ఇస్మార్ట్ ఇరగదీస్తుండుగా!..

  • Publish Date - April 29, 2020 / 01:35 PM IST

ఎనర్జిటిక్‌ స్టార్ రామ్‌ పోతినేని, డాషింగ్ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ కలయికలో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్‌’ హవా ఇంకా తగ్గలేదు. గతేడాది విడుదలైన ఈ సినిమా యూట్యూబ్‌లో దూసుకుపోతోంది. తాజాగా 100 మిలియన్ల(10 కోట్లు) మార్క్‌ను దాటేసి సత్తా చాటింది. ఫిబ్రవరి 16న ఇస్మార్ట్ హిందీ వెర్షన్ యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయగా ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. ఇప్పటివరకు 10 లక్షలకు పైగా లైకులు కూడా రావడం విశేషం.

ఆన్‌లైన్‌లో డబ్బింగ్‌ సినిమాల ద్వారా 10 కోట్ల వ్యూస్‌, 10 లక్షలకు పైగా లైకులు తెచ్చుకోవడం హీరో రామ్‌కు ఇది నాలుగోసారి. ఈ ఘనత సాధించిన మొదటి హీరో రామ్‌ అని చిత్రయూనిట్‌ తెలిపింది. కాగా, ఈ సినిమాలోని ‘దిమాక్ ఖరాబ్’ వీడియో సాంగ్ కూడా ఇటీవలే 100 మిలియన్ వ్యూస్ మార్క్‌ని దాటింది. రామ్ హోమ్ బ్యానర్ స్రవంతి మూవీస్ కూడా ట్విట్టర్ ద్వారా ఫొటోలను షేర్ చేశారు.

ఈ సందర్భంగా అభిమానులకు రామ్‌ ధన్యవాదాలు తెలిపాడు. కాగా, కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో ఆయన నటించిన ‘రెడ్‌’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాను ఏప్రిల్‌ 9 విడుదల చేయాలనుకున్నారు. కరోనా సంక్షోభం కారణంగా లాక్‌డౌన్‌ ప్రకటించడంతో విడుదల వాయిదా పడిన సంగతి తెలిసిందే.