Protein
Protein : మనిషి శరీర నిర్మాణానికి ప్రొటీన్ అవసరత ఎంతో ఉంది. ముఖ్యంగా శాఖాహారం తీసుకునే వారిలో ప్రొటీన్ లోపం ఎక్కవగా కనిపిస్తుంది. మాంసకృతులు కలిగిన ఆహారం తీసుకోకపోవటం వల్ల చిన్నారుల మొదలు పెద్దల వరకు చాలా మందిలో ప్రొటీన్ లోపం కనిపిస్తుంది. హర్మోన్లు, ఎంజైముల ఉత్పత్తి, కణజాలం నిర్మాణం కోసం ప్రొటీన్లే కీలకం.
శరీరంలో ప్రొటీన్లు లోపిస్తే, ఆప్రభావం శరీరంలోని వివిధ భాగాలపై పడుతుంది. ముఖ్యంగా కాలేయం, జుట్టు, గోళ్లు, చర్మం, కండరాల్లో లోపాలు గమనించవచ్చు. పోషకాహార లోపం కారణంగా అనేక ఆరోగ్యసమస్యలు చుట్టుముడతాయి. గుండె కండరాలు బలహీనపడి కొన్ని సందర్భాల్లో గుండె వైఫల్యం చెంది మరణానికి దారితీయవచ్చు. రోగనిరోధకశక్తిపైనా ప్రభావం చూపిస్తుంది. ఎక్కవ అలసటగా అనిపిస్తుంది. కళ్లక్రింద క్యారి బ్యాగులు వస్తాయి. ఎముకలు పెళుసుగా మారతాయి.
శరీరంలో ప్రొటీన్లు లోపిస్తే తిరిగి వాటిని పొందటానికి సమతుల్య ఆహారం తీసుకోవాలి. మాంసకృతులు లభించే ఆహారం తీసుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఎరుపు మాంసం,గుడ్లు, గింజలు, సోయా, బీన్స్ , సముద్రపు ఆహారం, వంటివాటిని తీసుకోవాలి. వీటి ద్వారా సహజ సిద్ధంగా శరీరానికి అవసరమైన ప్రొటీన్ ను పొందవచ్చు.
అయితే ఇటీవలి కాలంలో మార్కెట్లోకి ప్రొటీన్ అవసరాలను తీర్చేందుకు అనేకమైన ప్రొటీన్ పౌడర్ లు లభ్యమౌతున్నాయి. వీటిని బఠానీ, సోయా, పాల నుండి తయారు చేస్తున్నారు. ముఖ్యంగా మాంసాహారాలు తినని వారికి ఈ తరహా ప్రొటీన్ పౌడర్లు ఎంతో ఉపయోగపడతాయి. అయితే ఈ ప్రొటీన్ మొత్తాలను తగినంత మోతాడులోనే తీసుకోవాల్సి ఉంటుంది. బరువు తక్కువగా ఉన్నవారు ప్రొటీన్ పౌడర్ ను రోజు వారిగా వైద్యులు సూచించిన మోతాదులో తీసుకుంటే బరువు పెరిగే అవకాశం ఉంటుంది.
అంతేకాకుండా కండరాల నిర్మాణాలకు దోహదం చేస్తుంది. ముఖ్యంగా మహిళలకు ఈ ప్రొటీన్ పౌడర్ లు ఎంతో మేలు చేస్తాయి. దీని వల్ల మంచిపోషకాలను శరీరానికి అందించవచ్చు. ప్రొటీన్ పౌడర్ తీసుకుంటే కొందరిలో కడుపు నిండిన భావన ఎక్కువ సేపు ఉండటం వల్ల మితంగా తినేందుకు అవకాశం ఉంటుంది. తద్వారా బరువు సైతం తగ్గవచ్చు. జిమ్ కు వెళ్లి వర్కవుట్ లు చేసే వారు, అథ్లెటిక్స్ కు ప్రొటీన్ పౌడర్ వారి కండరాల నిర్మాణానికి దోహదం చేయటంతోపాటు శక్తిని అందిస్తుంది.