Janhvi Kapoor : ‘నేను మరింత గట్టిగా మాట్లాడాల్సింది’.. పెద్ది సినిమా వివాదంపై జాన్వీ కపూర్ కీలక వ్యాఖ్యలు!
Janhvi Kapoor : రామ్చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించిన ‘పెద్ది’ సినిమాలో మహిళా పాత్రను చూపించిన విధానంపై అప్పట్లో వివాదం చెలరేగింది. అయితే, ఈ విషయంపై తాజాగా.. జాన్వీకపూర్ స్పందించారు.
- Harish Thanniru
- Updated on- October 28, 2026 / 10:06 PM IST
Janhvi Kapoor
Janhvi Kapoor : మెగాపవర్ స్టార్ రామ్చరణ్ హీరోగా నటించిన ‘పెద్ది’ సినిమా చుట్టూ నెలకొన్న వివాదంపై ఆ సినిమా హీరోయిన్, బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ తాజాగా స్పందించారు. సినిమాలో తన పాత్రను చూపించిన తీరుపై వచ్చిన విమర్శలు తనను తీవ్రంగా ప్రభావితం చేశాయని, ఆ సమయంలో తాను మరింత గట్టిగా మాట్లాడి ఉండాల్సిందని, తనకున్న ప్రత్యేక అవకాశాలను ఉపయోగించుకుని అభ్యంతరాలను వ్యక్తం చేయాల్సిందని అభిప్రాయపడ్డారు. ఈ వివాదం తన మనసులో ఇప్పటికీ బాధను, పశ్చాత్తాపాన్ని మిగిల్చిందని తెలిపారు.
Also Read : Rahul Ramakrishna : దర్శకుడిగా మారిన కమెడియన్.. సినిమా ఎప్పుడంటే.. హీరోగా మాత్రం చేయను అంటూ..
రామ్చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించిన ‘పెద్ది’ సినిమాలో హీరోయిన్ పాత్రను చూపించిన విధానంపై విమర్శలు వచ్చాయి. జాన్వీ పోషించిన అచ్చియమ్మ పాత్రకు సంబంధించిన కొన్ని సన్నివేశాలు, కెమెరా కోణాలు మహిళలను కించపర్చేలా, అసభ్యకరంగా చూపించారంటూ సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అప్పట్లో ఈ అంశం సినిమా చుట్టూ పెద్ద చర్చకు దారితీసింది.
తాజాగా ‘కాఫీ విత్ కరణ్’ సీజన్ 9లో పాల్గొన్న జాన్వీ కపూర్ ఈ వివాదంపై తన మనసులోని మాటలను పంచుకున్నారు. సినిమా కోసం ఎంతోమంది కష్టపడ్డారని, అందుకే ఈ అంశంపై ఎలా మాట్లాడాలో తెలియక తొలుత వెనుకాడినట్లు ఆమె చెప్పారు. అయితే, ఆ అంశం సమాజంపై, ముఖ్యంగా మహిళలపై ఎలాంటి ప్రభావం చూపించవచ్చనే విషయాన్ని తాను ఆలోచించానని, ఆ సమయంలో తాను మరింత అప్రమత్తంగా ఉండాల్సిందని, అభ్యంతరాలను బలంగా వ్యక్తం చేసి ఉండాల్సిందని జాన్వీ చెప్పుకొచ్చారు.
సినిమా నిర్మాణ సమయంలో దర్శకుడు చెప్పిన విధంగా నటించాల్సి ఉంటుందని జాన్వీ వివరించారు. అయితే, ఒక నటిగా నేను మరింత అప్రమత్తంగా ఉండాల్సింది. తప్పును వేరొకరిపైకి నెట్టడం నాకు ఇష్టం లేదు. కపూర్ కుటుంబానికి చెందిన వ్యక్తిగా తనకు కొన్ని ప్రత్యేక అవకాశాలు, వెసులుబాట్లు ఉన్నాయని పేర్కొన్న జాన్వీ.. అలాంటి పరిస్థితుల్లో తన అభ్యంతరాలను మరింత బలంగా వినిపించి ఉండాల్సిందని అన్నారు. దక్షిణాది చిత్ర పరిశ్రమలో షూటింగ్కు ముందే పూర్తి స్క్రిప్ట్, కెమెరా కోణాల వివరాలు ప్రతిసారీ అందుబాటులో ఉండకపోవచ్చు, అయినప్పటికీ, తనకున్న ప్రత్యేక అవకాశాలను ఉపయోగించుకుని అప్పుడే తన అభ్యంతరాలను మరింత బలంగా చెప్పి ఉండాల్సిందని జాన్వీ చెప్పుకొచ్చారు.
ఈ వివాదం తనకు బాధాకరమైన అనుభవంగా మిగిలిపోయిందని జాన్వీ తెలిపారు. తాను బాధితురాలిగా కనిపించాలనుకోవడం లేదని చెబుతూనే, ఆ పరిస్థితి తనను తీవ్రంగా కలచివేసిందని వెల్లడించారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి ఎదురైతే తన అసౌకర్యాన్ని స్పష్టంగా వ్యక్తం చేస్తానని చెప్పుకొచ్చారు.
పెద్ది సినిమా జూన్ 4న థియేటర్లలోకి వచ్చింది. ఈ మువీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. అయితే, ‘పెద్ది’ విడుదలైన సమయంలో విమర్శలు వెల్లువెత్తడంతో దర్శకుడు బుచ్చి బాబు సానా సోషల్ మీడియా వేదికగా బహిరంగ క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే. “నాకు తెరపైనా, బయటా మహిళల పట్ల అపారమైన గౌరవం ఉంది. ఏ మహిళా పాత్రనూ కించపరచడం మా ఉద్దేశం కాదు. ప్రేక్షకులు, విమర్శకుల భావోద్వేగాలను మేము గౌరవిస్తున్నాం. వారి ఫీడ్బ్యాక్ ఆధారంగా సినిమాలో వివాదాస్పదంగా అనిపించిన ఆ సీన్లను తొలగించి, మార్పులు చేస్తున్నాం” అని ఆయన ప్రకటన విడుదల చేసి ఆ సీన్లను సినిమా నుంచి కట్ చేశారు.
