Amitab
Amitabh Bachchan: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఈరోజు(11 అక్టోబర్ 2021) తన 79వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. దేశమంతా అభిమానులు ఈరోజు అమితాబ్ బచ్చన్ పుట్టినరోజును ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే తన తాజా బ్లాగ్‌ను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. ఓ ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నట్లుగా వెల్లడించారు. విమర్శలకు ఫుల్ స్టాప్ పెట్టేలా ‘కమలా పసంద్’తో తన కాంట్రాక్ట్‌ని రద్దు చేసుకున్నారు అమితాబ్ బచ్చన్.
‘కమలా పసంద్’ గుట్ఖా ప్రకటన కంట్రాక్ట్ నుంచి వైదొలిగినట్లు అమితాబ్ బచ్చన్ తన బ్లాగ్‌లో రాసుకొచ్చారు. అకస్మాత్తుగా బ్రాండ్‌తో తన ఒప్పందాన్ని రద్దు చేసుకుని, ఆ సంస్థ నుంచి తీసుకున్న పారితోషికాన్ని వెనక్కి తిరిగి ఇచ్చేశారు అమితాబ్. అమితాబ్ ‘కమలా పసంద్’ గుట్ఖా ప్రకటన విషయంలో చాలా విమర్శలు ఎదుర్కొన్నారు. పొగాకు ఉత్పత్తి అయిన పాన్ మసాలా ”కమలా పసంద్”ని అమితాబ్ ప్రమోట్ చేయడం తీవ్ర విమర్శలకు దారి తీసింది.
పొగాకు నిర్మూలన కోసం పనిచేస్తున్న నేషనల్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ శేఖర్ సల్కర్ ఈ విషయంపై అమితాబ్ బచ్చన్‌కు లేఖ కూడా రాశారు. ఈ లేఖలో పొగాకు, పాన్ మసాలా వంటి పదార్థాలు యువత ఆరోగ్యానికి హాని కలిగిస్తాయని వైద్య పరిశోధనలో తేలిందని, పోలియో ప్రచారం, ఇంకా ఎన్నో మంచి విషయాలకు అధికారిక బ్రాండ్ అంబాసిడర్ అయిన అమితాబ్.. వీలైనంత త్వరగా పాన్ మసాలా ప్రకటన నుంచి తప్పుకోవాలని కోరారు.
ఈ క్రమంలోనే అమితాబ్ ఆ సంస్థతో కాంట్రాక్టును రద్దు చేసుకున్నారు. ఈమేరకు ఓ లేఖ కూడా సదరు సంస్థకు పంపారు. పాన్ మసాలా అనేది నిషేధిత పొగాకు ఉత్పత్తి అనే విషయం తనకు తెలియదని, ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే వస్తువుకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండలేనని, తన కాంట్రాక్టును రద్దు చేసుకుంటున్నట్లు సంస్థకు లేఖలో వెల్లడించారు. తనకు పారితోషికంగా ఇచ్చిన మొత్తాన్ని వెనక్కి పంపారు.