మొత్తానికి ఓ ఇంటివాడినయ్యాను.. పెళ్లి ఫొటోలు షేర్ చేసిన నితిన్..

  • Publish Date - July 27, 2020 / 01:21 PM IST

వేదమంత్రాలు, అగ్ని సాక్షిగా జరిపించిన ఉత్సవాన… పసుపు-కుంకాలు, పంచభూతాలు కొలువైన మండపాన… నితిన్‌ కల్యాణ శుభవీణ మోగింది. చిరకాల ప్రేయసి షాలినీ కందుకూరి మెడలో ఆదివారం రాత్రి ఆయన మూడు ముళ్లు వేశారు. అనంతరం షాలినీ సమేత నితిన్‌ ఏడడుగులు నడిచారు.

వధూవరుల కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది అతిథుల సమక్షంలో ఈ వివాహం జరిగింది. హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్యాలెస్‌ ఈ పెళ్లికి వేదిక అయింది. కరోనా నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలను పాటిస్తూ వివాహాది శుభకార్యాన్ని జరిపించారు.

తెలంగాణ మంత్రులు తలసాని శ్రీనివాసయాదవ్‌, శ్రీనివాస్‌ గౌడ్‌ తదితర ప్రముఖులు పెళ్లికి హాజరై నూతన జంటను ఆశీర్వదించారు. హీరోలు వరుణ్‌ తేజ్‌, సాయి తేజ్‌ తదితరులు పెళ్లి సందడిలో పాల్గొని వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. మొత్తానికి ఓ ఇంటివాడినయ్యాను అంటూ నితిన్ తన పెళ్లి ఫొటోలు షేర్ చేశారు.