Dasari Biopic
Dasari biopic on cards: తెలుగు సినిమా ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉండి, అనేక సినిమాలకు దర్శకత్వం వహించిన దర్శకరత్న దాసరి స్మారకార్ధం “దాసరి నారాయణరావు నేషనల్ ఫిల్మ్ & టివి నేషనల్ అవార్డ్స్” ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ప్రముఖ నిర్మాత తాడివాక రమేష్ నాయుడు ప్రకటించారు.
ఇందుకోసం ఇప్పటికే “దాసరి నారాయణరావు మెమోరియర్ కల్చరల్ ట్రస్ట్” ఏర్పాటు చేసినట్లు చెప్పిన ఆయన.. వివిధ భాషల కళాకారులకు.. సాంకేతిక నిపుణులకు జీవన సాఫల్య పురస్కారాలు(లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్స్) ఇవ్వనున్నట్లు చెప్పారు.
దాసరికి వీరాభిమాని అయిన తాడివాక రమేష్ నాయుడు.. ప్రముఖ దర్శకుడు ధవళ సత్యం దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో త్వరలో “దాసరి బయోపిక్” నిర్మించబోతున్నట్లుగా వెల్లడించారు. ఈ బయోపిక్ పేరు “దర్శకరత్న”. ఇమేజ్ ఫిల్మ్స్ పతాకంపై అతి త్వరలో సెట్స్‌పైకి వెళ్లనున్న “దర్శకరత్న” బయోపిక్‌లో ఓ ప్రముఖ హీరో దాసరి పాత్రను పోషించనున్నట్లు చెప్పారు.
ఈ సందర్భంగా రమేష్ నాయుడు మాట్లాడుతూ.. “నా గురువు, దైవం దాసరి పేరిట ప్రతి ఏటా ఫిల్మ్ అండ్ టీవీ నేషనల్ అవార్డ్స్ ఇవ్వాలని అనుకుంటున్నాము. అలాగే దాసరికి అత్యంత సన్నిహితులు, ప్రముఖ దర్శకులైన ధవళ సత్యం దర్శకత్వంలో “దర్శకరత్న” పేరుతో దాసరి బయోపిక్ నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం.. ధవళ సత్యం గారు ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తి చేశారు. స్క్రిప్ట్ అత్యద్భుతంగా వచ్చింది. ఓ ప్రముఖ హీరో దాసరిగా నటించనున్నారు. పూర్తి వివరాలు అతి త్వరలో ప్రకటిస్తాం” అని అన్నారు.