయి. ఇలా చెమటలు వస్తుంటే గుండె పోటు రావడానికి సంకేతం. ఇలాంటి లక్షణాలు మీకు ఎప్పుడైనా కనిపిస్తే.. వెంటనే ఆసుపత్రికి వెళ్ళి మీ గుండె పనితీరును తెలుసుకోవటం మంచిది.

దగ్గు ; గుండె సంబంధిత జబ్బులకు దగ్గు అనేది సంకేతం కాకపోయినప్పటికీ ఒక్కో సందర్భంలో దగ్గుతున్న సమయంలో శ్లేష్మం గులాబీ రంగులో ఉంటే మాత్రం మీ గుండె పనితీరులో తేడా ఉన్నట్లు గమనించాలి. ఈ సంకేతంతో వెంటనే వైద్యుడిని సంపద్రించాలి. దగ్గుకు అసలు కారణం కనుగునే ప్రయత్నం చేయటం ఉత్తమం.

గుండె స్పందన, ఎడమ చేయి నొప్పి ; గుండె స్పందన అప్పుడప్పుడు పెరుగటం లేదా తగ్గటం వంటివి చోటు చేసుకుంటుంటాయి. గుండె కొంత వేగంగా కొట్టుకోవడం సహజం. అయితే మీ గుండె కొన్ని సెకన్ల కన్నా ఎక్కువగా కొట్టుకుందని మీకు అనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. హార్ట్ ఎటాక్ కు సంబంధించిన మరో ముఖ్యమైన లక్షణం ఏంటంటే.. మీ ఎడమ చేయి తరచుగా నొప్పి వేస్తుంటే.. ఈ చేతుల నొప్పి ఛాతీ నొప్పి వరకు వ్యాపించడం కూడా గుండె బలహీనంగా ఉందని సూచించే సంకేతాల్లో ఒకటి.

పాదాలు,కాళ్ళ వాపులు ; గుండె రక్తాన్ని సరిగ్గా ప్రసరణ చేయకపోవటం వల్ల పాదాలు, కాళ్ళు వాపులు వచ్చే అవకాశం ఉంటుంది. మీ గుండెకు తగినంత వేగంగా రక్తం సరఫరా కాలేనప్పుడు, రక్తం సిరల్లోకి తిరిగొచ్చి వాపునకు గురవుతుంది. గుండె బలహీనంగా ఉండటం వల్ల మూత్రపిండాలు శరీరం నుండి అదనపు నీరు మరియు సోడియంను తొలగించడం కష్టతరం అవుతుంది. దీని వల్ల మీ పాదాలు మరియు కాళ్లు వాపుతో కనిపిస్తాయి. ఇలాంటి సందర్భంలో గుండె సమస్య ఉన్నట్లుగా గుర్తించి వెంటనే తగిన చికిత్స తీసుకోవటం మంచిది.