Rainy Season Food : వర్షాకాలంలో అనారోగ్య సమస్యల బారినపడకుండా ఉండాలంటే మరింత జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా తీసుకునే ఆహారంలోనూ జాగ్రత్తలు పాటించాలి. ఈ కాలంలో జీర్ణవ్యవస్థ పనితీరు మందగిస్తుంది. ఏది పడితే అది తింటే అజీర్తి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ప్రధానంగా బయటి ఆహారాన్ని తినడం మానుకోని ఇంట్లో తయారు చేసిన వేడివేడి ఆహారాన్ని తింటూ సరైన జాగ్రత్తలు తీసుకుంటే. అనేక రకాల ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
వీధుల్లో అమ్మే ఆహార పదార్థాలను తీసుకోకపోవటం ఉత్తమం. పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వండి. క్లీన్‌గా ఉండే ప్రాంతంలో కూర్చుని తినండి. అలాగే కూరగాయలు పండ్లు ఏవైనా నీటిలో శుభ్రపరిచి ఆపై తీసుకోండి. ఎక్కువగా ఊరగాయలు, చట్నీలు, మిరపకాయలు, పెరుగు, కూర వంటి ఆహార పదార్థాలను తీసుకోకపోవడం మంచిది. ఉప్పు ఎక్కువగా వుండే ఆహారాలు నీరు నిలుపుదల, అజీర్ణం, అధిక ఆమ్లత, కడుపు ఉబ్బరం వంటి వాటిని ప్రోత్సహిస్తాయి. బాగా వేయించిన ఆహారాలు, జంక్ ఫుడ్ మరియు మాంసం తినకూడదు.
వర్షం పడే సీజన్‌లోనే ఇన్ఫెక్షన్‌లు ఎక్కువగా సోకే కాలం. ఈ కాలంలో ఏ ఆహారం ప్రత్యేకంగా తినాలో ఇప్పుడు తెలుసుకుందాం. వర్షాకాలంలో ఫుడ్‌పై ఏమాత్రమ అలసత్వం వహించినా. జలుబు,దగ్గు ఇతర వ్యాధుల బారినపడాల్సి వస్తుంది. ఈ కాలంలో ఇమ్యూనిటీ లెవల్ కూడా తగ్గిపోతుంది. మన రోజూవారీ ఆహారంలో కొన్ని ప్రత్యేకమైన ఫుడ్ మన డైట్‌లో చేర్చుకోవాలి. వర్షాకాలంలో సీజనల్‌ను బేస్ చేసుకుని ఫుడ్ తీసుకోవాలి. బాడీ మెటబాలిజం వేసవి కాలం కంటే వర్షాకాలంలో పెరుగుతుంది.
తేలికైన సులభంగా జీర్ణమయ్యే ఆహారాలను తీసుకోండి. వండిన లేదా ఆవిరి కూరగాయలు, బీరకాయ, గుమ్మడికాయ, సలాడ్, పండ్లు, పెసర, కిచిడి, మొక్కజొన్న, శనగపిండి, వోట్మీల్‌తో తయారైన ఆహార పదార్థాలను ఎంచుకోవచ్చు. వంటలకు తేలికగా ఉండే నెయ్యి, ఆలివ్ నూనె, మొక్కజొన్న నూనె, పొద్దుతిరుగుడు నూనెలను ఉపయోగించండి. హెవీ నూనెలైనా ఆవనూనె, వెన్న, వేరుశెనగ నూనెలను వాడకపోవడం మంచిది. కారం ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకోకుంటే మంచిది. కారం ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవడం వలన అలర్జీలు వచ్చే అవకాశం ఉంటుంది.
ఆకుకూరాలు కూడా కాస్త తగ్గించాలి. ఎందుకంటే బయట వాతావరణం కూడా చల్లగా ఉంటుంది కాబట్టి. వర్షాకాలంలో బ్యాక్టిరియా బయటి వాతావరణంలో ఎక్కువగా ఉంటుంది. దీంతో వాటర్, ఫుడ్ కంటామినేట్ అయిపోతుంది. అందుకే రోడ్‌పైన విక్రయించే తినుబండారాలకు దూరంగా ఉండాలి. కాయగూరలు, ఆకుకూరలు గోరు వెచ్చటి నీటిలో కడిగి వండుకోవాలి. ముఖ్యంగా ఈ సీజన్‌లో కాకరకాయ తీసుకోవాలి.
కూరల్లో పసుపుకచ్ఛితంగా వేసుకోవాలి. కేవలం వర్షాకాలంలోనే దొరికే నేరేడు పండ్లను తప్పకుండా తినాలి. దీనిలో సమృద్ధిగా దొరికే విటమిన్ సీ.. ఈ సీజన్‌లో మన ఆరోగ్యానికి ఎంతో అవసరం. కాస్త స్టార్చీ ఉన్న పండ్లను తీసుకోవచ్చు. ఆపిల్, దానిమ్మ, అరటిపండ్లను ఎక్కువగా తినాలి. వీటి వల్ల తక్షణ శక్తిని పొందవచ్చు. ముల్లంగి రసాన్ని తాగితే దగ్గు, జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది. కాకరకాయ, వేప, మెంతులు మరియు పసుపు వంటి చేదు మూలికలు ఇన్ఫెక్షన్‌లను నిరోధిస్తాయి. ఈ సీజన్‌లో నీరు కూడా 2.5లీటర్ల నుండి 3 లీటర్ల నీరు రోజు మొత్తంలో తీసుకోవాలి. తాగే నీటి విషయంలో జాగ్రత్త పాటించాలి.
ఫ్రీజ్‌లో నిల్వ ఉంచిన ఫుడ్ తీసుకోవడం మంచిది కాదు. ఎప్పటికప్పుడు తాజాగా వండుకున్న ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. వర్షా కాలంలో హెర్బల్ టీ లేదా కషాయాలను తాగడం ద్వారా మీ రోగనిరోధక శక్తిని మరింత శక్తివంతంగా మెరుగుపడుతుంది. దీనికోసం పసుపు, తులసి, అల్లం, వెల్లుల్లి, దాల్చినచెక్క, నల్ల ఉప్పును నీటిలో వేసి బాగా మరిగించాలి. ఆ తర్వాత దానిలో నిమ్మరసం, తేనె కలుపుకోని తాగితే చాలా రకాల వ్యాధులను అరికట్టవచ్చు.
అల్లం-వెల్లుల్లి ఆరోగ్యవంతంగా ఉండటానికి ఔషధంలా పనిచేస్తాయి. ముఖ్యంగా అంటువ్యాధులతో పోరాడటానికి, మంటను తగ్గించడానికి, ఆక్సీడేటివ్ స్ట్రెస్‌ను తగ్గించడానికి మంచి ఔషధంగా పనిచేస్తుంది. ముఖ్యంగా ఈ వాతావరణంలో మురుగు నీటికి, అపరిశుభ్రంగా ఉన్న ప్రదేశాలకు దూరంగా ఉండాలి. వ్యాధుల బారిన పడకుండా వర్షాకాలంలో మన ఆహారపు అలవాట్లే మనల్ని కాపాడుతాయి.