Anushka and Shriya plays same Character: అప్పట్లో కళాతపస్వి కె.విశ్వనాధ్ ‘సిరి సిరి మువ్వ’ సినిమాలో కథానాయిక జయప్రద మూగ పాత్రలో నటించడం ఎంతటి సెన్సేషన్ అయిందో తెలిసిందే.
తర్వాత హీరోయిన్స్ అటువంటి అరుదైన, విభిన్నమైన పాత్రల్లో నటించి మెప్పించిన సందర్భాలు చాలా తక్కువనే చెప్పాలి. కట్ చేస్తే ఇప్పుడు ఏకంగా ఇద్దరు కథానాయికలు అటువంటి పాత్రల్లో కనిపించే సాహసం చేస్తున్నారు.
వారిద్దరూ కూడా తెలుగులో ఒకప్పుడు స్టార్ హీరోలతో నటించి టాప్ హీరోయిన్స్‌గా కొనసాగినవారే కావడం విశేషం. ఇంతకీ వాళ్లెవరంటే.. అందాల తార అనుష్క, హాట్ బ్యూటీ శ్రియ శరణ్.. అనుష్క, మాధవన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘నిశ్శబ్దం’.. కోన వెంకట్ నిర్మాతగా హేమంత్ మధుకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా రూపొందిన ఈ చిత్రం విడుదల కరోనా కారణంగా వాయిదా పడింది.
‘నిశ్శబ్దం’ సినిమాలో అనుష్క సాక్షి అనే మ్యూట్ ఆర్టిస్టుగా నటించారు. మూగ పాత్ర కోసం అనుష్క ప్రత్యేకంగా అమెరికన్ సైన్ లాంగ్వేజ్ కూడా నేర్చుకున్నారు. ఇండియన్ సైన్ లాంగ్వేజ్‌కు అమెరికన్ సైన్ లాంగ్వేజ్‌కు తేడా వుంటుంది. ‘నిశ్శబ్దం’ సినిమా అమెరికా నేపథ్యంలో వుండడంతో, ఆ సైన్ లాంగ్వేజ్ ప్రాక్టీస్ చేసి మరీ నటించారు అనుష్క. అలాగే ఆమె ఈ చిత్రం కోసం పెయింటింగ్ కూడా నేర్చుకున్నారు. ‘నిశ్శబ్దం’ చిత్రాన్ని అమెరికాలో ఇంగ్లీషులో కూడా విడుదల చేయనున్నారు.
స్వీటీ తర్వాత ఇప్పుడు శ్రియ కూడా మూగ పాత్రలో కనిపించనున్నారు.
పెళ్లి తర్వాత శ్రియా శరణ్ సెకెండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఆమె కథానాయికగా రూపొందుతున్న సినిమా ‘గమనం’.. ఈ మూవీ ఫస్ట్‌లుక్‌ను శ్రియ పుట్టినరోజు(సెప్టెంబర్ 11) సందర్భంగా విడుదల చేశారు.
రియల్ లైఫ్ డ్రామాతో దర్శకుడు సుజనారావు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిస్తున్నారు. పాపులర్ సినిమాటోగ్రాఫర్ జ్ఞ్ఞానశేఖర్ వి.ఎస్. నిర్మాతగా మారి రమేశ్ కరుటూరి, వెంకీ పుషడపుతో కలిసి ఈ సినిమా నిర్మిస్తున్నారు. పోస్టర్‌లో చీర కట్టుకొని, మెడలో మంగళసూత్రం మాత్రమే ఉన్న అతి సాధారణ గృహిణిలా కనిపిస్తోంది శ్రియ.
‘గమనం’లో ఆమె మూగ పాత్రలో అద్భుతంగా నటించారని, త్వరలో విడుదల చేయనున్నామని చిత్ర యూనిట్ తెలిపారు. ఆ రకంగా ‘నిశ్శబ్దం’ మూవీలో అనుష్క, ‘గమనం’ సినిమాలో శ్రియ మూగ పాత్రల్లో ప్రేక్షకులను మెప్పించనున్నారన్నమాట.