Spices (2)
Winter Tips : చలికాలంలో అనేక ఆరోగ్యసమస్యలు చుట్టుముట్టటం సహజం.. సాధారణంగా ఈ కాలంలో దగ్గు, జలుబు వంటి శ్వాసకోశ సమస్యలు ఉత్పన్నమౌతాయి. ఈ క్రమంలోనే చలి నుంచి తట్టుకోవడంతోపాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవటం అవసరం. చలికాలంలో ఇంట్లో అందుబాటులో ఉండే కొన్ని రకాల మూలికలను ఉపయోగిస్తే శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవచ్చు. అలాగే అనారోగ్య సమస్యల నుంచి బయట పడవచ్చు. చలికాలంలో ఆరోగ్యానికి రక్షణగా నిలిచే మూలికల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
గొంతు ఇన్‌ఫెక్షన్లకు చెక్ పెట్టడంలో అల్లం ఎంతో సమర్థవంతంగా పనిచేస్తుంది. చాలా మంది రోజూ టీలో అల్లం వేసుకుని తాగుతుంటారు. అయితే అలా కాకుండా నేరుగా అల్లం రసాన్ని ఉదయం పరగడుపున తీసుకోవడం వల్ల ఇంకా ఎంతో ఫలితం ఉంటుంది. అలాగే నీటిలో అల్లం వేసి మరిగించి ఆ నీటిని వేడిగా ఉండగానే తాగేయాలి. ఈ డికాషన్‌ను ఉదయం, సాయంత్రం తాగాలి. దీని వల్ల శరీరానికి వెచ్చదనం లభిస్తుంది. అలాగే దగ్గు, జలుబు తగ్గుతాయి.
దాల్చిన చెక్కలో యాంటీ సెప్టిక్ లక్షణాలు ఉంటాయి. దీన్ని రోజూ తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి వ్యాధులను రాకుండా చూస్తుంది. అలాగే శరీరానికి వెచ్చదనాన్ని ఇస్తుంది. దాల్చిన చెక్క చిన్న ముక్కను తీసుకుని నీటిలో వేసి మరిగించి ఆ డికాషన్‌ను రోజుకు ఒక్కసారి తాగితే చాలు.. ఆయా సమస్యల నుంచి బయట పడవచ్చు.
వెల్లుల్లి రోగ నిరోధక వ్యవస్థ పనితీరును మెరుగు పరిచి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. గాయాలను మానేలా చేయడంలో సహాయ పడుతుంది. శరీరంలో ఉండే సూక్ష్మ క్రిములను చంపుతుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. ఉదయం పరగడుపున రెండు పచ్చి వెల్లుల్లి రెబ్బలను అలాగే తింటే శరీరానికి వెచ్చదనం కూడా లభిస్తుంది.
యాలకుల్లో అద్భుతమైన ఔషధ గుణాలు ఉంటాయి. యాలకులను నీటిలో వేసి మరిగించి ఆ నీటిని రోజుకు ఒక్కసారి తాగితే చాలు, చలికాలంలో వెచ్చగా ఉండడంతోపాటు అనారోగ్యాలు రాకుండా చూసుకోవచ్చు. పాలలో యాలకుల పొడి కలిపి రాత్రి నిద్రించే ముందు కూడా తాగవచ్చు.
చలికాలంలో పసుపును ఎక్కువగా ఉపయోగించడం వల్ల కూడా శరీరం వెచ్చగా ఉంటుంది. ఇది యాంటీ బయోటిక్‌గా పనిచేస్తుంది. గాయాలు, పుండ్లను త్వరగా మానేలా చేస్తుంది. దగ్గు, జలుబు, జ్వరం తగ్గుతాయి. రాత్రి నిద్రకు ముందు ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో కొద్దిగా పసుపు కలుపుకుని తాగితే ఎంతో ప్రయోజనం ఉంటుంది.
లవంగాలు, తమలపాకు రసం, అల్లం రసాన్ని తేనె తో కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని సేవించిన వెంటనే జలుబు తగ్గుతుంది. కఫంతో కూడిన జలుబుతో ఇబ్బంది పడుతున్నవారు మిరియాలను వేయించి పొడి చేసుకుని అర టీ స్పూన్ చొప్పున మూడు నాలుగు రోజుల పాటు ఉదయాన్నే తీసుకోవటం మంచిది.