Kenatha Kanom Review : ‘కెనాథ కానోమ్’ మూవీ రివ్యూ.. బావి కోసం తవ్వుతుంటే డైనోసార్ బయటపడితే ఏం జరిగింది..?
బావి కోసం తవ్వుతుంటే డైనోసార్ శిలాజాలు దొరికాయి అనే పాయింట్ తో ఈ సినిమాని ఓటీటీలోకి వచ్చాక ప్రమోట్ చేయడంతో సినిమాపై ఆసక్తి నెలకొంది. (Kenatha Kanom Review)
- Saketh U
- Published on- June 17, 2026 / 03:13 PM IST
Kenatha Kanom Review
Kenatha Kanom Review : యోగి బాబు, లవ్లీ చంద్రశేఖర్, రైచల్ రెబెకా.. పలువురు నటీనటులు ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన తమిళ సినిమా కెనాథ కానోమ్. RB టాకీస్, బాక్సాఫీస్ స్టూడియోస్ బ్యానర్స్ పై రమేష్ బాబు, జెగన్ భాస్కరన్ నిర్మాణంలో సురేష్ సంగయ్య దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. కెనాథ కానోమ్ తమిళ్ లో థియేటర్స్ లో మార్చ్ 13న రిలీజ్ అవ్వగా తాజాగా ఈ సినిమా జియో హాట్ స్టార్ ఓటీటీలోకి వచ్చింది. తెలుగులో కూడా అందుబాటులో ఉంది.
కథ విషయానికొస్తే..
తమిళనాడులోని ఓ పల్లెటూరు. అక్కడ చాలా కాలంగా వర్షాలు రాకపోవడంతో నీళ్లు దొరకవు. ఆ ఊరివాళ్లంతా చాలా దూరం వెళ్లి బిందెలతో నీళ్లు తెచ్చుకుంటారు. తమ ఊరి నీటి సమస్య తీరాలని ఊరంతా కలెక్టర్, మంత్రుల చుట్టూ తిరుగుతారు. పూజలు చేస్తారు. అయినా ఉపయోగం ఉండదు. ఆ ఊళ్ళో ఉన్న పూజారి మణివాసగం(యోగిబాబు) వేరే ఊరికి చెందిన యాజిని(లవ్లీ చంద్రశేఖర్)ని ప్రేమిస్తాడు. కానీ మణివాసగం ఊళ్ళో నీళ్లు లేవని యాజిని తండ్రి వీరి పెళ్ళికి ఒప్పుకోడు. ఓ రోజు బయట నుంచి ఓ ముసలి వ్యక్తి వచ్చి మణివాసగం స్థలంలో నీళ్లు ఉన్నాయి తవ్వండి అని చెప్తాడు.
ఊరి మంచి కోసం మణివాసగం తన స్థలం ఇస్తాడు. ఆ స్థలంలో తవ్వుతుంటే డైనోసార్ శిలాజాలు బయటపడతాయి. దీంతో ఈ విషయం వైరల్ అయి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వస్తుంది. ఆ స్థలాన్ని, ఊరిని తమ కంట్రోల్ లోకి తీసుకుంటుంది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్. ఆ డైనోసార్ శిలాజాలు మెల్లిగా బయటకు తీద్దామని ఇంకాస్త తవ్వితే పగుళ్లు వచ్చే పక్కనే ఉన్న గుడి, మణివాసగం ఇల్లు కూలిపోయి అతని తాతయ్య చనిపోతాడు. మరో పక్క ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఊరంతా తవ్వడానికి, ఊరిని ఖాళీ చేయడానికి ప్లాన్ చేస్తుంది. మరి మణివాసగం ఊళ్ళో వర్షం పడుతుందా? ఆ ఊరి నీటి సమస్య తీరుతుందా? ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? మణివాసగం ప్రేమ సక్సెస్ అవుతుందా? ఆ డైనోసారి శిలాజాల సంగతేంటి.. ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
Also See : Pawan Kalyan-Niranjan: అభిమాని కోరిక తీర్చిన పవన్ కళ్యాణ్.. స్వయంగా వెళ్లి.. ఫొటోలు వైరల్..
సినిమా విశ్లేషణ..
బావి కోసం తవ్వుతుంటే డైనోసార్ శిలాజాలు దొరికాయి అనే పాయింట్ తో ఈ సినిమాని ఓటీటీలోకి వచ్చాక ప్రమోట్ చేయడంతో సినిమాపై ఆసక్తి నెలకొంది. ఫస్ట్ అరగంట సేపు ఈ సినిమాని బాగా సాగదీశారు. ఆ ఊరి గురించి, ఊరిలో పాత్రలు, మణివాసగం ప్రేమ చుట్టూ సాగదీశారు. బావి తవ్వుతుంటే డైనోసార్ శిలాజాలు బయట పడిన తర్వాత సినిమా కాస్త ఆసక్తిగా మారుతుంది. అక్కడ్నుంచి నీళ్లు వస్తాయా? ఆ ఊరు ఏమవుతుంది? డైనోసార్ శిలాజాలు ఏం చేసారు అనే ఆసక్తితో కథ నిదానంగా సాగుతుంది.
తాత మరణం ఎమోషన్ బాగా వర్కౌట్ అయింది. నీళ్లు రావట్లేదు అనే ఎమోషన్ మొదట అంతా కామెడీగా చూపించి తర్వాత ఎమోషన్ కోసం ట్రై చేసారు. ఒక ముసలయ్య పాత్రతో నీళ్లు వాళ్లకు దొరకాలి అనే ఎమోషన్ ని పండించారు. మనుషులు బతకాలా – ఇలా శిలాజాల మీద ప్రయోగాలు చేయాలా అనే చర్చ నడిపించినా దానికి కంక్లూజన్ ఇవ్వలేదు. క్లైమాక్స్ కూడా సింపుల్ గా క్లారిటీ లేకుండా ముగించేశారు. క్లైమాక్స్ ఇంకాస్త బాగా రాసుకోవాల్సింది. అక్కడక్కడా కామెడీ డైలాగ్స్, హావభావాలతో పండించారు. ఫార్వార్డ్ చేసుకుంటూ చూడొచ్చు. పూర్తి తమిళ నేటివిటీ సినిమానే.
నటీనటుల పర్ఫార్మెన్స్..
యోగిబాబు మెయిన్ లీడ్ లో బాగా నటించాడు. అక్కడక్కడా నవ్వించి ఎమోషన్ కూడా పండించాడు. లవ్లీ చంద్రశేఖర్ యోగిబాబు లవర్ పాత్రలో ఒక గ్రామీణ అమ్మాయి పాత్రలో సింపుల్ గా మెప్పించింది. రైచల్ రెబెకా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఆఫీసర్ పాత్రలో బాగానే నటించారు. కలెక్టర్ పాత్రలో జార్జ్ మరియన్ అక్కడక్కడా కనిపించారు. ఊరి పెద్ద పాత్ర చేసిన నటుడు బాగానే నటించారు. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో పర్వాలేదనిపించారు. చాలా వరకు తమిళ్ రూరల్ నటీనటులనే తీసుకున్నారు.
Also Read : Vadde Naveen : చిరంజీవి సినిమా తెగ నచ్చేసింది.. రీ ఎంట్రీలో అలాంటి సినిమాలే కావాలంటున్న వడ్డే నవీన్..
సాంకేతిక అంశాలు..
సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదు. పాటలు బాగున్నాయి. తెలుగు డబ్బింగ్ మాత్రం కొన్నిచోట్ల సరిగ్గా కుదర్లేదు. దర్శకుడు కొత్త పాయింట్ తీసుకున్నా దానికి క్లైమాక్స్ సరిగ్గా రాసుకోకుండా కాస్త సాగదీసి తెరకెక్కించాడు. సినిమా అంతా ఆల్మోస్ట్ ఒకే లొకేషన్ లో ఊరి సెట్ వేసి తెరకెక్కించారు. నిర్మాణ పరంగా కావాల్సినంత ఖర్చుపెట్టారు.
మొత్తంగా ‘కెనాథ కానోమ్’ సినిమా నీటి కోసం ఎదురుచూసే ఓ ఊళ్ళో బావి తవ్వుతుంటే డైనోసార్ శిలాజాలు బయటపడితే ఏం జరిగింది అని ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కించారు.
గమనిక : ఈ సినిమా రివ్యూ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.
