సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ ‘దర్బార్’ చిత్రంతో నష్టపోయిన పంపిణీదారులు నిరాహార దీక్ష చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు..
ఏదైనా ఓ సినిమా బాగుంది అంటే నిర్మాతకు లాభాలు, హీరోతో పాటు దర్శకుడు, నటీనటులు, సాంకేతిక నిపుణులకు పేరొస్తుంది. ఇంచుమించు పంపిణీదారులదీ ఇదే పరిస్థితి. ఒకోసారి బయ్యర్స్ భారీ లాభాలు చవిచూస్తారు. నష్టాలూ భరిస్తారు. భారీ అంచనాల మధ్య కొన్న పెద్ద హీరో సినిమా ఫ్లాప్ అయితే మొట్టమొదటిగా రోడ్డు మీదకి వచ్చేది వాళ్లే.
ఇప్పుడు ఓ పెద్ద సినిమా విషయంలో డిస్ట్రిబ్యూటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ ‘దర్బార్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.250 కోట్లు వసూలు చేసందని నిర్మాత చెప్పారు. కానీ డిస్ట్రిబ్యూటర్లు మాత్రం భారీ నష్టాలతో రోడ్డెక్కారు. ‘దర్బార్’ చిత్రంతో దాదాపు రూ.70 కోట్లు నష్టపోయామని పంపిణీదారులు తెలిపారు. దీంతో ఈ చిత్ర పంపిణీదారులు హీరో రజనీకాంత్‌ను కలవడానికి చెన్నైలోని ఆయన ఇంటికి వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసులు ఆయనను కలవకుండా వారిని అడ్డుకోవడంతో నిరాహార దీక్ష చేయాలని పంపిణీదారులు నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
గతంలో భారీ అంచనాల మధ్య విడుదలై బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడ్డ ‘బాబా’ చిత్రంతో డిస్ట్రిబ్యూటర్లు భారీగా నష్టపోయారు. దీంతో రజనీ కొంతమేర వారిని ఆదుకున్నాడు. ఇంతకుముందు రజనీ ‘లింగ’ సినిమాకు కూడా బయ్యర్లు భారీగా నష్టపోయారు. ఇప్పుడు ‘దర్బార్’ విషయంలో రజనీ ఎలా స్పందిస్తారో చూడాలి. ఈ సినిమాకు ఆయన రూ.108 కోట్లు పారితోషికం తీసుకున్నారని సమాచారం.