మా లో గొడవలు  : నరేష్ కు షోకాజ్ నోటీసులు!

  • Publish Date - September 11, 2019 / 03:14 PM IST

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌ లో మళ్లీ గొడవలు స్టార్ట్ అయ్యాయి. మా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రాజశేఖర్‌, నరేశ్‌ మధ్య విభేదాలు తలెత్తాయి. అధ్యక్షుడు నరేశ్‌‌కు షోకాజ్‌ నోటీసులు ఇచ్చేందుకు హీరో రాజశేఖర్ సిద్ధమయ్యారు. నరేశ్‌ అన్నింట్లోనూ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారన్న ఆరోపణలు చేస్తున్నారు అసోసియేషన్‌లోని కొందరు సభ్యులు. దీంతో ‘మా’లో చెలరేగిన వివాదాలు ఎక్కడికి దారితీస్తాయోనని కొందరు కార్యవర్గ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మా’ కార్యవర్గం ఏర్పడి ఆరు నెలలు ముగిసినా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకపోవడంతో నరేశ్‌పై వ్యతిరేకత పెరిగింది. నరేశ్ సొంత పనులతో బిజీగా ఉండడం వల్ల ‘మా’ను పట్టించుకోవడం లేదని సభ్యులంతా ఒకే అభిప్రాయాన్ని వెల్లడించారు. పైగా ఎలాంటి కార్యక్రమమూ మొదలు పెట్టకుండానే.. నరేశ్ రూ. 20 లక్షలు ఖర్చు పెట్టడంపై రాజశేఖర్ ప్రశ్నించారు.

మా అధ్యక్షుడిగా నరేశ్‌ను కొనసాగిద్దామా? లేక పదవి నుంచి తొలగిద్దామా? అంటూ కార్యవర్గ సభ్యుల అభిప్రాయం తీసుకునే ప్రయత్నం కూడా చేశారు రాజశేఖర్. చట్టపరంగా నరేశ్‌కు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని ఏకాభిప్రాయానికి వచ్చారు.