వర్షాలు కురవడం లేదని కప్పలకు పెళ్లిళ్లు చేయడం ఎప్పటినుంచో వస్తున్న సంప్రదాయం. కప్పలు అరిస్తే వర్షాలు పడతాయని నమ్మకం.
వర్షాలు కురవడం లేదని కప్పలకు పెళ్లిళ్లు చేయడం ఎప్పటినుంచో వస్తున్న సంప్రదాయం. కప్పలు అరిస్తే వర్షాలు పడతాయని నమ్మకం. చాలా ప్రాంతాల్లో వర్షాల కోసం కప్పలకు పెళ్లి చేస్తుంటారు. ఇటీవల మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు కురవక ప్రాంత వాసులు అల్లాడిపోయారు. వర్షాలు కురవాలని వాన దేవుడిని ప్రార్థిస్తూ జూలై నెలలో రెండు కప్పలకు పెళ్లి చేశారు. అప్పటివరకూ ఎండిపోయిన అక్కడి ప్రాంతాల్లో జోరుగా వర్షాలు కురిశాయి.
వానదేవుడు కరుణించాడని సంబరాలు చేసుకున్నారు. కానీ, వర్షాలు ఆగకుండా కురుస్తూనే ఉన్నాయి. భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించాయి. వర్షాల కోసం దేవున్ని ప్రార్థించిన వారే ఇప్పుడు వర్షాలు తగ్గాలని వేడుకుంటున్నారు. వాన దేవుడు శాంతించాలని వరదలు తగ్గాలని కోరుతున్నారు. వర్షాల కోసం పెళ్లి చేసిన కప్పలను వరదలు తగ్గాలంటూ వేరుచేశారు. ఇంద్రపూరి ప్రాంతంలో జంట కప్పులకు అక్కడి వారు డివర్స్ ఇచ్చారు.
కప్పలకు పెళ్లి చేస్తే వర్షాలు పడ్డాయని, అదే కప్పలకు విడాకులు ఇస్తే.. వరదలు తగ్గుముఖం పడతాయని వారి నమ్మకం. మధ్యప్రదేశ్ లో వరదల కారణంగా ప్రాంత వాసులు ఇబ్బందులు పడుతున్నారు. వరదల బీభత్సంతో 9వేల నివాసాలు నీట మునిగాయి. 213 ఇళ్లు కూలిపోయాయి. రానున్న 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని రెండు రోజుల క్రితమే వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది.
దేశంలో కప్పలకు పెళ్లిళ్లు చేయడమనేది వింతైన విషయం కాదు. ఎప్పటినుంచో అనాధిగా వస్తు్న్న ఆచార సంప్రదాయాల్లో ఇదొకటి. కప్పలకు పెళ్లి చేస్తే వానదేవుడు కరుణిస్తాడని ప్రజల విశ్వాసం. ఈ ఏడాదిలో ఉడిపిలో రెండు కప్పలకు పెళ్లి చేశారు. కప్పల పెళ్లిని మండూక పరిణయంగా పిలుస్తుంటారు. కప్పలకు పెళ్లి చేస్తే వానదేవుళ్లు కరుణించి వర్షాలు కురిపిస్తారని విశ్వసిస్తుంటారు.