Deer Roam In Agriculture Fields Of Sangareddy District
Deer Roam In Sangareddy : చల్లటి వాతావరణ..ఆకు పచ్చని పంటపొలాలు. వర్షాకాలంలో కనువిందుచేస్తున్న ఆహ్లాదకరమైన వాతావరణంలో జింకలు చెంగు చెంగున గంతులేస్తుంటే చూడటానికి రెండు కళ్లు చాలవు కదా..అటువంటి మనోహరమైన దశ్యానికి సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ వేదికైంది. వర్షాకాలంలో పడుతున్న వానలకు పంట పొలాలు పచ్చగా కళకళలాడుతున్నాయి. దీంతో జింకలు గుంపులు గుంపులుగా వచ్చాయి. ఒకటి రెండు కాదు పదుల సంఖ్యలో గుంపులు గుంపులుగా వచ్చిన జింకలు పచ్చని పొలాల్లో చెంగు చెంగున ఎగురుతన్న దృశ్యాలు చూపరులను కట్టిపడేశాయి. కను రెప్ప వాలిస్తే ఆ అందాల దృశ్యాల్ని చూడలేమోనని కళ్లు పెద్దవి చేసుకుని ఆ మనోహర హరిణాలను చూస్తుండిపోయారు.
మైకోడ్ గ్రామంలోని పంటపొలాల్లోకి జింకల గుంపులు కనువిందు చేశాయి. పంటపొలాల్లోకి వెళ్లిన రైతుల కంటికి ఆ జింకలు కనిపించాయి.దీంతో రైతులు చెంగు చెంగున ఎగురుతున్న జింకల్ని తమ సెల్ ఫోనుల్లో బంధించారు. సెల్ ఫోనులు చేతిలో ఉంటే ఇటువంటి అరుదైన అద్భుతమైన దృశ్యాలు అందరికి కనువిందు చేస్తాయనటానికి ఇదో ఉదాహరణ అని చెప్పుకోవాలి. చాలా రోజుల తరువాత ఇలా జింకలు పంటపొలాల్లోకి వచ్చాయని రైతులు ఆనందంగా చెబుతున్నారు. పంట పొలాల్లో ఆటలాడుతున్న జింకలకు రైతులు వచ్చిన అలజడికి గంతులేస్తు పారిపోతున్న దృశ్యాలను సెల్ ఫోనుల్లో వీడియో తీయటంతో ఈ అరుదైన దశ్యం అందరి దృష్టికి చేరింది. వాహ్..ఏమి ఈ హరిణిల విలాసం..ఏమి వాటి ఆనందం అనేలా ఉంది ఈ లేళ్ల గంతులాట.మరి మీరు కూడా ఈ లేళ్ల గంతులపై ఓ లుక్కేయండీ..