ఢిల్లీకి వెళ్లనున్న చిరంజీవి: మోడీతో భేటీ.. ఎప్పుడంటే!

  • Publish Date - October 14, 2019 / 02:32 PM IST

రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాలతో బిజీ అయిపోయిన మెగాస్టార్ చిరంజీవి మళ్లీ పొలిటికల్ నాయకులను కలుస్తున్నారు. ఈ క్రమంలోనే లేటెస్ట్ గా సోమవారం(14 అక్టోబర్ 2019) ఏపీ ముఖ్యమంత్రి జగన్‌తో కలిసిన చిరంజీవి ఢిల్లీకి వెళ్తున్నారు. అక్టోబర్ 16వ తేదీన ఢిల్లీ వెళ్లేందుకు చిరంజీవి ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తుంది.

మెగాస్టార్ చిరంజీవితో కలిసి గంటా శ్రీనివాస్ ఢిల్లీ వెళ్లి అక్కడ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని కలిసే అవకాశం ఉన్నట్లుగా చెబుతున్నారు. దేశవ్యాప్తంగా తొలి స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సైరా సినిమాను చూడమని చిరంజీవి వెంకయ్య నాయుడుని అడిగే అవకాశం ఉంది.

అనంతరం ప్రధాని మోడీ అపాయింట్‌మెంట్ కోసం కూడా చిరంజీవి ప్రయత్నించినట్లుగా తెలుస్తుంది. ఆయన అపాయింట్‌మెంట్ కూడా దొరికితే మోడీని కూడా కలసే అవకాశం ఉంది. అయితే మోడీతోపాటు గంటా శ్రీనివాస్ కూడా మోడీని కలిసే అవకాశం ఉందని తెలుస్తుండగా.. వీరి భేటికి రాజకీయ ప్రాధన్యత ఉందా? అనే విషయమై ఆసక్తికర చర్చ నడుస్తుంది. 

ఇదిలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మకంగా తీసిన సినిమా సైరా నరసింహారెడ్డి 12 రోజులుగా మంచి వసూళ్లు రాబడుతుంది. తెలుగు, కన్నడ, తమిళ, హిందీ, మళయాల భాషల్లో సినిమా విడుదల అవగా.. తెలుగు మాత్రం మంచి వసూళ్లు వచ్చినా మిగిలిన భాషల్లో పెద్దగా కలెక్షన్లు రావట్లేదు. ఈ క్రమంలో ప్రధానిని కలవడం చర్చనీయాంశం అయ్యింది.