Sahaa Review : ‘సహా’ మూవీ రివ్యూ.. చిన్నప్పట్నుంచి ఒకే అమ్మాయిని ప్రేమించి..
Sahaa Review : సినిమా నచ్చకపోతే హీరోయిన్ గుండు కొట్టించుకుంటా అనడంతో ఒక్కసారిగా ఈ సినిమా వైరల్ అయింది.
- Saketh U
- Updated on- September 4, 2026 / 06:29 AM IST
Sahaa Review
Sahaa Review : శివ కుమార్ కాసారం, శ్వేతా లక్ష్మణ్ జంటగా తెరకెక్కిన సినిమా ‘సహా’. లైఫ్ ఆఫ్ సంజు అనేది ట్యాగ్ లైన్. సుమైరా స్టూడియోస్ బ్యానర్‌పై తేజ వెల్పుచర్ల నిర్మాణంలో నిశాంత్ దోటి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో వ్రజనా పాండ్యా, మహిపాల్, అప్పాజీ, భారతి, మేఘన సునీల్, బాంబే పద్మ, కొండారెడ్డి, హర్షవర్ధన్.. పలువురు కీలక పాత్రల్లో నటించారు. సహా సినిమా నేడు సెప్టెంబర్ 4న థియేటర్స్ లో రిలీజ్ అవుతుండగా ముందు రోజు రాత్రే ప్రీమియర్స్ వేశారు.
కథ విషయానికొస్తే..
సంజు(శివ కుమార్ కాసారం) ఓ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో పని చేస్తూ ఉంటాడు. పొద్దునే లేచిన దగ్గర్నుంచి ఫోన్ లో తన భార్యతో మాట్లాడుతూ ప్రతి పనిలో తన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉంటాడు. స్కూల్ ఏజ్ నుంచి సంజు సహా(శ్వేతా లక్ష్మణ్)ని ప్రేమిస్తాడు. అప్పట్నుంచే ఆ అమ్మాయి కోసం వేరే వాళ్ళతో గొడవలు పడతాడు. ఎన్నో ఏళ్లుగా సహాని ప్రేమించడంతో, ఓ సంఘటనతో సహా కూడా సంజుని ప్రేమిస్తుంది. కాలేజీ చదువు అయ్యాక ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడంతో లేచిపోయి పెళ్లి చేసుకొని హ్యాపీగా జీవిస్తూ ఉంటారు.
సహా ప్రగ్నెంట్ అయ్యాక సహా పేరెంట్స్ వీళ్ళని మళ్ళీ దగ్గరకు తీసుకుంటారు. అదే సమయంలో సంజు జాబ్ పోతుంది. సహా ఇంట్లో, ఇంటికి వచ్చేవాళ్ళు అంతా సంజు ఏం చేస్తున్నాడు, ఎంత సంపాదిస్తున్నాడు అని ప్రశ్నించడం మొదలుపెడతారు. దాంతో సంజు – సహా మధ్య గొడవలు మొదలవుతాయి. మరి సంజుకి జాబ్ వచ్చిందా? సంజు – సహా మధ్య గొడవలు ముగిసాయా? సహా ప్రగ్నెన్సీ సమయం ఎలా గడుస్తుంది? సంజు – సహాల మధ్య వచ్చిన మనస్పర్థలతో వీరి జీవితం ఎలాంటి మలుపులు తిరుగుతుంది తెలియాలంటే తెరపై చూడాల్సిందే..
Also Read : Romanchakam Review : ‘రోమాంచకం’ మూవీ రివ్యూ.. సందీప్ రెడ్డి వంగ నిర్మించిన సినిమా ఎలా ఉందంటే..?
సినిమా విశ్లేషణ..
సహా అనే చిన్న సినిమాకు మొదట్లో పెద్ద బజ్ లేకపోయినా ప్రమోషన్స్ కి కిరణ్ అబ్బవరం, బన్నీ వాసు, వంశీ నందిపాటి రావడం, సినిమా నచ్చకపోతే హీరోయిన్ గుండు కొట్టించుకుంటా అనడంతో ఒక్కసారిగా ఈ సినిమా వైరల్ అయింది. రిలీజ్ కి ముందు టీజర్, ట్రైలర్, సాంగ్స్ అయితే బాగున్నాయి. అయితే ఇది మాములు లవ్ స్టోరీనే అని ముందునుంచే అనిపించింది.
ఈ కథ అంతా నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే లో నడుస్తుంది. ముందుకు, వెనక్కి కథ వెళ్తూ ఉంటుంది. ఓ 40 ఏళ్ళ వయసు ఉన్న సంజు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో పని చేస్తూ తన భార్యతో ఫోన్ లో మాట్లాడుతూ జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకుంటాడు. స్కూల్ ఏజ్ లో సంజు సహా వెనక పడటం, వాళ్ళ మధ్య జరిగే క్యూట్ సన్నివేశాలు, ఎంసెట్ ఎగ్జామ్ అప్పుడు జరిగే సంఘటన, సహా కోసం సంజు ఫేక్ ఐడితో తన కాలేజీలోకి వెళ్లే సన్నివేశాలతో ఫస్ట్ హాఫ్ క్యూట్ గా సింపుల్ గా సాగిపోతుంది. అక్కడక్కడా నవ్వుకుంటాము. అదే సమయంలో ఇక్కడ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో జరిగే కొన్ని సంఘటనలు, అక్కడ మనుషులు, అక్కడ లేచిపోయి వచ్చి పెళ్లిళ్లు చేసుకునే మనుషులను చూపిస్తారు. ఇంటర్వెల్ సింపుల్ గానే ఉంటుంది.
ఇక సెకండ్ హాఫ్ లో వీళ్ళిద్దరూ లేచిపోయి పెళ్లి చేసుకొని హ్యాపీగా జీవించడంతో కొన్ని క్యూట్ సీన్స్ తో బాగానే సాగుతుంది. సహా ప్రగ్నెంట్ అవ్వడం, సహా పేరెంట్స్ ఇంటికి వెళ్లడం, సంజు జాబ్ పోయిన దగ్గర్నుంచి కథ ఆసక్తిగా మారుతుంది. అక్కడ్నుంచి వీళ్ళ ఇద్దరి మధ్య జరిగే సంఘటనలు, కొన్ని ఎమోషనల్ సీన్స్ తో సాగుతుంది. చివర్లో ఓ ట్విస్ట్ ఇచ్చారు కానీ అది సినిమా ఓపెనింగ్ సీన్ లోనే ఊహించేయొచ్చు. అలాగే క్లైమాక్స్ కూడా ముందే ఊహించేయొచ్చు.
ప్రేమ సన్నివేశాలతో క్యూట్ గా మెప్పించారు. అక్కడక్కడా కామెడితో నవ్వించారు. క్లైమాక్స్ లో మాత్రం ఏడిపించారు. ఇదేమి కొత్త కథ, కథనం అయితే కాదు. చాలా చోట్ల సన్నివేశాలను బాగా సాగదీశారు. ఒక అబ్బాయి అమ్మాయి వెనక పడటం, ఆ అమ్మాయి కోసమే బతకడం గతంలో కొన్ని వందల సినిమాలు వచ్చాయి. అలాంటి వందల సినిమాల్లో ఇది కూడా ఒకటి. కాకపోతే మరీ బోరింగ్ ఫీల్ రాకుండా కథనంతో మెప్పించారు. ఈ సినిమా చాలా చోట్ల ఒక మంచి షార్ట్ ఫిలిం, నిడివి ఎక్కువ ఉన్న షార్ట్ ఫిలిం చూసినట్టు అనిపిస్తుంది. కొన్ని చోట్ల 7/G బృందావన కాలనీ, సినిమా చూపిస్తా మామ.. లాంటి పలు సినిమా ఛాయలు కనిపిస్తాయి. ఇక ఇలాంటి లవ్ సీన్స్ బోలెడన్ని సినిమాల్లో ఉన్నవే. ఒకసారి చూడొచ్చు. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు.
నటీనటుల పర్ఫార్మెన్స్..
శివ కుమార్ కాసారం స్కూల్ ఏజ్, కాలేజీ ఏజ్, పెళ్లి ఏజ్, 40 ఏళ్ళ వ్యక్తిగా నాలుగు వేరియేషన్స్ పర్ఫెక్ట్ గా చూపిస్తూ ఆ ఏజ్ లో ఉన్నట్టు పర్ఫెక్ట్ గా నటించాడు. ఆ పాత్రలో ప్రాణం పెట్టి నటించాడు అని చెప్పొచ్చు. శ్వేతా లక్ష్మణ్ కూడా అదే వేరియేషన్స్ చూపిస్తూ చాలా బాగా నటించింది. ఈ సినిమా చూసి అబ్బాయిలు అయితే ఇలాంటి అమ్మాయి దొరకాలి అనుకోవడం ఖాయం. చాలా సీన్స్ లో క్యూట్ గా కనిపించి, ఎమోషనల్ సీన్స్ లో ఏడిపించి ప్రేక్షకులను మెప్పిస్తుంది శ్వేతా లక్ష్మణ్. వ్రజనా పాండ్యా ఓ కీలక పాత్రలో బాగానే నటించింది. హీరో ఫ్రెండ్ పాత్రలో నటుడు హర్షవర్ధన్ కూడా వేరియేషన్స్ చూపిస్తూ మెప్పించాడు. మహిపాల్, అప్పాజీ, భారతి, మేఘన సునీల్, బాంబే పద్మ, కొండారెడ్డి.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో బాగానే నటించారు.
సాంకేతిక అంశాలు..
సినిమాటోగ్రఫీ విజువల్స్ చాలా బాగున్నాయి. కలర్ ఫుల్, రిచ్ విజువల్స్ ఆకట్టుకుంటాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. పాటలు కూడా చాలా బాగున్నాయి. ఎడిటింగ్ విషయంలో మాత్రం కొన్ని ల్యాగ్ సీన్స్ కొంతమేరకు కట్ చేయాల్సింది. పాత కథ, కథనం తీసుకున్నా సన్నివేశాలతో మ్యాజిక్ చేసి సాంకేతికంగా బాగానే తెరకెక్కించాడు దర్శకుడు. చాలా వరకు రియల్ లొకేషన్స్ లో షూటింగ్ చేయడం ఈ సినిమాకు ప్లస్ అయింది. నిర్మాణ పరంగా కూడా సినిమాకు కావాల్సినంతగా ఖర్చుపెట్టారు.
మొత్తంగా ‘సహా’ ఒక అబ్బాయి జీవితాంతం ఒకే అమ్మాయిని ప్రేమించడం, వాళ్ళ మధ్య జరిగే సంఘటనలతో ఏం జరిగింది అనే సినిమా. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.
