Hey Chikitha Review : ‘హే చికీతా’ మూవీ రివ్యూ.. పవనిజం అంటూ తిరిగే యూత్..
Hey Chikitha Movie Review: పవన్ కళ్యాణ్ పాటల్లోని హే చికీతా అనే క్యాచీ వర్డ్ పెట్టి సినిమాపై ఆసక్తి కలిగించారు.
- Saketh U
- Updated on- July 24, 2026 / 05:38 PM IST
Hey Chikitha Movie Review And Rating
Hey Chikitha Review : అమరావతి మూవీ మేకర్స్, సుందరకాండ మోషన్ పిక్చర్స్ బ్యానర్స్ పై ఎన్. అశోక ఆర్ఎన్ఎస్, గరుడవేగ అంజి నిర్మాణంలో తెరకెక్కిన సినిమా ‘హే చికీతా’. అభినవ్ మణికంఠ, దివిజ ప్రభాకర్, తన్మయ్ ఖుషి, దేవి ప్రసాద్, ఈటీవీ ప్రభాకర్, అజయ్.. ముఖ్య పాత్రల్లో ఈ సినిమాని ధనరాజ్ లెక్కల దర్శకత్వంలో తెరకెక్కించారు. హే చికీతా సినిమా నేడు జూలై 24న రిలీజ్ అయింది.
కథ విషయానికొస్తే..
ఈ కథ అంతా 2000 సంవత్సరంలో జరుగుతుంది. నాగులూరు, లచ్చక్కపేట అనే రెండు పక్కపక్క గ్రామాలు. శివ(అభినవ్ మణికంఠ)ఊళ్ళో వ్యవసాయం చేసుకుంటూ తన ఫ్రెండ్స్ ఢిల్లీ( జబర్దస్త్ అజయ్), రాజు, కృష్ణ, సూరిలతో కలిసి అల్లరిచిల్లరిగా తిరుగుతూ ఉంటారు. శివ, పక్కూరిలో ఉండే తన మరదలు చిట్టి(దివిజ ప్రభాకర్) చిన్నప్పట్నుంచి ప్రేమించుకుంటారు. ఇంకో మరదలు పొట్టి(తన్మయ్ ఖుషి) శివని ప్రేమిస్తుంది. పవన్ కళ్యాణ్ బద్రి సినిమా రిలీజ్ రోజు శివ, తన మరదలు, ఫ్రెండ్స్ తో కలిసి వెళతాడు. అక్కడ పక్కూరికి చెందిన కొంతమందితో గొడవ పెట్టుకుంటాడు శివ.
తన ఊళ్ళో గణేష్ నవరాత్రి ఉత్సవాల కోసం ఊళ్ళో పెద్ద మనుషులతో గొడవ పడి ఇంకో పందిరి పెట్టి పవనిజం యూత్ అని పెట్టుకొని ఘనంగా చేస్తారు శివ, అతని ఫ్రెండ్స్. కానీ నిమజ్జనం రోజు థియేటర్లో శివతో గొడవపడిన వాళ్ళు శివపై అటాక్ చేయడంతో అందులో శివ ఒకర్ని పొడుస్తాడు. శివ జాబ్ తెచ్చుకుంటే కానీ తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయను అంటాడు చిట్టి తండ్రి. మరి శివ జాబ్ తెచ్చుకుంటాడా? శివ పెళ్లి ఎవరితో జరుగుతుంది? రెండు ఊళ్ళ మధ్య ఎందుకు గొడవ వచ్చింది.. ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే..
Also Read – Chennai Love Story Review : ‘చెన్నై లవ్ స్టోరీ’ మూవీ రివ్యూ.. కిరణ్ అబ్బవరం మళ్ళీ హిట్ కొట్టాడా?
సినిమా విశ్లేషణ..
పవన్ కళ్యాణ్ పాటల్లోని హే చికీతా అనే క్యాచీ వర్డ్ పెట్టి సినిమాపై ఆసక్తి కలిగించారు. కానీ ట్రైలర్, టీజర్స్ చూస్తే ఆ టైటిల్ కి సంబంధం లేకుండా ఇదేదో విలేజ్ బ్యాక్ డ్రాప్ కథ అనిపించింది. ఫస్ట్ హాఫ్ హీరో, అతని ఫ్రెండ్స్, మిగిలిన పాత్రల పరిచయంతోనే సాగుతుంది. ఫ్రెండ్స్ తో అస్సలు పండని కామెడీ ట్రాక్స్ తో బాగా సాగదీశారు. మధ్యమధ్యలో గొడవలు, చిట్టి – శివ లవ్ స్టోరీతో నడిపించారు. ఇంటర్వెల్ కి శివ ఓ వ్యక్తిని పొడవటంతో నెక్స్ట్ ఏం జరుగుతుంది అని సెకండ్ హాఫ్ పై ఆసక్తి కలిగించే ప్రయత్నం చేసారు. ఇక సెకండ్ హాఫ్ లో ఓ ఫ్రెండ్ వాళ్ళ నాన్న చనిపోవడం, వ్యవసాయం గురించి స్పీచ్ లు, చిట్టి – శివ లవ్ స్టోరీతో సాగి చివరకు వ్యవసాయం మీద డైలాగ్స్ చెప్పే రొటీన్ సీన్స్ తో సాగుతుంది.
ఈ కథ అంతా 2000 సంవత్సరంలో సాగుతుంది. హీరో వ్యవసాయం చేస్తారు అన్నారు కానీ ఓపెనింగ్ సీన్ లో పొలంలో కనపడటం తప్ప హీరో ఎప్పుడూ వ్యవసాయం చేసినట్టు ఉండదు. హీరో, ఫ్రెండ్స్ తో అక్కర్లేని కామెడీ ట్రాక్ లు చాలా రాసుకున్నారు కానీ ఒక్కటి కూడా సరిగ్గా వర్కౌట్ అవ్వలేదు. లవ్ సీన్స్ కూడా సరిగ్గా పండలేదు. పవనిజం అని మొదలైంది 2009లో కానీ ఈ సినిమా కథ 2000 సంవత్సరంలో జరిగింది. అప్పుడు పవనిజం, రెడ్ టవల్స్ చూపించడం విడ్డూరం. ఇక రామ్ చరణ్ ఎంట్రీ ఇచ్చిందే 2007 లో. కానీ 2000 లోనే అచ్చం రామ్ చరణ్ లా ఉన్నావు అనే డైలాగ్ వాడారు అంటే రైటింగ్ ఎలా రాసారో అర్ధం చేసుకోవచ్చు.
ఎమోషనల్ సీన్స్ కూడా వర్కౌట్ అవ్వలేదు. హీరో ఓ వ్యక్తిని పొడిచేసి తర్వాత ఏం జరిగింది అనే క్లారిటీ లేకుండా కొత్తగా సీన్స్ ఓపెన్ చేయడం గమనార్హం. సినిమా అంతా అల్లరి చిల్లరిగా హీరో, ఫ్రెండ్స్ వేసే వేషాలు, లవ్ స్టోరీతో నడిపించి చివర్లో రైతులకు పిల్లను ఇవ్వరా? రైతే రాజు, వ్యవసాయం.. అంటూ ఓ నాలుగు స్పీచ్ లతో లాగించారు. అవి కూడా అంతగా కనెక్ట్ అవ్వవు. ఇక ఈ సినిమాకు హే చికీతా అనే టైటిల్ ఎందుకు పెట్టారో దర్శకుడికే తెలియాలి. హీరో ఫ్రెండ్ రాజు అనే పాత్రతో వ్యవసాయం అంటే ఇష్టం లేనట్టు చూపించడం, వాళ్ళ నాన్న వ్యవసాయంలో నష్టాలు వచ్చి సూసైడ్ చేసుకుపోవడం లాంటివి చూపించి రాజు పాత్రకు ఎలాంటి ముగింపు ఇవ్వలేదు.
నటీనటుల పర్ఫార్మెన్స్..
అభినవ్ మణికంఠ పర్వాలేదు అనిపించాడు. దివిజ ప్రభాకర్ రాని ఇంగ్లీష్ మాట్లాడే పాత్రలో చిరాకు తెప్పిస్తుంది. తన్మయ్ ఖుషి అక్కడక్కడా కనిపించి ఓకే అనిపిస్తుంది. దేవి ప్రసాద్ కాస్త ఎమోషన్ పండించారు. జబర్దస్త్ అజయ్ అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేసాడు. ఈటీవీ ప్రభాకర్.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో పర్వాలేదు అనిపించారు.
Also Read : Jana nayagan : జననాయగన్ పై నటి ఆవేదన.. విజయ్ ఆఖరి సినిమా అని ఏడాది పాటు.. ఇలా చేస్తారనుకోలేదు..
సాంకేతిక అంశాలు..
సినిమాటోగ్రఫీ విజువల్స్ పర్వాలేదు అనిపిస్తాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అసలు బాగోలేదు. తలనొప్పి రావడం ఖాయం. పాటలు యావరేజ్. ఎడిటింగ్ లో అయితే చాలా అక్కర్లేని సీన్స్ కట్ చేయాలి. వ్యవసాయం గురించి చెపుదాం అనుకోని విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఓ నాలుగు లవ్ సీన్స్, ఓ నాలుగు హీరో – ఫ్రెండ్స్ సీన్స్ తో కథ, కథనం రాసుకున్నాడు దర్శకుడు. నిర్మాణ పరంగా మాత్రం బాగానే ఖర్చుపెట్టినట్టు కనిపిస్తుంది.
మొత్తంగా ‘హే చికీతా’ ఓ గ్రామంలో నలుగురు కుర్రాళ్ళు చేసే అల్లరి, ఓ ప్రేమకథ, వ్యవసాయం గురించి చెప్పే రొటీన్ కథ. ఈ సినిమాకు 2 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.
