లేచొస్తుంది అదిగో : మా పాపను పాతిపెట్టొద్దు.. చనిపోయిన బిడ్డ బతకాలని పూజలు

  • Publish Date - November 18, 2019 / 08:12 AM IST

నాలుగేళ్ల పాప అనారోగ్యంతో చనిపోయింది. కళ్లముందే పాప మరణించడంతో తల్లిదండ్రులు తట్టుకోలేకపోయారు. కన్న పేగు బంధాన్ని వీడలేక కన్నీరుమున్నీరుయ్యారు. తమ పాప చనిపోలేదని, మరుసటి రోజు ఉదయమే లేచి వస్తుందని గట్టిగా విశ్వసిస్తున్నారు. మృతిచెందిన పాపను ఎలాగైనా బతికించుకోవాలని ఆరాటపడుతున్నారు తల్లిదండ్రులు. పాప చనిపోయింది.. అంత్యక్రియలు చేయాలని, చిన్నారి మృతదేహాన్ని పాతిపెట్టాలని అక్కడి వారు ఎంత నచ్చజెప్పినా ఆ తల్లిదండ్రులు వినలేదు. పాప లేస్తుంది అదిగో అంటూ రోదిస్తున్నారు. 

ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని మౌ జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. అరవింద్ వనవసి అనే వ్యక్తి ఇటుకుల బట్టిలో కూలీగా పనిచేస్తున్నాడు. అతడి నాలుగేళ్ల కూతురు కొన్నిరోజుల క్రితం అనారోగ్యానికి గురైంది. నవంబర్ 14న ఆ పసిపాప మృత్యువుతో పోరాడి చివరికి కన్నుమూసింది. ఆరేళ్ల క్రితమే వనవసీ క్రిస్టియానిటీ స్వీకరించాడు. తన కుమార్తె చనిపోయిందని ఇంట్లో కుటుంబ సభ్యులు నచ్చజెప్పినా అతడు వినలేదు. 

తన పాప మృతదేహాన్ని అలాగే ఉంచాలని చెప్పాడు. పాపను బతికించుకోవడానికి పూజలు చేయించినట్టు పోలీసు ఇన్స్ పెక్టర్ వినోద్ తివారీ చెప్పారు. స్థానికులు ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలికి చేరుకున్నారు. వనవాసి  సహా కుటుంబ సభ్యులకు నచ్చజెప్పేందుకు పోలీసులు ప్రయత్నించారు. చివరికి పాప అంత్యక్రియలను సజావుగా సాగేలా చూశారు.