మెగాస్టార్ మంచిమనసు.. CCC ఆధ్వర్యంలో మూడవ విడత సహాయం..

  • Publish Date - August 21, 2020 / 01:19 PM IST

‌CCC helps cine workers for third time: కరోనా లాక్‌డౌన్ నేప‌థ్యంలో సంపాదన కోల్పోయిన సినీ కార్మికులను ఆదుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో క‌రోనా క్రైసిస్ ఛారిటీ (సీసీసీ) ఏర్పాటైన సంగతి తెలిసిందే. దీని ద్వారా ఇప్పటికే రెండు సార్లు వేలాది మంది సినీ కార్మికులకు సహాయం అందించారు. ప్రస్తుతం మూడోసారి కూడా సహాయం అందిస్తున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ మెగాస్టార్ చిరంజీవి ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేశారు.



‘‘షూటింగ్‌లు ఇంకా ప్రారంభం కాకపోవడంతో సినీ కార్మికుల పరిస్థితి చాలా కష్టంగా ఉంది. అందుకే సీసీసీ తరపున మూడో సారి కూడా వారికి సహాయం చేస్తున్నాం. వారికి అవసరమైన నిత్యావసర సరుకులను అందిస్తున్నాం. ఇప్పటికే పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాం. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపు పదివేల మందికి అందిస్తున్నాం. ఈ క్లిష్ట పరిస్థితులు తాత్కాలికమే. త్వరలోనే మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంటాం. అప్పటివరకు అందరూ ధైర్యంగా, ఆరోగ్యంగా ఉండాలి.. ఈ వినాయకచవితి పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవాలి.. యధావిధిగా మేమందరం కలిసి హాయిగా పనిచేసుకోవాలి, సంతోషంగా ఉండాలని అందరం వినాయకుడికి మొక్కుకుందాం.. అందరికీ గణేష్ చతుర్థి శుభాకాంక్షలు’’.. అని చిరంజీవి ఆకాంక్షించారు.