కరోనా కారణంగా లాక్‌డౌన్ విధించడంతో ఇళ్లకే పరిమితమైన సినీ నటులు అనుకోకుండా దొరికిన ఈ సమయాన్ని కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతున్నారు. చేయాలనుకుని చేయలేనివి, ఇష్టమైనవి చాలా పనులు చేస్తున్నారు. పనిమనుషులు రాకపోవడంతో తమ పని తామే చేసుకుంటున్నారు.
వర్కౌట్స్ దగ్గరినుండి వంట చేయడం వరకు.. ఇంటి పని నుండి గార్డెనింగ్ వరకు అన్నీ పనులను ఓ పట్టు పడుతున్నారు. తాజాగా మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ తన భార్య ఉపాసన కోసం వంట చేశాడు. బుధవారం నాడు భార్య కోసం డిన్నర్ ప్రిపేర్ చేశాడు. ‘ప్రియమైన భార్య కోసం రామ్‌చరణ్ భోజనం తయారు చేస్తున్నారు. వంట చేసిన తర్వాత ఆయనే వంట గదిని శుభ్రం చేశారు. ఆయన నా హీరో కావడానికి కారణమిదే’ అంటూ చెర్రీ కుక్ చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఇదిలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి పైపు పట్టి ఇంటి ముందున్న ప్రాంతాన్ని చక్కగా శుభ్రం చేశారు. మెగా తండ్రీ కొడుకులు లాక్‌డౌన్ వేళ చేసిన ఈ యాక్టివిటీస్ తాలూకు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చిరు, చరణ్ కలిసి కొరటాల శివ తెరకెక్కిస్తున్న ‘ఆచార్య’ చిత్రంలో నటించనున్న సంగతి తెలిసిందే.