Laugh : ఆరోగ్యానికి టానిక్… నవ్వు

నవ్వినప్పుడు, సెరోటోనిన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. ఈ హార్మోన్ ఆందోళన, నిరుత్సాహాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

Smile

Laugh : నవ్వు నాలుగందాల చేటు అన్నది పాత మాట..నవ్వటం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలన్నది కొత్త మాట. నవ్వటం వల్ల అనేక శారీరక రుగ్మతలు దూరమై పోతాయని తాజా పరిశోధనల్లో తేలింది. ప్రస్తుతం జీవన విధానంలో ఏదో ఒక పనిలో నిమగ్నమవ్వటంతో చాలా మంది పెదవులపై చిరునవ్వే దూరమై పోయింది. బయట వ్యక్తులను సరే,… ఇంట్లో భార్య పిల్లలను కూడా సరదాగా నవ్వతూ పలకరించలేని జీవితాలను చాలా మంది గడుపుతున్నారు. ఇది కాదనలేని నిజం. సరదాగా నవ్వటం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయన్న విషయం చాలా మందికి తెలియదు.

నలుగురితో కలిసి సరదాగా నవ్వేవారికి, ఒంటరిగా ఉండే వ్యక్తులకు మధ్య చాలా వ్యత్యాసం ఉంటుందని ఓ సర్వేలో తేలింది. తరచూ నవ్వేవారికి గుండెజబ్బులు వచ్చే అవకాశాలు చాలా అరుదుగా ఉంటాయి. నవ్వటం వల్ల ఒత్తిడి దూరమవ్వటంతోపాటు రక్తపోటు తగ్గిపోతుంది.

నవ్వు మన శరీరంలో ఆక్సిజన్ స్థాయిని పెంచుతుంది. ఒత్తిడిని తగ్గించి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. శరీరంలో శ్వాస వ్యాయామానికి నవ్వు ఒక మార్గం అని చాలా పరిశోధనలు నిరూపించాయి. శరీరానికి ఆక్సిజన్‌ను అందిస్తుంది. ఊపిరితిత్తుల సామర్ధ్యం మెరుగవుతుంది. రోజంతా మనల్ని శక్తివంతంగా ఉంచుతుంది.

నవ్వని వారితో పోలిస్తే నవ్వే వారిలో రక్తప్రసరణ మెరుగ్గా ఉంటుంది. కనుక ఎప్పుడూ నవ్వడం అలవాటు చేసుకోవాలి. నవ్వు కూడా వ్యాధులపై పోరాడే శక్తిని పెంచుతుంది. నవ్వు శరీరం యాంటీవైరల్, ఇన్ఫెక్షన్-నిరోధక కణాలను పెంచుతుంది.

నవ్వినప్పుడు, సెరోటోనిన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. ఈ హార్మోన్ ఆందోళన, నిరుత్సాహాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. నవ్వటం వల్ల జ్ఞాపకశక్తిని మెరుగవ్వటంతోపాటు మనం చేసే పనిలో ఏకాగ్రత పెరుగుతుంది. ఎముకల బలాన్ని పెంచటానికి దోహదపడుతుంది.

మన జీవితకాలం పెరగటానికి నిత్యం నవ్వటం అలవాటు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇదే విషయం పలు పరిశోధనల్లో సైతం తేటతెల్లమైంది. నవ్వ కారణంగా శరీరంలో రోగనిరోధక వక్తి బాగా పెరుగుతుంది. నవ్వుతూ పనిచేయటంలో మన శక్తి సామర్ధ్యాలు సైతం రెట్టింపవుతాయి.

నవ్వటం కూడా ఒక వ్యాయామం లాంటిదే. మనం రోజు వారిగా పది నిమిషాలు స్నేహితులతో కలసి ఏదో ఒక జోకులతో సరదాగా నవ్వటం అలవాటుగా చేసుకోవటం వల్ల సంతోషంగా , మనస్సు ప్రశాంతంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది. అంతే కాదు నవ్వ కారణంగా ప్రతిమనిషిలో సానుకూల దృక్పదం ఏర్పడుతుంది.

నవ్వు గుండెకు ఎనర్జీని ఇచ్చేదిగా ఉంటుంది. ఆరోగ్యంగా జీవించేందుకు మంచి ఆహారం ఎలా తీసుకుంటామో మానసిక ఆరోగ్యం కోసం ప్రతిరోజు కొద్దిసేపు నవ్వుతూ గడపటం కూడా చాలా ముఖ్యం. అలసిపోయిన మనస్సును సంతోషంగా ఉంచేందుకు నవ్వటమే మంచి మందులాంటిది. ఎదుటు వ్యక్తులతో స్నేహసంబంధాలను కొనసాగించటానికి , సానుకూలమైన దృక్ఫదాన్ని వ్యక్తపరచటంలో నవ్వుని మించింది లేదు.

నమ్మకం బలపడడానికి నవ్వు బాగా సాయం చేస్తుంది. నవ్వు నిజంగా దివ్యౌషధం. బాధలని చిటికెలో తగ్గించే పెయిన్ కిల్లర్ లా నవ్వు పనిచేస్తుంది. నవ్వుతూ ఉండడం వల్ల ఆత్మవిశ్వాసం రెట్టిపవుతుంది. గెలుపుకు మార్గం చూపిస్తుంది.