Colorful Visualization : రంగుల ‘ఊహల ఊయల’లో తేలియాడండీ..చిటికెలో ఒత్తిడి హుష్ కాకి

ఒత్తిడిలో ఉన్నారా? జస్ట్ కళ్లు మూసుకోండి అని సూచిస్తున్నారు మానసిక నిపుణులు..

Colorful Visualization..to Do Without Stress

Colorful Visualization :‘ఒత్తిడి’. ఈ మూడు అక్షరాలు మనిషి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని..కాబట్టి ఒత్తిడిని జయించటానికి జాగ్రత్తలు తీసుకోవాలని మానసిక నిపుణులు పదే పదే సూచిస్తుంటారు. మానసిక ఒత్తిడి అనేది శరీరంపై బాగా ఉంటుంది. ముఖ్యంగా ఒంటరితనంతో ఉంటే ఈ ఒత్తిడి మరింత పెరుగుతుంది. ఈ ఒత్తిడిని ఎలా జయించాలి? ఒత్తిడి అనేది దరి చేరకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఒత్తిడితో సతమతమవుతుంటే ‘జస్ట్ కళ్లు మూసుకోండి..రంగు రంగుల ప్రపంచాన్ని ఊహించుకోండి..మీకిష్టమైనది ఊహించుకోండి ఒత్తిడిని ఉపశమనం పొందండి’అని చెబుతున్నారు మానసిక నిపుణులు.

మనసు ఆందోళనకరంగా మారుతోంది. జస్ట్ కళ్లు మూసుకోండి..మనస్సు కకావికలంగా గందరగోళంగా ఉందా? అయితే ‘జస్ట్ కళ్లు మూసుకోండి రంగుల ఊహల్లోకి వెళ్లిపోండి..కళ్లు మూసుకొని.. మీ మనోనేత్రాన్ని తెరవండి…’ అని సూచిస్తున్నారు మానసిక నిపుణులు. మీకు నచ్చిన వస్తువుల్ని..మీకు నచ్చిన ప్రదేశాలను తలచుకోండి. మీకు నచ్చినట్లుగా ఊహించుకోండి. మనం చూసే చూపు, ఊహించుకునే విధానం ఒత్తిడి, ఆందోళనను తగ్గించడంతోపాటు సుఖంగా నిద్రపోవడానికి ఉపకరిస్తుందని మనస్తత్వ నిపుణులు సూచిస్తున్నారు. ఏదైనా కొనాలంటే ఖర్చు అవుతుంది. ఎక్కడికన్నా వెళ్లాలన్నా ఖర్చు అవుతుంది. కానీ ఊహలకు ఖర్చు ఏముంటుంది?అందుకే ఖర్చులేకుండా ఒత్తిడి తగ్గించుకోవటానికి ఊహలే చక్కటి మార్గాలంటున్నారు.

మనిషికి మాత్రమే ఉన్న అద్భుతమైన శక్తి ‘ఊహ’. మనం భౌతికంగా చేయలేని ఎన్నో పనులు ఊహల్లో చిటికెలో జరిగిపోతుంటాయి. ఒక్క నయాపైసా ఖర్చు కూడా అవ్వని పని ‘ఊహ’. ఈ ఊహాజనితమైన ఆలోచనలు మిమ్మల్ని ఒత్తిడి, ఆందోళనల నుంచి ఇట్టే బయటపడేస్తాయని భరోసా ఇస్తున్నారు నిపుణులు. ఒంటరిగా ఫీలవుతున్నప్పుడు ఊహల ఊయల ఊగమని చెబుతున్నారు. మరి అవి ఎలాగో తెలుసుకుందాం..

-మనసు బాగోలేనప్పుడు..ఆందోళనగా ఉన్నప్పుడు తేలికైన రంగులను ఊహించుకోండి. మీ కంటికి నచ్చిన లేత రంగుల (లైట్ కలర్స్) తో పెయింట్‌ వేస్తున్నట్లు ఊహించుకోండి..ఆకుపచ్చ, నీలం, తెలుపు వంటి రంగులు పాత ఆలోచనల నుంచి విశ్రాంతిని ఇస్తాయని చెబుతున్నారు నిపుణులు.

-పాత ఆలోచనల్లో పడి పరధ్యానంలో మునిగిపోయేవారు మీ దగ్గరున్న ఏదైనా వస్తువుతో కొత్తగా ఏం చేయవచ్చో ఊహించుకోవాలని సూచిస్తున్నారు శాస్త్రవేత్తలు. పరధ్యానాన్ని పారదోలడానికి ఏదో ఒకటి చెయ్యండి. ఉన్నచోట మాత్రం అలాగే ఉండకూడదు.

-ప్రకృతి, పచ్చదనం మనిషికి ఎప్పటికీ హాయినిస్తాయి. ప్రశాంతతనిస్తాయి. ఎంత ఒత్తిడిలో ఉన్నా పచ్చదనంలో కాసేపు విహరిస్తే మనస్సు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది.అలాగే సూర్యోదయం వేళ ఉద్యానవనంలో తిరిగితే ఎంత హాయిగా ఉంటుందో కదా..మనస్సు స్వర్గంలో ఉన్నట్లే ఉంటుంది. అందుకే సూర్యోదయం వేళ ప్రకృతి ఒళ్లు విరుచుకునే శుభవేళం సూర్యోదయంలో పచ్చని చెట్ల మధ్య విహరించటం కుదరకిపోతే అలా ఉన్నట్లే ఊహించుకోమని చెబుతున్నారు మానసిక నిపుణులు. గాలి స్పర్శను అనుభూతి చెందుతున్నట్లుగా, పూల వాసన చూస్తున్నట్టు.. ఇలా మనసు కోటలో విహరించండి అని చెబుతున్నారు.

-ధవళవర్ణపు (తెల్లని రంగు) సూర్యకాంతిని ప్రాణవాయువుగా పీల్చుకుంటున్నట్లు ఊహించుకోండి. ఈ సమయంలో ప్రతి ఉచ్ఛాస శరీరానికి వేడినిస్తుంది. ఇలా పది నుంచి ఇరవై శ్వాసలు ఆగకుండా తీసుకోండి. శ్వాస ఎక్కువగా తీసుకుంటూ, తక్కువగా వదులుతూ ఉండాలి. అలా చేస్తే..శరీరంపై మనసు లగ్నమవుతుంది. పాత ఆలోచనల నుంచి బయటపడతారు. చక్కటి ఏకాగ్రత కుదురుతుంది. ఏకాగ్రత కుదిరితే ఊహలు మరింత శక్తినిస్తాయి. కాబట్టి అప్పుడప్పుడు అలా..అలా..ఊహల్లో తేలిపోవడం వల్ల ఒత్తిడిని జయించవచ్చు అని నమ్మకంగా చెబుతున్నారు మనస్తత్వ శాస్త్రజ్ఞులు.

-స్వచ్చమైన నీటిలో జలకాలాడుతున్నట్లు ఊహించుకోండి..చల్లటి నీరు శరీరానికి తాకి గిలిగింతలు పెడుతుంటే కలిగే హాయి ఎంత మధురంగా ఉంటుంది? అలా నీటిలో జలకాలు ఆడటం కుదరకపోతే అలా ఊహించుకోమంటున్నారు నిపుణులు. అలాగే మీకు ఇష్టమైన ప్రదేశానికి వెళ్లినట్లు…ఇష్టమైన పని చేస్తున్నట్లు..అలా మీకు ఇష్టమైనది చేస్తున్నట్లుగా ఊహించుకుంటే ఒత్తిడి తగ్గుతుందని చెబుతున్నారు మానసిక నిపుణులు.