ట్రాన్స్‌జెండర్స్ కోసం అక్షయ్ కోటిన్నర విరాళం

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ లారెన్స్ చారిటబుల్ ట్రస్టుకు కోటిన్నర విరాళమిచ్చారు..

  • Publish Date - March 1, 2020 / 11:28 AM IST

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ లారెన్స్ చారిటబుల్ ట్రస్టుకు కోటిన్నర విరాళమిచ్చారు..

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ రియల్ లైఫ్ హీరో అని చాలా సందర్భాల్లో నిరూపించుకున్నాడు. చిన్నారులకు, పేదలకు, రైతులకు పలుసార్లు వివిధ రకాలుగా సహాయం చేసిన అక్షయ్ తాజాగా రూ.1.5 కోట్లు హెల్ప్ చేసి మరోమారు తన మంచి మనసు చాటుకున్నారు. వివరాళ్లోకి వెళ్తే.. ఫేమస్ కొరియోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ రాఘవ లారెన్స్ కాంచన సిరీస్‌తో డైరెక్టర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘ముని’, ‘కాంచన’, ‘గంగ’, ‘కాంచన-3’ (ముని4) సినిమాలతో వరస విజయాలు అందుకున్నాడు.

‘కాంచన’ చిత్రాన్ని బాలీవుడ్‌లో ‘లక్ష్మీబాంబ్’ పేరుతో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. అక్షయ్ కుమార్, కైరా అద్వాణీ జంటగా నటిస్తున్నారు. లారెన్స్ క్యారెక్టర్ అక్షయ్ చేస్తున్నాడు. ‘కాంచన’లో హిజ్రాలు కూడా మనలాంటి మనుషులే అని మంచి సందేశమిచ్చాడు దర్శకుడు.. ఇప్పుడు ఆ హిజ్రాల కోసం తనవంతు సహాయం చేశారు అక్షయ్. భారతదేశంలో మొట్టమొదటి సారిగా హిజ్రాల కోసం నిర్మిస్తున్న భవనానికి ఆయన రూ.కోటిన్నర విరాళమిచ్చారు.

లారెన్స్ చారిటబుల్ ట్రస్ట్ పేరుతో లారెన్స్ పలు సేవా కార్యక్రమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. చిన్నారులు, పేదలు, వికలాంగులకు విద్య, వసతి, ఆరోగ్యం వంటి సదుపాయలు కల్పిస్తుంటారాయన. లారెన్స్ చారిటబుల్ ట్రస్ట్  15వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా చెన్నైలో  ట్రాన్స్ జెండర్స్ వసతికోసం నూతన భవనాన్ని నిర్మించనున్నారు.

‘లక్ష్మీ బాంబ్’ షూటింగు జరుగుతున్నప్పుడు ఈ విషయాన్ని అక్షయ్‌కు చెప్పగా.. విన్న వెంటనే మరో మాట లేకుండా  రూ.కోటిన్నర విరాళమిస్తున్నట్టు అక్షయ్ చెప్పారని లారెన్స్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ మేరకు పలువురు హిజ్రాలు అక్షయ్‌ని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ‘లక్ష్మీ బాంబ్’ 2020 జూన్ 5న విడుదల కానుంది.