Sleep
Sleep : మన శరీరాన్ని, మనస్సును రీఛార్జ్ చేయడంలో సహాయపడే ముఖ్యమైన పని నిద్ర. ఆరోగ్యకరమైన నిద్ర శరీరాన్ని ఫిట్‌గా ఉంచడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా వ్యాధులను మనదరికి చేరకుండా చూస్తుంది. మనకు తగినంత నిద్ర లేనప్పుడు, మెదడు సరిగ్గా పనిచేయదు. అది ఏకాగ్రత, స్పష్టంగా ఆలోచించడం, జ్ఞాపకాలను పదిలం చేయడంలో మన సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. యుక్తవయస్సులో ఉన్న వ్యక్తికి ఏడు నుండి తొమ్మిది గంటల సమయం నిద్ర అవసరమౌతుంది.
అయితే పని షెడ్యూల్, రోజువారీ ఒత్తిళ్లు, బెడ్‌రూమ్ వాతావరణంలో నిద్రకు అంతరాయం కలగటం, ఆరోగ్య పరిస్థితులు మనకు తగినంత ప్రశాంతమైన నిద్ర లేకుండా చేస్తాయి. అందువల్ల, ఆరోగ్యకరమైన ఆహారం,మంచి జీవనశైలి, అలవాట్లు ప్రతి రాత్రి మంచి నిద్రను అందిస్తాయి. కొంతమందిలో దీర్ఘకాలిక నిద్రలేమి అన్నది ఒక రుగ్మతగా కనిపిస్తుంది. నిద్ర అనేది ఒకరి మానసిక స్థితిని, ఆరోగ్యాన్ని తెలియజేస్తుంది. మంచి నిద్ర అనేది ఒక వ్యక్తి రోజంతా రిఫ్రెష్‌గా ఉండేలా చేస్తుంది.
పగటిపూట ఎంత ఊత్సాహంగా ఉన్నారో తెలియజేసేందుకు నిద్ర పరిమాణంలో విస్తృతమైన వైవిధ్యం ఉన్నప్పటికీ, ఎక్కువ మంది పెద్దలకు ఎనిమిది గంటల నిరంతరాయ రాత్రి నిద్ర అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. మంచి మానసిక,శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తగినంత నిద్ర చాలా ముఖ్యం. నిద్ర లేమి ఉన్న వ్యక్తి తరచుగా పనితీరులో క్షీణత, జ్ఞాపకశక్తి లోపం, పనులపై దృష్టి పెట్టలేకపోవడం మానసిక ఆందోళన చిరాకు వంటి ఇబ్బందికర పరిస్ధితులను అనుభవించాల్సి వస్తుంది. అదేవిధంగా ఎనిమిది నుండి తొమ్మిది గంటల వరకు నిద్రపోయేవారిలో అకాల మరణాలు తక్కువగా ఉన్నట్లు పలు పరిశోధనలు తేల్చాయి.
సృజనాత్మక ఆలోచనలు, దీర్ఘకాలిక జ్ఞాపక శక్తి, మరియు ఆలోచనా స్థాయిలను పెంచడంలో నిద్ర ప్రధాన పాత్ర పోషిస్తుంది. పగలంతా పని చేయడం వల్ల కండరాలు అలసిపోయి ఉంటాయి. తిరిగి వాటిని పునరుత్తేజం చేసేందుకు కొత్త కణాలు రూపొందటానికి, మెదడు పనితీరు మెరుగుపర్చుకునేందుకు నిద్ర ఎంతో అవసరం. సరిగ్గా నిద్రపోకపోతే అది శారీరక, మానసిక ఆరోగ్యం పై ప్రభావం చూపిస్తుంది. తక్కువ సమయం నిద్రించటం అన్నది ఈ మధ్యకాలంలో చాలా మందికి అలవాటై పోయింది. ఇది ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు.