Aditya Devulapally : డైరెక్టర్లలో 80% మంది మైక్రో డ్రామా తీస్తే ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.. దందా దర్శకుడు కామెంట్స్..
తాజాగా ఈ సిరీస్ దర్శకుడు ఆదిత్య నేడు మీడియాతో మాట్లాడుతూ సిరీస్ గురించి, తన గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిపాడు. (Aditya Devulapally)
- Saketh U
- Published on- August 4, 2026 / 02:00 PM IST
Aditya Devulapally
Aditya Devulapally : దొర సాయి తేజ, అక్షర నల్ల, నితిన్ ప్రసన్న, కిరణ్ కుమార్, సాయి మాధవ్.. పలువురు కీలక పాత్రల్లో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘దందా’. ఛాయ్ షాట్స్ నిర్మాణంలో ఆదిత్య దేవులపల్లి దర్శకత్వంలో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది. ఇటీవల ఈ వర్టికల్ సిరీస్ ఛాయ్ షాట్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చి మంచి సక్సెస్ అందుకుంది. 29 చిన్న ఎపిసోడ్స్ గా ఒక గంట నిడివితో వచ్చిన ఈ సిరీస్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. తాజాగా ఈ సిరీస్ దర్శకుడు ఆదిత్య నేడు మీడియాతో మాట్లాడుతూ సిరీస్ గురించి, తన గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిపాడు.
ఆదిత్య తన గురించి చెప్తూ.. చిన్నప్పటి నుంచీ సినిమాలంటే పిచ్చి ఇష్టం. ఆ ప్యాషన్‌తోనే ఇంజనీరింగ్ మధ్యలోనే వదిలేసా. ఇండస్ట్రీలో ఎవరూ లేరు నాకు. ఫోటోగ్రఫీ నేర్చుకుని ఇక్కడికి వచ్చా. మాస్ కమ్యూనికేషన్ చదివి జర్నలిజంలోకి వచ్చి అనంతరం సినిమాల్లోకి వచ్చా. నేను 28 ఏళ్ళ కల్లా డైరెక్టర్ అవ్వాలి అనుకున్నాను అయ్యాను. జర్నలిజంలో ఉన్నప్పుడే చాయ్ షాట్స్ కి క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా పిలిచారు. కానీ నాకు సంతృప్తి లేకపోవడంతో ‘దందా’ ప్రయాణం మొదలైంది అని తెలిపారు.
Also Read : Dhandha Web Series Review : ‘దందా’ వెబ్ సిరీస్ రివ్యూ.. సైబర్ మోసాలపై మరో కొత్త సిరీస్.. ఎలా ఉందంటే..?
దందా సిరీస్ గురించి మాట్లాడుతూ.. ఒరిజినల్ కథను విజయ్ కుమార్ రాశాడు. అందులో మార్పులు చేసి ఫైనల్ నేను రాసాను. నాకు పూరీ జగన్నాథ్, రామ్ గోపాల్ వర్మ, ఉపేంద్ర లాంటి డైరెక్టర్ల మేకింగ్ ఇష్టం. చాయ్ షాట్స్‌లో ఉన్నప్పుడు వందల స్క్రిప్ట్‌లు విన్నాను. దందా చదువుతుంటే నన్ను నేనే చూసుకున్నట్టు అనిపించింది. అందుకే ఈ కథను నేనే డైరెక్ట్ చేశాను. వర్టికల్ కంటెంట్ లో సరైన స్ట్రాంగ్ కంటెంట్ లేకపోవడంతో ‘దందా’తో ఒక ప్రాపర్ సినిమాటిక్ ట్రెండ్ తీసుకురావాలని ఫిక్స్ అయ్యాను. అరవింద్ పాత్ర కోసం చాలామందిని అనుకున్నాం ఫైనల్‌గా దొరసాయి తేజను తీసుకున్నాం. చాలామంది లీడ్ యాక్టర్లు ఇవ్వని బ్లైండ్ ట్రస్ట్ నా మీద, దందా మీద ఉంచాడు తేజ. అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. మోనోలాగ్ డైలాగ్స్ సింగిల్ టెక్ లో చెప్పాడు. కెమెరామెన్ అశ్విన్ లెనిన్ కి దందా విజన్ చెప్పగానే, కరెన్సీ నోట్ల ఆధారంగా డిజైన్ చేసిన ప్రత్యేకమైన కలర్ ప్యాలెట్‌ను క్రియేట్ చేసి, బెస్ట్ లెన్సెస్‌తో క్రేజీ విజువల్స్ ఇచ్చాడు. మన సినిమాల్లో ఒక అమ్మాయి పాదాలను అంతగా ఫోకస్ చేసి చూపించలేదు. అందుకే ఈ సిరీస్ లో హీరోయిన్ ని అలా చుపించాము. నీరుగా అక్షర పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యారు. దందా సిరీస్ ని అంతా పొగుడుతున్నారు. సెలెబ్రిటీలు సైతం అనురాగ్ అన్నకి ఫోన్ చేసి అభినందిస్తున్నారు. ఇది అసలైన జేన్ జీ మాస్ సిరీస్. మైక్రో డ్రామానే కదా అని తక్కువ అంచనాతో చూడటం స్టార్ట్ చేయండి మా సిరీస్ మీ అభిప్రాయాన్ని పూర్తిగా మార్చేస్తుంది అని తెలిపాడు.
వర్టికల్ కంటెంట్, మైక్రో డ్రామాల గురించి మాట్లాడుతూ.. ప్రస్తుతం మైక్రో డ్రామాలను జనాలు విపరీతంగా చూస్తున్నారు కానీ వర్టికల్ ఫార్మాట్‌లో ప్రతీ సీన్ గ్రిప్పింగ్‌గా ఉండాలి. మెయిన్ స్ట్రీమ్ సినిమాలు తీయడం కంటే మైక్రో డ్రామాలు తీయడం చాలా కష్టం. బయట ఉన్న బిగ్ మూవీ డైరెక్టర్లలో 80% మంది మైక్రో డ్రామా తీస్తే ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే సెటప్ చేయడానికి ఇక్కడ టైమ్ ఉండదు. మొదటి సెకండ్ నుంచే ఆడియెన్స్‌ను హుక్ చేయాలి అని తెలిపాడు.
దందాలో మెసేజ్ గురించి మాట్లాడుతూ.. ఎంటర్టైన్మెంట్స్ తో పాటు సమాజానికి ఉపయోగపడే విషయాలు చెబితే ‘విన్-విన్’ అవుతుంది. అందుకే సైబర్ క్రైమ్స్ వెనుక ఉన్న దారుణాలను వారి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచే చూపించాం. సైబర్ నేరగాళ్లు వేల కోట్లు కొల్లగొడుతున్నారు కానీ మనం వాళ్లను పట్టుకోలేకపోతున్నాం. ఒక చిన్న OTPతో లక్షలు మాయమైపోతున్నాయి. హీరో ద్వారా ఆడియెన్స్‌ను ఎంటర్‌టైన్ చేస్తూనే ఈ సైబర్ నేరగాళ్ల అసలు రూపాన్ని బయటపెట్టి జనాల్లో అవేర్‌నెస్ తేవాలని ఈ కథను డిజైన్ చేశాను అని తెలిపాడు.
Also Read : Tejaswi : బాబోయ్.. వెకేషన్ లో రాజు వెడ్స్ రాంబాయి హీరోయిన్.. షార్ట్ డ్రెస్సుల్లో ఫొటోలు చూశారా..?
తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుతూ.. నా నెక్స్ట్ ఫుల్ లెంగ్త్ ఫీచర్ ఫిలిం పక్కా తేజతోనే ఉంటుంది. అది దందా కంటే ఐదు రెట్లు వైల్డ్‌గా ఉంటుంది. దందా సీజన్ 2 ఉంది. ప్రస్తుతం ఒక 50 ఏళ్ల నేరస్థుడి చుట్టూ తిరిగే పవర్‌ఫుల్ స్టోరీ రాస్తున్నా. త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుంది అని తెలిపారు.
