Healthy Skin
Healthy Skin : శీతాకాలంలో చాలా మంది అనేక రకాలైన చర్మ సమస్యలను ఎదుర్కోని ఉంటారు. చర్మం పగుళ్లు, పొడిబారిన చర్మం, చర్మంపై ఏర్పడిన మచ్చలు ఇలాంటి సమస్యల నుండి బయటపడేందుకు తప్పనిసరిగా చర్మ సంరక్షణపై దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. చర్మ సంరక్షణను రోజు వారి దినచర్యగా చేసుకోవాలి. హార్మోన్ల పరిస్థితులు, జన్యుపరమైన కారణాల వంటి వివిధ కారణాల వల్ల చర్మ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. అయినప్పటికీ, చాలా సందర్భాలలో,సమస్యలకు ప్రధాన కారణం మనం చర్మ సంరక్షణ పట్ల దృష్టిసారించకపోవటమే అవుతుందని చర్మ వ్యాధి నిపుణులు చెబుతున్నారు. చర్మాన్ని యవ్వనంగా ఉంచుకోవడానికి డాక్టర్ గీతికా మిట్టల్ గుప్తా, చర్మ నిపుణులు,కాస్మోటాలజిస్ట్ కొన్ని చిట్కాలను సూచిస్తున్నారు. పరిపూర్ణమైన , ఆరోగ్యకరమైన చర్మం కోసం చిన్నచిన్న చిట్కాలను పాటించటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
సూర్యరశ్మి నుండి చర్మాన్ని రక్షించుకోవటం ; హానికరమైన సూర్య కిరణాల తాకిడికి ఎక్కవ సమయం చర్మం గురికావటం వల్ల ముడతలు, నల్ల మచ్చలు ఏర్పడి చర్మ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. మీ చర్మాన్ని రక్షించుకోవడానికి, చర్మవ్యాధి నిపుణుడు సిఫార్సు చేసిన విధంగా సన్‌స్క్రీన్ అప్లై చేయటం మంచిది. ఇంటి నుండి బయటికి వచ్చిన ప్రతిసారీ దానిని అప్లై చేసుకోవాలి. తినే ఆహారంలో కొన్ని బాదంపప్పులను చేర్చుకోవడం ద్వారా చర్మానికి హానికరమైన సూర్యకిరణాల నుండి రక్షణ పొందేందుకు అవకాశం ఉంటుంది. ఒక పరిశోధనా అధ్యయనం ప్రకారం ఆహారంలో బాదంపప్పును చేర్చుకోవడం వల్ల హానికరమైన UVB కిరణాలు, సూర్యరశ్మి వల్ల దెబ్బతిన్న చర్మ ఆకృతిని మెరుగుపరచి, చర్మాన్ని రక్షించడంలో సహాయపడతాయని కనుగొన్నారు.
ఆరోగ్యకరమైన ఆహారం ; చర్మ సంరక్షణ ఉత్పత్తులు ఎన్ని వాడినా సమతుల్య ఆహారం తీసుకోవటం వల్ల మెరుగైన ప్రయోజనం ఉంటుంది. స్థూల, సూక్ష్మ పోషకాలతో కూడిన ఆహార పదార్థాలు తీసుకోవటం చర్మ ఆరోగ్యానికి కీలకం. అవోకాడో, గ్రీన్ టీ, క్యారెట్లు, గుడ్లు, బచ్చలికూర, సాల్మన్ వంటి యాంటీఆక్సిడెంట్ అధికంగా ఉండే ఆహారాలు చర్మ సంరక్షణకు ఎంతగానో దోహదం చేస్తాయి. ఆహారంలో బాదం వంటి గింజలను చేర్చుకోవడం వల్ల ప్రయోజనకరంగా ఉంటుంది. బాదంపప్పులో విటమిన్ ఇ, మెగ్నీషియం, ప్రొటీన్, రిబోఫ్లావిన్, జింక్ మొదలైన 15 పోషకాలు ఉన్నాయి. చర్మ ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తాయి. ప్రతిరోజూ కనీసం రెండు లీటర్ల నీరు త్రాగడం అవసరం.
విటమిన్ సి & ఇ తీసుకోవడం పెంచటం ; విటమిన్ సి & ఇ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల హైపర్‌పిగ్మెంటేషన్, డార్క్ స్పాట్స్‌ని నివారించవచ్చు. చర్మం పునర్ యవ్వనంగా కనిపించేలా చేయవచ్చు. విటమిన్ సి కొల్లాజెన్ స్థాయిలను పెంచడం ద్వారా ముడతలు తగ్గించడంలో సహాయపడుతుంది. దీనిని శక్తివంతమైన యాంటీ ఏజింగ్ విటమిన్ గా కూడా పిలుస్తారు. నిమ్మ, నారింజ, కివీ ,స్ట్రాబెర్రీ వంటి సిట్రస్ అధికంగా ఉండే పండ్లను ఆహారంలో చేర్చుకోవడం సహజంగా సి విటమిన్ ను పొందవచ్చు. విటమిన్ ఇ తీసుకోవడం చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ప్రయోజనకరంగా ఉంటుంది. బాదంపప్పులో ఆరోగ్యకరమైన కొవ్వులు మరియు విటమిన్ ఇ ఉన్నాయి, ఇవి చర్మాన్ని మెరుగ్గా కనిపించేలా చేయడంలో సహాయపడతాయి.
చర్మాన్నితేమగా ఉంచటం ; చర్మ సంరక్షణకు మంచి మాయిశ్చరైజర్‌ను ఉపయోగించాలి. మార్కెట్లో అనేక మాయిశ్చరైజర్‌లు అందుబాటులో ఉన్నప్పటికీ మీ చర్మానికి తగిన మాయిశ్చరైజర్‌ను ఎంచుకునేందుకు చర్మవ్యాధి నిపుణుడిని సంప్రదించటం మంచిది. చర్మాన్ని మృదువుగా ఉంచే ప్రయోజనకరమైన హైలురోనిక్ యాసిడ్, గ్లిసరిన్ వంటివాటిని ఎంచుకోవాలి. అంతేకాకుండా గోరువెచ్చని నీటి తో చర్మాన్ని శుభ్రం చేసుకోవటం మంచిది. వేడి నీరు చర్మానికి జిడ్డు కలిగించే నూనెలను తొలగించటంలో సహాయపడుతుంది.
ముఖాన్ని రోజుకు రెండుసార్లు శుభ్రం చేసుకోండి ; చర్మంపై ఉండే మృతకణాలను వదిలించుకోవడానికి రోజుకు రెండుసార్లు శుభ్రం చేసుకోవం మంచిది. ఇది క్రమం తప్పకుండా చేస్తే చర్మసౌందర్యం మెరుగవుతుంది. అలాగని ఎక్కువ సార్లు శుభ్రం చేయటం ఏమంత మంచిది కాదని గ్రహించాలి. మొటిమలు , దద్దుర్లు నివారించడానికి ప్రతిరోజూ ఉదయం, పడుకునే ముందు ముఖాన్ని శుభ్రం చేసుకోవడం చేసుకోవటం మంచిది. చర్మానికి సరిపడే సోప్స్ ను ఎంచుకోవటం ఉత్తమం. మంచి జీవనశైలిని, ఆరోగ్యకరమైన ఆహారం వల్ల చర్మాన్ని ఆరోగ్యంగా కాపాడుకోవచ్చు. ప్రతిరోజు కనీసం 7-9 గంటల పాటు నిద్రపోవడం, యోగా, మెడిటేషన్ వంటి వాటి వల్ల మానసిక స్థితి అలాగే చర్మం సంరక్షణ మెరుగుపడుతుంది.