చాణక్య – రివ్యూ
మ్యాచో హీరో గోపిచంద్, మెహరీన్, జరీన్ ఖాన్ ప్రధాన పాత్రల్లో.. తిరు దర్శకత్వంలో, ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మించిన స్పై థ్రిల్లర్ .. 'చాణక్య' రివ్యూ..

మ్యాచో హీరో గోపిచంద్, మెహరీన్, జరీన్ ఖాన్ ప్రధాన పాత్రల్లో.. తిరు దర్శకత్వంలో, ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మించిన స్పై థ్రిల్లర్ .. ‘చాణక్య’ రివ్యూ..
హీరోగా పరిచయం అయినా కాలం కలిసిరాక విలన్‌గా మారి విజయం అందుకుని.. మళ్లీ హీరోగా టర్న్ తీసుకుని సక్సెస్ సొంతం చేసుకున్నాడు మ్యాచో స్టార్ గోపీచంద్. మినిమమ్ గ్యారంటీ హీరోగా ఎదిగిన గోపీచంద్.. కొంతకాలంగా కథల ఎంపికలో చేసిన పొరపాట్ల వల్ల సక్సెస్ అనేది లేక ఇబ్బంది పడుతున్నాడు. ఇలాంటి టైంలో తమిళ్ డైరెక్టర్ తిరు చెప్పిన స్పై థ్రిల్లర్ స్టోరీ నచ్చి.. చాణక్య సినిమా చేశాడు. ఒక పక్క ‘సైరా’ స్వింగ్ కొనసాగుతున్నా.. ముందు చెప్పినట్టు అనుకున్న డేట్‌కే రిలీజ్ చేయడంతో ఈ సినిమాపై పాజిటివ్ ఒపీనియన్ కలిగింది. గోపీచంద్‌తో పాటు మెహరీన్, జరీన్ ఖాన్ నటించిన ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎలా ఉంది అనేది ఇప్పుడు చూద్దాం.
కథ విషయానికి వస్తే : అర్జున్, తన చిన్నప్పుడే ఆర్మీలో పని చేస్తున్న తన తల్లిదండ్రులు చనిపోవడంతో.. ఆర్మీ బేస్‌లోనే ఉంటూ.. ఆర్మీ పాఠశాలలోనే చదువుకుంటూ.. పెరిగి పెద్ద వాడు అయ్యి.. అండర్ కవర్ ‘రా’ ఏజెంట్‌గా పనిచేస్తుంటాడు. ఓ మిషన్‌లో భాగంగా పాకిస్థాన్‌కు చెందిన తీవ్రవాది ఖురేషీ మనిషిని అర్జున్ తన నలుగురు మిత్రులు కిడ్నాప్ చేసి చంపుతారు. దీంతో అర్జున్ మీద ఎలాగైనా పగ తీర్చుకోవాలని ఖురేషి కొడుకైన సోహెల్.. అర్జున్ నలుగురు మిత్రులను కిడ్నాప్ చేసి.. పాకిస్థాన్‌లో బంధించి అర్జున్‌కు సవాల్ విసురుతాడు. ఈ క్రమంలో అర్జున్ ఆ టెర్రరిస్టుల నుండి తన మిత్రులను ఎలా కాపాడుకున్నాడు. ఇందులో ఐశ్వర్య, జుబేదాల పాత్రలేమిటి అనేది సినిమా చూసి తెలుసు కోవాల్సిందే.
Read Also : విజయ్ ఆంటోనితో అక్షర హాసన్..
నటీనటుల విషయానికొస్తే : చూడడానికి డైనమిక్‌గా ఉండే గోపీచంద్ ఈ సినిమాలో కూడా లుక్ పరంగా మాత్రం ఫిట్‌గానే కనిపించాడు. ఈ సినిమా షూటింగ్‌లో ఫ్రాక్చర్ అవడంతో కొన్ని రోజులు రెస్ట్ తీసుకున్నా కూడా లుక్స్ పరంగా ఆ డిఫరెన్స్ తెలియకుండా కవర్ చేశాడు. ఇక తన అనుభవంతో చాణక్య పాత్రను బాగానే పోషించి మెప్పించాడు.
‘పంతం’ సినిమాలో గోపీచంద్‌తో కలిసి నటించిన మెహరీన్ మళ్ళీ ఈ సినిమాలో కూడా పెయిర్ అప్ అయ్యింది. అయితే ఆమెకి మాత్రం ఒక సగటు హీరోయిన్ పాత్ర దక్కింది. బాలీవుడ్ హీరోయిన్ జరీన్ ఖాన్‌కి మాత్రం కాస్త స్కోప్ ఉన్న క్యారెక్టర్ రాసుకున్నారు. ఇక గోపీచంద్ మిత్రుడిగా నటించిన సునీల్.. డాగ్స్ డాక్టర్‌గా నటించిన అలీ.. కామెడీతో పర్వాలేదు అనిపించారు. మిగతా నటీనటులందరు తమ పాత్రల పరిధిమేర నటించి మెప్పించారు.
టెక్నీషియన్స్ గురించి చెప్పాలంటే : గతంలో విశాల్‌తో మూడు యాక్షన్ సినిమాలు చేసి.. నాలుగో సినిమాగా ‘చంద్రమౌళీ’ అనే కామెడీ సినిమాచేసి అది కూడా సక్సెస్ కాకపోవడంతో.. తను నమ్ముకున్న యాక్షన్ కథను రాసుకుని.. గోపీచంద్‌తో ‘చాణక్య’ అనే సినిమాను తెరకెక్కించాడు డైరెక్టర్ తిరు. స్పై థ్రిల్లర్ జోనర్ అని చెప్పినా చాణక్య.. సినిమాలోకి వచ్చే సరికి ఓ సాధా సీదా సినిమాలా కనిపించింది. ఇక మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ చంద్రశేఖర్ డైరెక్టర్ విజన్‌కు అణుగుణంగా అందించాడు. బ్యాగ్రౌండ్ స్కొర్ పర్వాలేదు. డైరెక్టర్ తిరుకు కలిసొచ్చిన సినిమాటోగ్రాఫర్ వెట్రీ పళనీ స్వామి కెమెరా పనితనం ఆకట్టుకుంది. విజువల్స్ రిచ్‌గా చూపించే ప్రయత్నం చేశాడు. గోపీచంద్ స్టైలిష్ లుక్ బాగా ఎలివేట్ చేశాడు. మాటల రచయిత అబ్బూరి రవి డైలాగ్స్ బాగున్నప్పటికీ.. తిరు రాసిన కథలో సరైన ఎలివేషన్ లేకపోవడంతో.. డైలాగ్స్ అనకున్నంత మెరుపులు మెరిపించలేకపోయాయి. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ఓవరాల్‌గా చెప్పాలి అంటే ‘చాణక్య’ ఓ సగటు యాక్షన్ సినిమాగానే కనిపిస్తుంది. స్పై థ్రిల్లర్ జానర్‌ను డైరెక్టర్ సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోవడం సినిమాకు మైనస్. గోపీచందకు బి, సి సెంటర్స్‌లో ఫాలోయింగ్ ఉండటం, దసరా సెలవులు కావడంతో కలక్షన్స్ బాగా రాబట్టే అవకాశం ఉంది.
ప్లస్ పాయింట్స్
సినిమాటోగ్రఫీ
నిర్మాణ విలువలు
మైనస్ పాయింట్స్
కథ, కథనాలు
లాజిక్ లేని సీన్స్
కామెడీ
క్లైమాక్స్