Lips : చలికాలంలో పెదవుల పగుళ్లకు చిట్కాలు

పెదవులు పొడిబారగానే చాలామంది నాలుకతో తడుపుతుంటారు. ఇలా అస్సలు చేయకూడదు. అధరాలపై తేమ తగ్గకుండా ఉండేందుకు లిప్‌బామ్‌ రాసుకోవాలి.

Lips

Lips : చలికాలం వచ్చిందంటే చాలు పెదవుల విషయంలో జాగ్రత్తులు పాటించటం మంచిది. ఎందుకంటే చలికాలంలో వీచే చల్లని గాలుల వల్ల పెదవులు ఎండిపోవడం, కొందరికి పెదవులు పగలడం వంటి సమస్యలు ఎదురవుతాయి. వాటిని పట్టించుకోకపోతే సమస్య ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. చలికాలంలో పెదవులు పగలడానికి కేవలం చల్లగాలులే కారణం కాదు, విటమిన్ ఇ లోపం, శరీరంలోని తేమ శాతం తగ్గడం, పొగతాగడం, అలాగే పెదవులను తరచూ నాలుకతో తడి చేసుకుంటూ ఉండటం…ఇలా అనేక అంశాలు కూడా అందుకు దోహదం చేస్తాయి. గులాబీ రేకుల్లాంటి పెదవులను కంటికి రెప్పలా కాపాడుకోవాలంటే ఈ చిన్నచిన్న చిట్కాలు పాటించండి.

పెదవులు పొడిబారగానే చాలామంది నాలుకతో తడుపుతుంటారు. ఇలా అస్సలు చేయకూడదు. అధరాలపై తేమ తగ్గకుండా ఉండేందుకు లిప్‌బామ్‌ రాసుకోవాలి. పెదవులను వేళ్లతో తాకడం మానేయాలి. లేదంటే బ్యాక్టీరియా, క్రిములు చేరి ఇన్‌ఫెక్షన్‌ వచ్చే ప్రమాదం ఉంటుంది. పెదవులపై చర్మం పెచ్చులుగా ఊడుతున్నప్పుడు వాటిని బలవంతంగా లాగేయొద్దు. వారానికోసారి తేనె, చక్కెర కలిపిన మిశ్రమంతో పెదవులను మర్దనా చేయాలి. ఐదు నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. టమాటా గుజ్జు పెదవులపై ఉంచినా అధరాలు మృదువుగా తయారవుతాయి. బాదాం నూనెను దూదిబంతితో అద్దుకొని పెదవులపై మర్దనా చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.

వీలైనంత ఎక్కువ మొత్తంలో శరీరానికి నీటిని అందించాలి. తేనెతో కాస్త వాస్లిన్ కలిపిన మిశ్రమాన్ని రోజువారీగా రాసుకుంటే లిప్స్ గులాబీల్లా ఉంటాయి. చలికాలంలో పెదవులకు అలొవెరా ఆయిల్, ఆలివ్ ఆయిల్స్‌ను వాడినా మంచి ఫలితం ఉంటుంది. మిల్క్ క్రీమ్స్ వాడితే పెదవుల పగుళ్లను నివారించవచ్చు. నెయ్యిని రోజూ నిద్రకు ఉపక్రమించేందుకు ముందు రాసుకోవాలి. కొబ్బరి నూనెను కూడా తెల్లవారుజామున స్నానానికి ముందు వాడితే మంచి ఫలితం ఉంటుంది. అలాగే ఆముదం, గ్లిజరిన్ ఒక్కో చెంచా చొప్పున తీసుకుని అందులో కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేయాలి. ఈ మిశ్రామాన్ని రోజూ పడుకునే ముందు పెదవులకు రాసుకోవాలి. పొద్దున్న లేవగానే గోరువెచ్చని నీళ్లలో ముంచిన దూదితో పెదాలను శుభ్రం చేసుకోవాలి.

కొద్దిగా తేనె తీసుకుని దానికి పెట్రోలియం జెల్లీ జతచేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమం పెదాలకు రాసుకుని 10 నుంచి 15 నిముషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చిని నీళ్లలో ముంచిన దూదితో పెదాలను శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే పెదవులు ఆరోగ్యంగా ఉంటాయి. కలబంద మొక్క నుండి కలబంద గుజ్జును సేకరించి ప్రతిరోజు పెదాలకు రాయటం వల్ల పెదవులు తేమగా, మృదువుగా ఉంటాయి. వీటితోపాటు, మీరు తినే ఆహారంలో విటమిన్ C, E ఉండి తీరాలి. అలాగే… శరీరానికి వేడి చెయ్యకుండా చూసుకోవాలి. ఆకుకూరలు బాగా తినాలి. ఈ సీజన్‌లో వచ్చే పండ్లు, కూరగాయలు తప్పనిసరిగా తీసుకోవటం మంచిది.