Guillain Barre Syndrome
Guillain Barre Syndrome : చైనా పుణ్యామని కొత్త కొత్త వైరస్‌లు పుట్టుకొస్తున్నాయి. అప్పట్లో కరోనా ప్రపంచాన్ని కుదిపేసింది. ఇటీవలే హ్యూమన్ మెటాప్‌న్యూమోవైరస్ (HMPV) భారత్‌లో భయాందోళనలను సృష్టించింది. వైరస్ వ్యాప్తికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు కూడా ఇచ్చింది. ఎక్కడెక్కడి నుంచో సోకిన కేసులు దేశంలో బయటపడుతున్నాయి. ఇంతలో పుణెలో మరో అరుదైన సిండ్రోమ్ బెంబేలిత్తిస్తోంది.
అదే.. గులియన్-బార్రే సిండ్రోమ్ (GBS).. వాస్తవానికి ఇది ఒక అరుదైన రుగ్మత. శరీరంలో రోగనిరోధక వ్యవస్థ పొరపాటున పరిధీయ నరాలపై దాడి చేయడం వల్ల వ్యాపిస్తుంది. ఈ రుగ్మత కారణంగా కండరాల బలహీనత, పక్షవాతం, అనేక ఇతర సమస్యలకు దారితీస్తుంది. ఇటీవల, పూణేలో (GBS) కేసులు పెరుగుతున్నట్లు నివేదికలు వచ్చాయి. ఈ వ్యాధి కేసులు పెరుగుతుండటంతో ఆరోగ్య సంరక్షణ నిపుణులు, ప్రజలలో తీవ్ర ఆందోళనలకు గురిచేస్తోంది.
కొన్ని ఇన్ఫెక్షన్ల తర్వాత, బాక్టీరియా లేదా వైరల్ శరీరంలో రోగనిరోధక వ్యవస్థను ప్రేరేపిస్తుంది. దాంతో వ్యాధుల నుంచి రక్షించాల్సిన రోగనిరోధక శక్తి వ్యతిరేకంగా దాడి చేస్తుంది. ఫలితంగా శరీరంలోని నరాలు, కండరాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. దిగువ అవయవాలు, ఎగువ అవయవాలతో పాటు శ్వాసకోశ కండరాలను కూడా దెబ్బతీస్తుంది. అందుకే దీన్ని నరాల రుగ్మతగా పిలుస్తారని ఇంటెన్సివిస్ట్ కన్సల్టెంట్ డాక్టర్ సమీర్ జోగ్ పేర్కొన్నారు.
గులియన్-బార్రే సిండ్రోమ్ అంటే ఏంటి? :
వైద్యుల ప్రకారం.. గులియన్-బార్రే సిండ్రోమ్ అనేది అరుదైన రుగ్మత. ఇందులో ఆకస్మిక తిమ్మిరి, కండరాల బలహీనత సంభవిస్తుంది. అంతేకాదు.. ఈ వ్యాధి బారినపడిన వారి చేతులు, కాళ్ళలో తీవ్రమైన బలహీనత వంటి లక్షణాలను కలిగిస్తుంది.
ది టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.. గులియన్-బార్రే సిండ్రోమ్ (GBS) అనేది అరుదైన నాడీ సంబంధిత రుగ్మత. శరీరంలో రోగనిరోధక వ్యవస్థ పొరపాటున పరిధీయ నాడీ వ్యవస్థపై దాడి చేస్తుంది. ఈ పరిస్థితి బలహీనత, తిమ్మిరి, తీవ్రమైన సందర్భాల్లో పక్షవాతం కలిగిస్తుంది. జీబీఎస్ ఎవరినైనా ప్రభావితం చేయగలిగినప్పటికీ, కచ్చితమైన కారణం తెలియదు.
కోలుకోవడానికి ఎన్ని రోజులు పట్టవచ్చు :
చాలా మంది బాధితుల్లో కొన్ని వారాల నుంచి నెలలలోపు కోలుకుంటారు. 80శాతం మంది పూర్తిగా కోలుకుంటారు. 15శాతం మంది బలహీనంగా ఉండవచ్చు. మరో 5శాతం మంది తీవ్రమైన సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.
జీబీఎస్ లక్షణాలేంటి? :
జీబీఎస్ లక్షణాలు సాధారణంగా అకస్మాత్తుగా కనిపిస్తాయి. కొన్ని రోజులు లేదా వారాలలో వేగంగా బయటకు కనిపిస్తాయి. సాధారణ లక్షణాలలో బలహీనత, జలదరింపు తరచుగా పాదాలలో మొదలై చేతులు, ముఖానికి వ్యాపించవచ్చు. బాధిత వ్యక్తులు నడవడానికి కూడా చాలా ఇబ్బంది పడతారు. కదలిక, బ్యాలెన్స్‌పై కూడా ప్రభావితం చేస్తుంది.
వెనుక అవయవాలలో కనిపించే న్యూరోపతిక్ నొప్పిని కూడా కలిగిస్తుంది. సక్రమంగా లేని గుండె లయ, రక్తపోటులో హెచ్చుతగ్గులు, తీవ్రమైన సందర్భాల్లో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటాయి. తీవ్రమైన సందర్భాల్లో జీబీఎస్ పక్షవాతానికి దారితీస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో బాధిత వ్యక్తులకు వెంటిలేషన్ అవసరం పడుతుంది. జీబీఎస్ లక్షణాలు తేలికపాటి నుంచి తీవ్రమైన వరకు ఉంటాయి.
జీబీఎస్ వ్యాప్తికి కారణమేంటి? :
జీబీఎస్ సాధారణంగా వైరల్ లేదా బ్యాక్టీరియా సంక్రమణ తర్వాత సంభవిస్తుంది. శరీరం సంక్రమణతో పోరాడే క్రమంలో అది పొరపాటున నరాలపై దాడి చేస్తుంది. దీని కారణంగా, శరీర భాగాలలో బలహీనత, తిమ్మిరి అనుభూతి కలుగుతుంది.
భయపడాల్సిన అవసరం లేదు :
జీబీఎస్ అంటువ్యాధిగా రూపుదాల్చదని నిపుణులు అంటున్నారు. దీనిపై పుణెలోని ఆరోగ్య శాఖ కట్టుదిట్టమైన పర్యవేక్షణ ప్రారంభించింది. అన్ని నమూనాలను పరీక్షించి, బాధిత రోగులకు మెరుగైన చికిత్స అందిస్తున్నారు.
పూణేలో GBS కేసుల పెరుగుదల :
పూణె మునిసిపల్ కార్పొరేషన్ ఆరోగ్య విభాగం బాధిత రోగుల నుంచి సేకరించిన నమూనాలను పరీక్ష కోసం (ICMR-NIV)కి పంపినట్లు అధికారి తెలిపారు. అకస్మాత్తుగా తిమ్మిరి, కండరాలు బలహీనపడటం, అవయవాలు తీవ్రంగా బలహీనపడటం వంటి లక్షణాలతో జీబీఎస్ అరుదైన వ్యాధిగా వైద్యులు తెలిపారు. నగరంలోని 6 ఆస్పత్రుల్లో 24 అనుమానిత జీబీఎస్ కేసులు నమోదయ్యాయని పౌర ఆరోగ్య విభాగం చీఫ్ డాక్టర్ నీనా బోరాడే తెలిపారు.
“ఇది పీడియాట్రిక్, చిన్న వయస్సు గ్రూపులలో ప్రబలంగా ఉంటుంది. అయినప్పటికీ, జీబీఎస్ అంటువ్యాధి లేదా మహమ్మారికి దారితీయదు”అని ఆమె చెప్పారు. సాధారణ చికిత్సతో చాలా మంది పూర్తిగా కోలుకుంటారు. జీబీఎస్ నిర్ధారణలో సాధారణంగా వైద్యపరమైన మూల్యాంకనం, నాడీ సంబంధిత పరీక్షలు, ఎలక్ట్రోమియోగ్రఫీ (EMG), కటి పంక్చర్ వంటి పరీక్షలను నిర్వహిస్తారు.
Read Also : HMPV Virus Symptoms : పెరుగుతున్న హెచ్ఎంపీవీ వైరస్ కేసులు.. లక్షణాలు ఏంటి? ఎవరెవరికి రిస్క్ ఎక్కువంటే?