#BoycottFilmfare ఇవి ఫిలింఫేర్ అవార్డులా.. ట్విట్టర్‌లో తాట తీస్తున్న నెటిజన్స్..

ట్విట్టర్‌లో #BoycottFilmfare హ్యాష్ ట్యాగ్‌తో ట్రెండ్ అవుతున్న 65వ ఫిలింఫేర్‌ అవార్డుల వ్యవహారం..

  • Publish Date - February 17, 2020 / 09:04 AM IST

ట్విట్టర్‌లో #BoycottFilmfare హ్యాష్ ట్యాగ్‌తో ట్రెండ్ అవుతున్న 65వ ఫిలింఫేర్‌ అవార్డుల వ్యవహారం..

ఈ ఏడాది ఫిలింఫేర్ అవార్డుల కార్యక్రమంలో అనర్హులకు అవార్డులిచ్చారంటూ సోషల్ మీడియా వేదికగా పలువురు విమర్శిస్తున్నారు. 65వ ఫిలింఫేర్‌ అవార్డుల కార్యక్రమం శనివారం అస్సాంలోని గువాహటిలో అ‍ట్టహాసంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ ఆవార్డుల్లో బాలీవుడ్‌మూవీ ‘గల్లీ బాయ్‌’ చిత్రానికి అవార్డుల పంట పండింది.

‘గల్లీ బాయ్’ మూవీకి ఏకంగా 13 విభాగాల్లో అవార్డులను ఇవ్వడంతో నెటిజన్స్ నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2’ చిత్రానికి గానూ బెస్ట్ డెబ్యూ యాక్ట్రెస్ అవార్డు అనన్య పాండేకు ఇవ్వడం సరైంది కాదని అంటున్నారు. ఈ ఏడాది ఫిలింఫేర్ అవార్డ్స్ కొందరి కనుసన్ననలో కొందరికి అనుకూలంగా జరిగాయనేది విమర్శకుల వాదన. ఇక ఈ వివాదం ట్విట్టర్‌లో #BoycottFilmfare హ్యాష్ ట్యాగ్‌తో ట్రెండ్ అవుతోంది. 

అక్షయ్ కుమార్ నటించిన ‘కేసరి’, హృతిక్ రోషన్ ‘సూపర్ 30’ సినిమాలకు ఏ కేటగిరీలోనూ ఒక్క అవార్డ్ కూడా ఇవ్వకపోవడం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ‘గల్లీ బాయ్’ సినిమాలో ‘అప్నా టైమ్ ఆయేగా’ పాటకంటే ‘కేసరి’ చిత్రంలో ‘తేరి మిట్టి’ సాంగ్‌‌లో లిరిక్స్ బాగుంటాయని ‘తేరి మిట్టి’ పాటకు సాహిత్యమందించిన మనోజ్ ముంతాషీర్‌ అవార్డుకి అర్హుడు, అతనికి బెస్ట్ లిరిసిస్ట్ అవార్డ్ ఇవ్వకపోవడం ఏంటనికూడా నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. అయితే తన ప్రతిభకు తగ్గ గౌరవం లభించలేదని, తన పాటకు అవార్డ్ రాకపోవడంతో నిరాశ చెందానని, ఇకమీదట అవార్డు షోలకు హాజరుకానని మనోజ్ ముంతాషీర్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఫిలింఫేర్ అవార్డుల గురిచి స్పందిస్తూ కంగనా రనౌత్ సోదరి రంగోలీ అలియాభట్‌పై విమర్శలు గుప్పించింది. అలియా కంటే బాగా నటించే హీరోయిన్లు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారని.. ‘గల్లీ బాయ్‌’లో ఆమె నటన సాధారణంగా ఉందని.. అలియా ప్రధాన పాత్రలో నటించినప్పటికీ ఆమె సహాయ నటి లాగా కనిపించిందని.. అలాంటి ఆమెకు ఉత్తమ నటి అవార్డు ఎలా ఇచ్చారని ఫైర్ అయింది రంగోలి. 

Read More>>మహాశివరాత్రి  స్పెషల్ : శివుడి కోసం రైల్లో బెర్త్ రిజర్వు