Aprajitha Flowers
Shanku pushpam : ఫాబేసి కుటుంబానికి చెందిన తీగ జాతి పూల చెట్టు శంఖుపుష్ఫం.. దీనిని చాలా మంది దేవుని పూజల్లో వినియోగస్తుంటారు. అపరాజిత, గిరికర్ణిక, దింటెన అనే పేర్లతో కూడా పిలుస్తుంటారు. ఆయుర్వేద వైద్యంలో వివిధ రకాల రోగాల నివారణకు దీనిని ఉపయోగిస్తారు. చూడటానికి అందంగా ఉండే శంఖుపూలు ఆరోగ్యానికి ఉపకరిస్తాయి. శంఖుపువ్వులో ఉండే ఆర్గనెల్లా అనే పదార్ధం మెదడు పనితీరును మెరుగుపరిచి మతిమరుపు వంటి జబ్బులు దరిచేరకుండా చూస్తుంది. ఆస్తమా, జలుబు, దగ్గుతో బాధపడేవారు శంఖుపూలతో తయారు చేసిన టీ తాగితే మంచి ప్రయోజనం ఉంటుంది.
వీర్యకణాల పెంపుతోపాటు, శరీరంలో కొల్లెజన్ ఉత్పత్తిని పెంచుతుంది. చర్మం ముడతలు రాకుండా చూస్తుంది. జుట్టు తెల్లబడకుండా నిరోధిస్తుంది. రక్తంలో గ్లూకోజ్ పెరగకుండా చూస్తుంది. శంకుపూల ఆకులు, వేర్లతో చేసిన పొడిని తెలివి తేటలు పెరిగేందుకు ఉపయోగిస్తారు. నిద్రలేమికి, ఒత్తిడిని తగ్గించటానికి పనిచేస్తుంది. పూలను నోట్లో వేసుకుని నమిలినా, లేకుంటే టీ లా పెట్టుకుని తాగినా మంచి ఫలితం ఉంటుంది. మహిళల నెలసరి సమస్యలను తొలగిపోవాలంటే ఈ శంఖుపూలతో కషాయాన్ని తయారు చేసుకుని తాగితే మంచిది. శరీరంలో ఉండే విషయపదార్ధాలను తొలగించేందుకు శంఖుపూల చెట్టు వేర్లతో తయారైన మందులను పూర్వకాలంలో ఉపయోగించేవారు.
అలసటను పోగొట్టటంలో శంఖుపూల కషాయం ఉపకరిస్తుంది. శరీరంలో ఆమ్లాన్ని తొలగించే యాంటీ యాక్సిడెంట్ గా పనిచేస్తుంది. శ్వాస సంబంధిత రోగాలను, హృద్రోగాలను నయం చేస్తుంది. ఒక గ్లాసు నీటిలో శంఖుపువ్వులను వేసి పది నిమిషాలు నానబెట్టి ఆనీటిని తేనె కలుపుకుని తాగితే ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. అయితే గర్భిణీ మహిళలు ఈ పుష్పాలను ఉపయోగించ కూడదు.
గమనిక ; ఈ సమాచారాన్ని వివిధ మార్గాల నుండి సేకరించి అందించటం జరిగింది. ఆరోగ్యపరమైన సమస్యలున్న వారు వైద్యుల సూచనలు సలహాలు పాటిస్తూ సమస్యలకు చికిత్స పొందటం మంచిది.