Lok Sabha Elections 2024 : తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో బిగ్ ఫైట్.. ఓటర్లు ఎవరికి జైకొడతారో?

కమలం పార్టీ కొత్త వ్యూహాన్ని రచిస్తే.. కారు పార్టీ స్పీడ్ పెంచింది. మళ్లీ అసెంబ్లీ రిజల్ట్ రిపీట్ చేయాలని అటు కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది.

Lok Sabha Elections : 3 ప్రధాన పార్టీలు.. 17 సీట్లు.. తెలంగాణలో టఫ్ ఫైట్ నడుస్తోంది. పరస్పర ఆరోపణలు, వాగ్దానాలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. మళ్లీ సత్తా చాటాలని కాంగ్రెస్.. ఈసారి గెలిచి చూపిస్తామని బీఆర్ఎస్.. 10 సీట్లు పక్కా అంటూ బీజేపీ..ఇలా ఎవరికి వారు గెలుపుపై ధీమా ఉన్నారు.

తారస్థాయికి ప్రచార పర్వం..
గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియ కూడా షురూ కానుంది. ప్రచార ఘట్టం తారస్థాయికి చేరుకుంది. కమలం పార్టీ కొత్త వ్యూహాన్ని రచిస్తే.. కారు పార్టీ స్పీడ్ పెంచింది. మళ్లీ అసెంబ్లీ రిజల్ట్ రిపీట్ చేయాలని అటు కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది.

సీఎం రేవంత్ సుడిగాలి పర్యటనలు..
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో జెండా ఎగరేసిన కాంగ్రెస్ పార్టీ.. పార్లమెంట్ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని పట్టుదలగా ఉంది. 14 ఎంపీ సీట్లను కైవసం చేసుకుని బీఆర్ఎస్ ను భూస్థాపితం చేస్తామంటూ సవాల్ విసురుతోంది. ప్రచారాన్ని హోరెత్తించేందుకు కాంగ్రెస్ ప్రణాళికలు సిద్ధం చేసింది. శుక్రవారం నుంచి సీఎం రేవంత్ సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 50 సభలు, 15 రోడ్ షో లు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తోంది. మరోవైపు అభ్యర్థుల నామినేషన్ల ర్యాలీలోనూ సీఎం రేవంత్ పాల్గొననున్నారు.

మెదక్, వరంగల్, భువనగిరి, మహబూబ్ నగర్, మహబూబాబాద్ అభ్యర్థుల నామినేషన్ల కార్యక్రమాలకు సీఎం రేవంత్ హాజరుకానున్నారు. అలాగే ఒక్కో లోక్ సభ నియోజకవర్గంలో కనీసం 3 చోట్ల సీఎం సభలు నిర్వహించేలా కాంగ్రెస్ వ్యూహ రచన చేస్తోంది.

లోక్ సభ ఎన్నికలు.. బీజేపీ సరికొత్త వ్యూహం..
లోక్ సభ ఎన్నికల ప్రచారం కోసం బీజేపీ కొత్త వ్యూహం రచించింది. ప్రతి అభ్యర్థి నామినేషన్ ను భారీ ఈవెంట్ లా ప్లాన్ చేస్తోంది. ఒక్కో అభ్యర్థి నామినేషన్ కు ఒక్కో జాతీయ నేత వచ్చేలా షెడ్యూల్ ప్రిపేర్ చేశారు. నామినేషన్ల కార్యక్రమాలకు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, డిప్యూటీ సీఎంలకు తెలంగాణ బీజేపీ ఆహ్వానం పంపింది.

తెలంగాణకు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు
ఈ నెల 19న సికింద్రాబాద్ ఎంపీ స్థానానికి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు. కిషన్ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ హాజరుకానున్నారు. 18న మెదక్ ఎంపీ స్థానానికి రఘునందన్ రావు బీజేపీ తరుపున నామినేషన్ వేయనున్నారు. దీనికి గోవా సీఎం ప్రమోద్ సావంత్ చీఫ్ గెస్ట్ గా హాజరుకానున్నారు. ఈ నెల 18న ఈటల రాజేందర్ మల్కాజ్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈటల నామినేషన్ కార్యక్రమానికి కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరీ ముఖ్య అతిథిగా రానున్నారు. అలాగే కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా బండి సంజయ్ ఈ నెల 25న నామినేషన్ వేయనున్నారు. దీనికి గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, కిషన్ రెడ్డి చీఫ్ గెస్టులుగా హాజరుకానున్నారు.

బస్సు యాత్రలకు గులాబీ బాస్ ప్లాన్..
అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్.. పార్లమెంటు ఎన్నికల్లో సత్తా చాటాలని పట్టుదలగా ఉంది. గురువారం కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ నేతలు సమావేశం కానున్నారు. ప్రతిపక్ష పార్టీగా అవతరించిన తర్వాత తొలిసారి కేసీఆర్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సమావేశం ద్వారా నేతలను పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధం చేయనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా బస్సు యాత్రలు నిర్వహించాలని నిర్ణయించిన గులాబీ బాస్.. బస్సు యాత్ర రూట్ మ్యాప్ పై పార్టీ నేతలతో చర్చించనున్నారు. 17 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయబోతున్న బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులకు కేసీఆర్ ఈ సమావేశంలోనే బీ-ఫారాలు అందచేయనున్నారు.

తెలంగాణ ప్రజలు ఎవరికి జై కొడతారో?
ఇక తెలంగాణలో మూడు ప్రధాన పార్టీలు ప్రచారాన్ని హోరెత్తించనున్నారు. ప్రజలకు వాగ్దానాలతో పాటు ఇతర పార్టీల విమర్శనాస్త్రాలు సంధించేందుకు ఎవరికి వారు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మరి తెలంగాణ ప్రజలు ఎవరికి జై కొడతారో చూడాలి.

Also Read : కేసీఆర్‌కు సవాల్ చేస్తున్నా.. అలా చేస్తే 3 నెలల్లో ముగ్గురు మాత్రమే మిగులుతారు- మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

 

ట్రెండింగ్ వార్తలు