Jasmin
Jasmine : మల్లెలంటే ఇష్టపడని మహిళలుండరు. జెడలో పెట్టుకుంటే సువాసనలు వెదజల్లుతాయి. మహిళలకు అందాన్ని తెచ్చిపెడతాయి. ఒత్తిడికి లోనైన వారు మల్లెల వాసనలు పీలిస్తే దానిని నుండి ఉపశమనం పొందుతారు. మల్లెల్లో యాంటీ వైరల్, యాంటీ బాక్టీరియా గుణాలు ఉన్నాయి. సుఖవంతమైన నిద్రకు మల్లెల వాసనలు ఉపకరిస్తాయి. కొబ్బరి నూనెలో మల్లెపూలు వేసి ఓ రాత్రంతా బాగా నానబెట్టి ఆ తర్వాత బాగా మరగబెట్టి తలకు పట్టిస్తే కేశాలు ఆరోగ్యవంతమవడమే కాక మాడుకు చల్లదనాన్నిస్తుంది. ఈ నూనె చర్మానికి తేమను అందిస్తుంది. చర్మం పొడిబార కుండా కాపాడుతుంది.
మల్లెపూల రసం తీసి గులాబీ పువ్వుల రసం, గుడ్డులోని పచ్చ సొన రెండేసి స్పూన్ల చొప్పున కలిపి ముఖానికి రాస్తే ముఖం మృదువుగా కాంతివంతంగా మెరిసిపోతుంది. మల్లెపూలలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అందువల్ల పలు ఔషధాలలో మల్లెపూలను వినియోగిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో మల్లెపూలతో తయారైన వివిధ రకాల ఉత్పత్తులు విక్రయిస్తున్నారు. మల్లె పువ్వులను ఫేస్ ప్యాక్‌గా వేసుకుంటే చర్మం నిగారింపు సంతరించుకుంటుంది. మల్లెల్ని పేస్టుగా చేసి కొద్దిగా పాలు కలిపి, నెమ్మదిగా మసాజ్ చేసుకోవాలి. ఆ తర్వాత ముల్తానామట్టి, గంధం, తేనె అరస్పూన్ చొప్పున కలిపి ప్యాక్ వేసుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
మల్లెపూలతో టీ తయారు చేసుకోవచ్చు. ఈ టీ తాగటం వల్ల రక్తపోటు తగ్గుతుంది. రోగనిరోధక శక్తి పెరిగి వృద్ధాప్య లక్షణాలు దరిచేరవు. గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు తగ్గుతాయని అధ్యయానాల్లో తేలింది. రాత్రి నిద్రకు ముందు ఒక కప్పు మల్లె టీ తాగటం వల్ల ప్రశాంతంగా నిద్రించవచ్చు. తలలో చుండ్రు సమస్య అధికంగా ఉంటే మెంతులతోపాటు కాసిన్ని ఎండుమల్లె పూలు కలిపి నూరి తయారైన చూర్ణాన్ని తలకు పట్టిస్తే చుండ్ర సమస్య తగ్గడమే కాక జుట్టు కూడా పట్టు కుచ్చులా మెరిసిపోతుంది. మల్లె ఆకులతో తయారైన ఆయుర్వేద మందులు మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్ నివారణకు వాడుతున్నారు. సుఖ రోగాలకి, పచ్చకామెర్లకు ,దివ్యౌషధంగా మల్లె రసం పనిచేస్తుంది.